గురక పెట్టి నిద్రపోయేవారిని చూసి కామెడిగా నవ్వేస్తారు. కానీ ఇది చాలా పెద్ద అనారోగ్య సమస్య అని తెలుసా? గురక వల్ల నిద్రలో పెద్దపెద్ద శబ్దాలు చేయడం పక్కవారి నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. కొందరైతే దీన్ని చాలా ఫన్నీగా భావిస్తుంటారు. కానీ, అది ఓ మెదడు వ్యాధికి సంకేతమనే సంగతి చాలామందికి తెలియదు. గురక పెట్టేవారు తరచుగా నిద్రా భంగం కలగడం, ఆక్సిజన్ సరిపోకపోవడం వంటివి ఎదుర్కొంటారు. నిద్రాభంగం వల్ల తగినంత నిద్ర లేకపోవడం వల్ల రకరకాల అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంటుంది.


స్లీప్ ఆప్నియాతో చాలా తీవ్రంగా బాధ పడుతున్న వారిలో అమిలాయిడ్ ప్లేక్ కూడా ఉన్నపుడు వారి మెదడులోని మధ్యస్థ టెంపోరల్ లోబ్ భాగంలో ఉండే హిప్పోకాంపస్ తో సహా మెదడు వాల్యూమ్ తక్కువగా ఉన్నట్టు గుర్తించారట. ఈ భాగం జ్ఞాపక శక్తికి సంబంధించింది కావడం గమనార్హం. కొత్త అధ్యయనంలో స్లీప్ ఆప్నీయా డిమెన్షియా, అల్జీమర్స్ కు కారణం కావచ్చని నిపుణులు తేల్చి చెబుతున్నారు.


అయితే అమిలాయిడ్ పలకాలు లేని వారిలో స్లీప్ ఆప్నియా ఉన్నప్పటికీ మెదడు వాల్యూమ్ లో తేడా లేదట. అందువల్ల వీరిలో డిమెన్షియా రాకపోవచ్చు. అమిలాయిడ్ ఫలకాలు అంటే మన మెదడులో ఉండే ప్రొటిన్. కానీ అల్జీమర్స్ తో బాధ పడుతున్న వారిలో ఈ పొటిన్ ఒకదానితో ఒకటి అతుక్కొని ప్లేక్ గా మారుతుంది. ఇలా ప్లేక్ గా మారినపుడు అది మెదడు ఆరోగ్యానికి హాని చేస్తుంది. మెదడు కణాలపై విషప్రభావాన్ని చూపుతుంది.


మిన్నెసోటా లోని మెన్నియాపాలిస్ లోని పరిశోధకులు 2016 నుంచి 2020 మధ్య జ్ఞాపక శక్తి సమస్యలు లేని 69 సంవత్సరాల సగటు వయసు కలిగిన 122 మందిని పరిశోధనకు ఎంచుకొని వారి డేటాను పరిశీలించారు. వీరిలో 26 మందిలో ఈ అమిలాయిడ్ ప్లేక్ కనిపించింది. ఇది అల్జీమర్స్ మొదలవుతోందని అనేందుకు సంకేతంగా చెప్పవచ్చు. ప్రతి ఒక్కరి మెదడు స్కానింగ్, మెమొరి పరీక్షలు, రాత్రి పూట నిద్ర వంటివాటన్నింటిని పరిగణనలోకి తీసుకున్నారు. ప్రతి 21 నెలలకు ఒకసారి జ్ఞాపకశక్తి పరీక్షలు నిర్వహించారట. వీరిలో అమిలాయిడ్ ప్లేక్ తో పాటు స్లీప్ ఆప్నియా ఉన్నవారిలో మెదడు పరిమాణం కుంచించుకు పోవడాన్ని గుర్తించారట. అమిలాయిడ్ ఫలకాలు లేని వారిలో ఇలాంటి లక్షణాలు కనిపించలేదని నిపుణులు చెబుతున్నారు.


గురక కేవలం నిద్రకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ఇది ఆరోగ్యం విషయంలో కొంచెం ఎక్కువే గంభీరమైందిగా భావించాలని డాక్టర్ రౌచ్స్ అంటున్నారు. అల్జీమర్స్ మొదటి స్టేజిలో ఉన్నవారు స్లీప్ ఆప్నియా బారిన పడడాన్ని కూడా గుర్తించారట.


స్లీప్ ఆప్నియా అంటే?


స్లీప్ ఆప్నీయా అంటే నిద్రలో శ్వాసకు ఆటంకం కలగడంతో ప్రారంభం అవుతుంది. స్లీప్ ఆప్నియాలో అత్యంత సాధారణంగా కనిపించేది అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా. ఇది కచ్చితంగా చికిత్స తీసుకోవాల్సిన సమస్య. దీర్ఘకాలంలో ఆరోగ్యం మీద చాలా తీవ్రమైన ప్రభావాలు చూపవచ్చు.



  • నిద్రలో శ్వాసకు ఆటంకం

  • ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది వల్ల గురక

  • రాత్రి నిద్ర సరిపోకపోవడం

  • పగటి పూట చాలా అలసటగా ఉండడం

  • ఏకాగ్రత లేకపోవడం

  • మూడ్ స్వింగ్స్

  • నిద్ర లేవగానే తలనొప్పి


మీకు ఈ లక్షణాలు కనిపిస్తే డాక్టర్ సలహా తీసుకోవడం అవసరం. బరువు తగ్గడం, పొగతాగడం, ఆల్కహాల్ మానేయడం, జీవన శైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా మంచి మార్పు ఉంటుంది. సమస్య తీవ్రంగా ఉన్నపుడు CPAP మెషీన్ అనే పరికరాన్ని సిఫారసు చేస్తారు. గమ్ షీల్డ్ పరికరం లేదా కొంత మందికి సర్జరీ కూడా అవసరం పడవచ్చు.


Also read : ఆదివారాలు ఆలస్యంగా నిద్ర లేస్తున్నారా? ఈ ప్రమాదం పొంచి ఉంది


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.



Join Us on Telegram: https://t.me/abpdesamofficial