లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'కనెక్ట్' (Connect Movie). దీనికి అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించారు. నయనతారతో ఆయనకు రెండో చిత్రమిది. ఇంతకు ముందు 'మాయ' అని ఓ సినిమా తీశారు. అది హారర్ థ్రిల్లర్. ఇప్పుడీ 'కనెక్ట్' కూడా హారర్ థ్రిల్లర్ అట. పాండమిక్ పీరియడ్ (కరోనా కాలం) నేపథ్యంలో కథ సాగుతుందని చెన్నై టాక్.


టీజర్ విడుదలకు వేళాయె!
'కనెక్ట్' టీజర్‌ను ఈ నెల 18న (శుక్రవారం) విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా ఒక పోస్టర్ విడుదల చేశారు. ప్రభువుకు దణ్ణం పెడుతున్న నయనతారను చూపించారు. ఇందులో ఆమె డ్యూయల్ రోల్ చేశారా? అనేలా ఉంది పోస్టర్.






అనుపమ్ ఖేర్... సత్యరాజ్!
'కనెక్ట్' సినిమాలో సత్యరాజ్, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ఏడాది సంచలన విజయం సాధించిన 'కార్తికేయ 2'లో అనుపమ్ కనిపించారు. తమిళంలో ఆయన ఇంతకు ముందు ఓ సినిమా చేశారు. అయితే, పదిహేనేళ్ల తర్వాత ఆయన నటించిన తమిళ సినిమా 'కనెక్ట్' కావడం విశేషం. 'వాన' హీరో వినయ్ రాయ్, చైల్డ్ యాక్టర్ హనియా నఫీసా కీలక పాత్రలు చేశారు. 


నయన్ భర్తే నిర్మాత!
'కనెక్ట్' సినిమాను నయనతార భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్‌కు చెందిన రౌడీ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. దర్శకుడు అశ్విన్ శరవణన్, ఆయన భార్య కావ్యా కళ్యాణ్ రామ్ కథ అందించారు. ఈ చిత్రానికి పృథ్వీ చంద్రశేఖర్ సంగీతం అందించగా... మణికంఠన్ రామాచారి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వరించారు. త్వరలో సినిమా విడుదల తేదీ అనౌన్స్ చేయనున్నారు.


పెళ్లి తర్వాత నయన్ మూడో చిత్రమిది!
విఘ్నేష్ శివన్‌తో వివాహమైన తర్వాత వస్తున్న నయనతార మూడో చిత్రమిది. పెళ్లి అయిన వారానికి ఓటీటీలో 'ఓ 2' వచ్చింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలు పాత్రలో నటించిన 'గాడ్ ఫాదర్' తెలుగు, హిందీ భాషల్లో విడుదలైంది. ఇది మూడో సినిమా అన్నమాట. అయితే... భర్త నిర్మాణంలో చేసిన తొలి సినిమా కావడంతో ఆమెకు చాలా స్పెషల్ అని చెప్పవచ్చు.


హారర్... నయన్ హిట్ జానర్!
కమర్షియల్ సినిమాల్లో కథానాయికగా పేరు తెచ్చుకున్న నయనతార ఆ తర్వాత మహిళా ప్రాధాన్య చిత్రాలు చేయడం ప్రారంభించారు. వాటిలో కొన్ని మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు ఉన్నాయి. మరికొన్ని హారర్ సినిమాలు కూడా ఉన్నాయి. హారర్ అంటే నయనతారకు హిట్ జానర్ అని చెప్పాలి. ఆమె చేసిన హారర్ సినిమాల్లో మ్యాగ్జిమమ్ సినిమాలు హిట్ అయ్యాయి. 


Also Read : కొన్నేళ్ళుగా కృష్ణ దినచర్య ఇదే - ఆయన ఆరోగ్య రహస్యం ఏంటంటే?


కథానాయికగా రజనీకాంత్ జోడీగా నయనతార నటించిన 'చంద్రముఖి' హారర్ చిత్రమే కదా! ఫిమేల్ సెంట్రిక్ సినిమాలకు వస్తే... 'ఐరా', 'డోరా', 'వసంత కాలం' వంటి హారర్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. నయనతార యువరాణి పాత్రలో కనిపించిన సినిమా 'కాష్మోరా'. కార్తీ కథానాయకుడిగా నటించిన ఆ సినిమా కూడా హారరే.