మెన్‌ బ్యూటీ ప్రొడక్ట్స్‌పై అపోహలు..


అందం ఆడవాళ్లకే సొంతమా..? మేం మాత్రం అందంగా కనబడకూడదా అనుకుంటారు అబ్బాయిలు. అందుకే అమ్మాయిలకే కాదు.అబ్బాయిలకూ ప్రత్యేకంగా బ్యూటీ సెలూన్‌లు వచ్చేశాయి. స్కిన్‌కేర్‌పైన అమ్మాయిల కన్నా ఎక్కువే కాన్సంట్రేషన్ చేస్తున్నారు అబ్బాయిలు. కానీ మార్కెట్‌లో లేడీస్ బ్యూటీ ప్రొడక్ట్స్‌తో పోల్చి చూస్తే..మెన్ బ్యూటీ ప్రొడక్ట్స్‌ కాస్త తక్కువే. ఇప్పుడిప్పుడే ఈ మార్కెట్‌ కాస్త జోరందుకుంటోంది. అయితే ఈ ప్రొడక్ట్స్ విషయంలో ఎన్నో అపోహలు, అనుమానాలున్నాయి. ఏది వాడితే ఏమవుతుందో..? అసలు ఏ చర్మానికి ఏ ప్రొడక్ట్‌ని ఎంచుకోవాలి..? అన్న విషయంలో క్లారిటీ ఉండదు చాలా మందికి. ఈ డౌట్స్‌ అన్నీ తీరిపోయేలా  ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు డాక్టర్ గీతికా మిట్టల్ గుప్తా. స్కిన్‌కేర్‌ ఎక్స్‌పర్ట్‌ అయిన ఈమె అబ్బాయిల స్కిన్‌కేర్‌కి సంబంధించి కొన్ని ఆసక్తికర నిజాలువెల్లడించారు.


మగవాళ్ల చర్మానికీ కేర్ అవసరం..


స్కిన్ హైడ్రేటెడ్‌గా ఉండాలంటే కచ్చితంగా అబ్బాయిలందరూ స్కిన్‌కేర్‌పై దృష్టి పెట్టాలని అంటున్నారు గీతిక. అంతే కాదు. చర్మాన్ని మృదువుగా ఉంచే "కొలాజెన్" ఇంప్రూవ్ అవ్వాలన్నా,చర్మాన్ని రక్షించి ఉంచే స్కిన్ బారియర్‌ పెరగాలన్నా స్కిన్‌కేర్ తప్పదని చెబుతున్నారు. మగవాళ్లకు సంబంధించిన బ్యూటీ ప్రొడక్ట్స్‌ అన్నీ ఓ మార్కెట్ జిమ్మిక్కేనని కొందరు కొట్టిపారేస్తుంటారు. అలాంటిదేమీ లేదని, మగవాళ్ల చర్మం ఆరోగ్యంగా నిగనిగలాడాలంటే ఈ ప్రొడక్ట్స్‌ని వాడొచ్చని అంటున్నారు ఎక్స్‌పర్ట్‌లు. మగవాళ్ల చర్మం మందంగా ఉండటం వల్ల మాయిశ్చరైజేషన్‌ ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.





 


స్కిన్‌కేర్ లేకపోతే ముప్పై ఏళ్లకే ముసలితనం..! 


జస్ట్‌ నీళ్లతో ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది, మగవాళ్లు అంతకు మించి ఎలాంటి క్లీన్‌సర్స్‌ వినియోగించాల్సిన అవసరం లేదని అంటుంటారు. కానీ ఇందులోనూ నిజం లేదట. దుమ్ము కణాలు ముఖానికి అతుక్కుని ఉండకుండా ఉండాలంటే మంచి ఫేస్ క్లీన్‌సర్‌ను వాడాల్సిందే అంటున్నారు నిపుణులు. సబ్బుని మాత్రం తరచుగా వాడకూడదట. ఆడవాళ్ల చర్మంతో పోల్చి చూస్తే మగవాళ్ల చర్మం 
కాస్త ఆలస్యంగా ముడతలు పడుతుంది. స్కిన్‌కేర్‌ తీసుకోకుంటే మాత్రం కొందరిలో ముప్పై ఏళ్లకే ముసలితనం కనిపించేస్తుందని అంటున్నారు. అబ్బాయిలూ అదీ సంగతి. మరి స్కిన్‌కేర్‌ను ఎప్పటి నుంచి మొదలు పెడుతున్నారు..?