బయట ఎక్కడ ఆహార పదార్థాలు తీసుకున్నా కూడా వాటిని అల్యూమినియం ఫాయిల్ కవర్స్ లో ఇస్తారు. అవి తిన్న తర్వాత ఆహారం మిగిలిపోతే అలాగే కవర్స్ లో ఉంచి నిల్వ చేయడం చూస్తూనే ఉంటారు. కొన్ని సార్లు అయితే ఆ ఫాయిల్ తో అలాగే ఉంచి ఓవెన్ లో పెట్టి వేడి చేస్తారు. కానీ అది ఆరోగ్యానికి ఎంత హానికరం అనే విషయం చాలా మందికి తెలియదు. ఇవే కాదు అల్యూమినియం పాత్రల్లో వండిన ఆహారం తినడం వల్ల అది మన శరీరంలోకి చేరి హాని కలిగిస్తుంది.


సాధారణంగా ఒక సగటు వ్యక్తికి రోజుకి ఆహారం నుంచి 5 మిల్లీ గ్రాముల వరకి అల్యూమినియాన్ని తినొచ్చు. అంతకుమించి తీసుకుంటే మాత్రం అది ఇతర అనార్థాలకి దారి తీస్తుంది. అంతేకాదు అల్యూమినియం ఫాయిల్ అలాగే ఉంచిన పదార్థాలు ఓవెన్ లో పెట్టి వేడి చేయడం వల్ల చాలా ప్రమాదకరం. అధిక ఉష్ణోగ్రత వద్ద తయారు చేసిన ఆమ్ల లేదా స్పైసీ ఫుడ్ విషయంలో ఇటువంటి పని అసలు చెయ్యకూడదు. ఆహారాన్ని అల్యూమినియం ఫాయిల్ లో ఉంచి నిల్వ చేయడం అసలు సురక్షితం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


అధ్యయనం ఏం చెబుతోంది?


ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎలెక్ట్రోకెమికల్ సైన్స్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక పరిశోధన ప్రకారం అల్యూమినియం పాత్రల్లో  నుంచి కొన్ని రకాల ద్రావణాలు బయటకి వస్తాయి. ఆల్కహాలిక్ తో పోల్చిన దానితో చూస్తే అల్యూమినియం పాత్రల నుంచి విడుదలయ్యే కారకాలు ఎక్కువ ప్రమాదంగా ఉన్నట్లు తేలింది. అలాగే అల్యూమినియం ఫాయిల్ అలాగే ఉంచి అధిక ఉష్ణోగ్రత దగ్గర వేడి చేసినప్పుడు ఆ  లోహం ఆహారపదార్థాల్లోకి చేరుతుంది.


ఆక్సిజన్ చేరనివ్వదు


అల్యూమినియం ఫాయిల్ లో మిగిలిపోయిన ఆహారాన్ని నిల్వ చేయకూడదని అనేందుకు ప్రధాన కారణం ఆహారంలోకి ఆక్సిజన్ రాకుండా చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఆహారం లోపల బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇది మరుసటి రోజుకే ఆహారాన్ని పాడు చేస్తుంది.


అల్యూమినియం ఫాయిల్ కి బదులుగా మిగిలిపోయిన ఆహారాన్ని నిల్వ చేసేందుకు, ఎక్కువ కాలం అవి తాజాగా ఉంచేందుకు వేరే పాత్రలు తీసుకుని వాటికి క్లింగ్ వ్రాప్ వేసి  ఉపయోగించుకోవచ్చు. ఇది కుదరకపోతే మూత ఉండే పాత్రలు, కంటైనర్ లు ఉపయోగించడం మంచిది. ఇది ఆక్సిజన్ తో సంబంధం లేకుండా ఆహారాన్ని చెడిపోనివ్వకుండా చేస్తుంది. కంటైనర్ లో ఆహారాన్ని జోడించినప్పుడు గది ఉష్ణోగ్రత వద్ద ఉండేలా చూసుకోవాలి. మిగిలిన ఆహారం ఫ్రీజర్ లో వేర్వేరు బ్యాగులు, కంటైనర్ లో నిల్వ చెయ్యడం అనేది చివరిగా ఎంచుకోవాలి.


ఇవే కాదు అల్యూమినియం పాత్రల్లో వండిన వంటలు దీర్ఘకాలికంగా తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వీటితో పాటు అల్జీమర్స్, ఎసిడిటీ, కిడ్నీ వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది.  


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also read: ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారపదార్థాలు త్వరగా చెడిపోతున్నాయా? అలా కాకూడదంటే ఇలా చేయండి