వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో ఉన్న ఆవర్తనం ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లోని దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరాల్లో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలో మీటర్ల వరకు వ్యాపించి ఎత్తుకి వెళ్లే కొలది నైరుతి దిశ వైపుకి వాలి ఉంది. ఈ అల్పపీడనము రాగల 24 గంటల్లో  సుమారు పశ్చిమ దిశగా,  దక్షిణ ఒడిస్సా మరియు దక్షిణ ఛత్తీస్ ఘడ్ మీదగా కదిలే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.


ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఈరోజు రాష్ట్రంలో భారీ నుండి అతిభారీ వర్షాలు అక్కడక్కడ కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశం ఉంది. రేపు భారీ వర్షాలు అక్కడక్కడ కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశం ఉంది. ఈరోజు, రేపు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో (గాలి వేగం గంటకు 40 నుండి 50 కిలో మీటర్లతో) కూడిన వర్షాలు అక్కడక్కడ కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశం ఉంది.


సెప్టెంబర్ 6న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 


హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 26 డిగ్రీలు, 22 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 10 నుంచి 12 కిలో మీటర్ల వేగంతో వాయువ్య దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 25.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 21.5 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 95 శాతంగా నమోదైంది.


ఏపీలో ఇలా
అల్పపీడన ప్రభావంతో రెండు రోజులపాటు ఏపీకి భారీ వర్ష సూచన ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ రోజు కోస్తా రాయలసీమలో ఓ మోస్తరు నుంచి ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కాకినాడ, కృష్ణ, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, తూర్పు గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు, కోనసీమ, వెస్ట్ గోదావరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.


రాయలసీమలో కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అంచనా వేశారు. నాలుగు రోజులపాటు సముద్రంలో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచనలు జారీ చేశారు. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు అంచనా వేశారు.