పాలమూరు-రంగారెడ్డి... భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు. వలసల జిల్లాగా పేరుపొందిన ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ‌జిల్లాకు, దుర్భిక్షానికి నెలవైన రంగారెడ్డి జిల్లాకు సాగునీరు  అందించాలనే లక్ష్యంతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టు పనులపై ఇవాళ సీఎం కేసీఆర్‌ ఫోకస్‌ పెట్టారు. ప్రాజెక్టు  నిర్మాణ పనులపై ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణాలకు అడ్డంకిగా ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించి నిర్మాణ  పనులు గడువులోగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టనున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయంలో ఇవాళ సీఎం కేసీఆర్‌ అధ్యక్షత జరగనున్న ఉన్నతస్థాయి  సమీక్షా సమావేశంలో... ప్రాజెక్టు పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రెవెన్యూ, ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు, సీనియర్ ఇంజనీరింగ్ అధికారులు కూడా  హాజరుకానున్నారు. 


పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్‌ ప్రాజెక్టులో కీలకమైన నార్లాపూర్ పంప్ హౌస్‌లో డ్రైరన్‌ను కూడా విజయవంతంగా పూర్తి చేశారు ఇరిగేషన్‌ అధికారులు. దీంతో..  ఈనెలాఖరులోగా ఆ ప్రాజెక్టును ప్రారంభించొచ్చని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఈ సమీక్షా సమావేశంలోనే ముహూర్తం కూడా ఖరారు చేసే  అవకాశాలున్నాయని ఇరిగేషన్‌ అధికారుల నుంచి సమాచారం అందుతోంది. 


పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలోని మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నారాయణపేట్, వికారాబాద్, నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు,  ఎమ్మెల్యేలను కూడా సీఎం కేసీఆర్‌ నిర్వహిస్తున్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొననున్నారు. ఈ ఆరు జిల్లాల్లోని 70 మండలాల్లో కరువు పరిస్థితులను  పారద్రోలడానికి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన స్టేతో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో ఐదేళ్లపాటు జాప్యం  జరిగింది. ఇటీవలే స్టే ఎత్తేయడంతో.. ప్రాజెక్టు నిర్మాణాలకు అనుమతులు దొరికాయి. దీంతో ఇంజనీర్లు, కాంట్రాక్టు ఏజన్సీలు పగలు రాత్రి అనే తేడా లేకుండా నిర్మణ పనుల్లో  నిమగ్నమై ఉన్నారు. 


ఎన్నికలలోపే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. ఈనెల 15 లేదా 17వ తేదీల్లో ప్రారంభోత్సవం ఉండొచ్చని కూడా సమాచారం.  కరివెన జలాశయం వరకు నీటిని తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలపై సీఎం కేసీఆర్ ఇవాళ సమీక్షించనున్నారు.  అక్కడక్కడా పూర్తి చేయాల్సిన పనులు, క్షేత్రస్థాయి ఇబ్బందులపై ముఖ్యమంత్రి ఫోకస్‌ పెడుతున్నారు. కాల్వల నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభం కాగా..  ఆయా అంశాలపై కూడా సమీక్షించి నిర్ణయాలు తీసుకోనున్నారు సీఎం కేసీఆర్‌.