వేసవిలో చూస్తుండగానే కొండలు కరిగి నదిగా పారుతుంది.  కాలం మారగానే నదిలో క్రమంగా తగ్గి మంచు కొండలుగా పేరుకుపోతుంది. ఆ ప్రదేశాన్ని చూస్తుంటే జగదేశ వీరుడు అతిలోక సుందరి సినిమాలో ‘అందాలో అహోమహోదయం’ పాట గుర్తుకు రావడం ఖాయం. అదే ‘స్పితి లోయ’. జీవితంలో ఒక్కసారైన ఇంత అద్భుతమైన ప్రదేశాన్ని చూసి తరించాల్సిందే. 


ఎక్కడుంది?
హిమాచల్ ప్రదేశ్లోని ఈశాన్య భాగంలో ఉన్న ఓ మారుమూల లోయ  స్పితి. స్పితి అంటే ‘మధ్యలో ఉన్న భూమి’ అని అర్థం. ఈ లోయ టిబెట్‌కు, భారతదేశానికి మధ్యలో ఉంటుంది. అందుకే ఆ పేరు వచ్చింది. మంచు కొండలు కరిగి పారే స్పితి నది చూసేందుకు దేవనదిలా ఉంటుంది. ఇది సముద్రమట్టానికి 3,800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. స్పితి లోయలో చూడాల్సిన విశేషాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. 


లామాల నివాసం
స్పితి లోయ బౌద్ధ లామాలతో నిండి ఉంటుంది. అక్కడికి వెళితే ఎంతో మంది లామాలు వరుసలో మౌనంగా కొండలపై నుంచి నడుచుకుని వెళ్లిపోతుంటారు. బౌద్ధారామాలు, చైత్యాలు ఆ చుట్టుపక్కల ఎన్నో దర్శనమిస్తాయి. 


ఎత్తయిన గ్రామం
ప్రపంచంలో అతి ఎత్తయిన ప్రదేశంలో ఉన్న గ్రామం స్పితి లోయలోనే ఉంది. ఆ గ్రామం పేరు కోమిక్. ఈ గ్రామంలో కేవలం 13 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ గ్రామాన్ని చేరుకోవాలంటే  ఆరు గంటల పాటూ కొండలు ఎక్కాల్సిందే. ఆ గ్రామాన్ని చూస్తే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. 


ప్రాచీన గుహలు
టాబో తెగ ప్రజలు నివసించిన గుహలు ఇంకా అక్కడ కనిపిస్తాయి. టాబోలు వందల ఏళ్ల క్రితం ఆ ప్రాంతాన్ని పాలించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. అక్కడి గుహల్లో వారి రాతి చిత్రాలు కూడా కనిపిస్తాయి. 


శిలాజాల గ్రామాలు
మీకు శిలాజాలు సేకరించే అలవాటు ఉంటే స్పితి వ్యాలీలో ఉన్న హిక్కిమ్, లాంగ్జా గ్రామాలకు వెళ్లాలి. అక్కడ ప్రాచీన ఆనవాళ్లెన్నో దర్శనమిస్తాయి. చాలా పురాతన వస్తువలు అవశేషాలు, శిలాజాలు లభిస్తాయి. ఏరి తెచ్చుకోవచ్చు. 


మమ్మీ టెంపుల్
గియు గ్రామంలో 500 ఏళ్ల నాటి మమ్మీ ఉంది. దానికి గుడిలా కట్టి పదిలంగా ఉంచారు. ఆ మమ్మీ గెలుగ్పా జాతికి చెందిన సన్యాసిదిగా భావిస్తున్నారు అక్కడి ప్రజలు. దీన్ని ఉచితంగా చూడవచ్చు. ఉదయం 8 నుంచి రాత్రి 5 వరకు అనుమతి ఉంటుంది. 


పర్వత బైకింగ్, జడల బర్రెలపై సఫారీ వంటివి కూడా ఇక్కడ అదనపు ఆకర్షణ. చాలా సినిమాలను స్పితిలోయలో చిత్రీకరించారు. అరుదైన జాతుల చెట్లు, జంతువులు ఇక్కడ కనిపిస్తాయి. 


ఎలా వెళ్లాలి?
స్పితి లోయకు దగ్గరగా ఉండే విమానాశ్రయం భుంతర్. అక్కడికి దిల్లీ, సిమ్లా నుంచి విమానాలు తిరుగుతున్నాయి. స్పితికి దగ్గరగా ఉండే రైల్వే స్టేషన్ జోగిందర్ నగర్ నారో గేజ్ రైల్వే స్టేషన్. ఛండీఘడ్, సిమ్లా కూడా స్పితికి కాస్త దగ్గర్లో ఉండే రైల్వే స్టేషన్లే. 


Also read: బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్నారా? ముందుగా ఈ విషయాల్లో ఓ క్లారిటీకి రండి




Also read: నిలబడి ఉన్నప్పుడు రక్తపోటు పెరిగితే అదెంత డేంజరో తెలుసా, అధ్యయనంలో షాకింగ్ రిజల్ట్