Narayan Das Narang Death: ఏషియన్ సినిమాస్ అధినేత, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత నారాయణ్ దాస్ కె. నారంగ్ ఇక లేరు. ఈ రోజు ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. అనారోగ్య సమస్యలతో మూడు రోజుల క్రితం హైదరాబాద్ సిటీలోని ప్రముఖ ఆస్పత్రిలో చేరారు. వయసు రీత్యా వచ్చిన ఆరోగ్య సమస్యలతో మరణించినట్టు తెలుస్తోంది. (Narayan Das K Narang Is No More)
నారాయణ్ దాస్ కె. నారంగ్ పూర్వీకులది పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ ప్రాంతం. దేశ విభజన జరిగిన తర్వాత ఇండియా వచ్చారు. ముంబైలో సెటిల్ అయ్యారు. ఆ తర్వాత 1950లలో హైదరాబాద్ వచ్చారు. ఇక్కడ సెటిల్ అయిన తర్వాత వ్యాపారాలు ప్రారంభించారు. తొలుత సినిమాలకు ఫైనాన్స్ చేశారు. సుమారు 650కు పైగా సినిమాలకు ఆయన ఫైనాన్స్ చేశారు. అలాగే, డిస్ట్రిబ్యూషన్ చేశారు.
తేజ దర్శకత్వంలో నితిన్ హీరోగా, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి భాగస్వామ్యంతో 'ధైర్యం' సినిమా నిర్మించారు. ఆ తర్వాత కొన్నాళ్ళు నిర్మాణానికి దూరంగా ఉన్నా... ఫైనాన్స్ చేయడం ఆపలేదు. కొంత విరామం తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా 'లవ్ స్టోరీ' నిర్మించారు (Love Story Movie Producer Narayan Das Narang Passes Away at 76). నాగశౌర్య హీరోగా 'లక్ష్య' కూడా నిర్మించారు. ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా ఒక సినిమా (D 46), నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'ది ఘోస్ట్' సినిమా నిర్మిస్తున్నారు. సుమారు పది సినిమాల వరకూ నిర్మాణ దశలో ఉన్నాయి. నిర్మాతలు పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ భాగస్వామ్యంతో ఇప్పుడు సినిమాలు నిర్మిస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్లు లీజుకు తీసుకుని ఏషియన్ గ్రూప్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మహేష్ బాబు (AMB Cinemas), విజయ్ దేవరకొండ (AVD Cinemas) భాగస్వామ్యంతో మల్టీప్లెక్స్‌లు ప్రారంభించారు. అమీర్‌పేటలో అల్లు అర్జున్ భాగస్వామ్యంతో సత్యం థియేటర్ స్థలంలో (AAA Cinemas) మల్టీప్లెక్స్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ మల్టీప్లెక్స్ నిర్మాణ దశలో ఉంది.
కన్యలాల్ నారంగ్, లీలావతి నారంగ్ దంపతులకు నారాయణ్ దాస్ కె. నారంగ్ జన్మించారు. ఆయనకు ముగ్గురు సోదరులు హరి భగవాన్, ప్రకాష్, అశోక్... సోదరీమణులు రాణి, పాయల్, మీన ఉన్నారు. నారాయణ్ దాస్ కె. నారంగ్ భార్య పేరు సునీత. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. వారిలో సునీల్ నారంగ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. ఆయన కాకుండా భరత్, మోనా ఉన్నారు.
Also Read: ఆ గాయం మానడానికి ఆరు నెలలు పట్టింది! - సమంత
నారాయణ్ దాస్ కె. నారంగ్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నారంగ్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
Also Read: మూవీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్, ఈ వారం థియేటర్లు, ఓటీటీ విడుదలయ్యే సినిమాలు ఏవో తెలుసా?