అమ్మాయి పుడితే తప్పేంటి? వారసత్వం అంటే అబ్బాయేనా? సమాజంలో తమకు అబ్బాయి పుట్టాలని, తమ ఇంట అబ్బాయి అడుగు పెట్టాలని కోరుకునే కుటుంబాలు ఉన్నాయి. అటువంటి ధోరణిపై సంధించిన వ్యంగ్యాస్త్రం 'జ‌యేష్‌భాయ్‌ జోర్దార్'. ర‌ణ్‌వీర్‌ సింగ్, 'అర్జున్ రెడ్డి' ఫేమ్ షాలినీ పాండే జంటగా నటించిన హిందీ చిత్రమిది. ఇందులో హీరో తల్లిదండ్రులుగా బొమన్ ఇరానీ, రత్న పాఠక్ షా నటించారు. ఈ సినిమా ట్రైలర్ నేడు విడుదల చేశారు. అది ఎలా ఉందంటే... 


గుజరాతీ నేపథ్యంలో రూపొందిన చిత్రం 'జ‌యేష్‌భాయ్‌ జోర్దార్'. టైటిల్ రోల్‌లో జ‌యేష్‌భాయ్‌గా ర‌ణ్‌వీర్‌ సింగ్ నటించారు. ఆయన తండ్రి గ్రామ సర్పంచ్. తన తర్వాత వారసుడిగా తన కుమారుడి (ర‌ణ్‌వీర్‌ సింగ్)ని సర్పంచ్ చేస్తాడు. ఆ తర్వాత మనవడు సర్పంచ్ అవ్వాలని  కోరుకుంటాడు. అయితే... జ‌యేష్‌భాయ్‌ భార్యకు తొలి కాన్పులో అమ్మాయి పుడుతుంది. మరోసారి గర్భం దాలిస్తే... స్కానింగ్ చేయిస్తారు. మళ్ళీ అమ్మాయి పుట్టబోతోందని తెలుస్తుంది. కడుపులో బిడ్డను కాపాడేందుకు భార్య, పిల్లను తీసుకుని జ‌యేష్‌భాయ్‌ ఇంటి నుంచి పారిపోతాడు. వాళ్ళను పట్టుకోవడం కోసం తండ్రి చేసే అన్వేషణ, తండ్రి నుంచి తప్పించుకోవడానికి జ‌యేష్‌భాయ్‌ చేసే ప్రయత్నాలను ట్రైలర్ లో చూపించారు.


Also Read: ఆ గాయం మానడానికి ఆరు నెలలు పట్టింది! - సమంత


ప్రజలను నవ్విస్తూ, సమాజంలో సమస్యను చర్చిస్తూ...  'జ‌యేష్‌భాయ్‌ జోర్దార్' తీసినట్టు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ట్రైలర్‌లో స్కానింగ్ చేసిన డాక్టర్ 'జై శ్రీ కృష్ణ అంటే అబ్బాయి, జై మాతా ది అంటే అమ్మాయి' అని హీరో చెప్పడం సమాజంలో తీరును సున్నితంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడమే! మద్యపానం మీద నిషేధం విధించమని ఓ అమ్మాయి కోరితే... సబ్బుల మీద నిషేధం విధిస్తానని సర్పంచ్ చెప్పడం సమాజంలో ఏదో ఒక మూలన స్త్రీలపై వివక్షను తెరపైకి తీసుకురావడమే. మొత్తం మీద ట్రైలర్ ఆకట్టుకుంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమా మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. 



Also Read: మూవీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్, ఈ వారం థియేటర్లు, ఓటీటీ విడుదలయ్యే సినిమాలు ఏవో తెలుసా?