Sleep Deprivation : రాత్రి నిద్ర సరిగ్గా లేకుంటే బ్రెయిన్ ఫాగ్ ఉండడమే కాదు.. మీ ఆరోగ్యానికి ఎన్నో నష్టాలు ఉంటాయంటున్నారు. పైగా ఇది పూర్తి జీవనశైలిని నాశనం చేస్తుందని చెప్తున్నారు. రాత్రుళ్లు లేట్​గా పడుకొని, ఉదయాన్నే త్వరగా నిద్రలేవడమనేది అస్సలు మంచిది కాదని.. రాత్రి నిద్ర కనీసం 8 గంటలు ఉండేలా చూసుకోవాలని చెప్తున్నారు. ఈ నిద్ర తక్కువకావడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్తున్నారు. ఇంతకి అవేంటంటే. 


జ్ఞాపకశక్తి.. 


సరైన నిద్ర లేకపోవడం వల్ల వచ్చే అతి పెద్ద ప్రధాన సమస్య జ్ఞాపకశక్తి తగ్గడం. పెద్దల్లో నిద్ర తక్కువకావడం వల్ల వారి జ్ఞాపకశక్తి తగ్గుతుందని పలు పరిశోధనలు కూడా నిరూపించాయి. డైలీ రోటీన్​లో జరిగే పనులను కూడా మరిచిపోతారని తేల్చి చెప్పారు. గుర్తించుకోవాల్సిన చిన్న విషయాలను కూడా మరిచిపోవడం కామన్​గా మారిపోతుందని తెలిపారు. 


చిరాకు 


తగినంత నిద్ర లేనప్పుడు చిరాకు రావడం మీ రొటీన్​లో భాగమైపోతుంది. చిన్న చిన్న విషయాలకే ట్రిగర్ అవుతారు. ఎలాంటి కారణం లేకుండా ఎదుటివారిపై చిరాకు పడుతూ ఉంటారు. చాలా తొందరగా చిరాకు వచ్చేస్తుందట. 


వృద్ధాప్యం


రోజుకు కనీసం ఐదు గంటలు కూడా నిద్రపోని వ్యక్తులు త్వరగా ముసలివాళ్లు అయిపోతారట. అతినీలలోహిత కిరణాల ఎఫెక్ట్ వల్ల చర్మం నష్టపోతుందని.. దాని నుంచి రికవరీ అవ్వడం కూడా కష్టమవుతుందని తేల్చి చెప్పారు. ముఖంపై ముడతలు కూడా త్వరగా వచ్చేస్తాయట. 


బరువు పెరగడం


సరైన నిద్ర లేకుంటే ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అధిక కేలరీలు ఉన్న ఫుడ్ ఎక్కువగా తింటారు. ఫ్రై చేసిన, కేలరీలు ఎక్కువగా ఉండే ఫ్యాటీ ఫుడ్స్, స్వీట్స్ తినాలనే కోరిక పెరుగుతుంది. దీనివల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత పెరుగుతుంది. దీనివల్ల మీరు చాలా వేగంగా బరువు పెరుగుతారు. 


దృష్టి లోపం


సరైన నిద్ర లేకుంటే కంటికి విశ్రాంతి దొరకదు. దీనివల్ల మీ కంటి చూపు మందగిస్తుంది. నిద్రలేమి వల్ల డబుల్ విజన్, మసకబారడం వంటి సమస్యలు వస్తాయి.


యాక్టివ్​


నిద్ర లేకపోవడం వల్ల మీరు యాక్టివ్​గా ఉండలేరు. సోమరితనంతో ఉంటారు. రియాక్షన్స్ కూడా వెంటనే ఇవ్వలేకపోతారు. మీకు తెలియకుండానే ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో డిలే చేస్తారు. మైండ్ క్లియర్ థాట్స్ ఇవ్వదు. దీనివల్ల చేయాలా వద్దా అనే డైలామాలోనే ఎక్కువగా ఉంటారు. 


ఫోకస్ 


చేసే పనిపై ఫోకస్ పెట్టలేరు. చేయాల్సిన పనిని కూడా పూర్తి చేయలేరు. పని సామర్థ్యం తగ్గుతుంది. ప్రోపర్​గా కూడా వర్క్ చేయలేరు. మతిమరుపు ఎక్కువగా ఉంటుంది. 


లైంగిక సామర్థ్యం 


నిద్రలేకపోవడం వల్ల టెస్టోస్టిరాన్ ఎక్కువగా విడుదల అవుతుంది. ఒక అధ్యయనం ప్రకారం నిద్రలేమి వల్ల లిబిడో తగ్గుతుంది. దీనివల్ల లైంగిక యాక్టివ్​గా ఉండలేరు. ఇది మీ పూర్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. 


డిప్రెషన్ 


సంతోషంగా ఉండలేరు. నిరాశ ఎక్కువ అవుతుంది. అలా అని సంతోషంగా ఉండేవారంతా బాగా నిద్రపోతారని కాదు. కానీ నిద్రలేకపోవడం వల్ల డిప్రెషన్ ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడి వల్ల చిన్న విషయాల పట్ల కూడా హ్యాపీగా ఉండలేరు. 


మధుమేహం, బీపీ వంటి సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. అలాగే రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. కాబట్టి మీకు నిద్ర తక్కువగా ఉంటే స్లీపింగ్ టెక్నిక్స్ ఫాలో అవ్వండి. లేదంటే వైద్య సహాయం తీసుకుని, జీవనశైలి మార్పులతో నిద్రను సెట్ చేసుకోవచ్చు.