నెలరోజులుగా కాకినాడ జిల్లాను బెంబేలెత్తించిన పెద్దపులి ప్రస్తుతం జిల్లా మార్చింది అనకాపల్లి జిల్లాలో తన సంచారం మొదలుపెట్టింది . ఇప్పటికే నర్సీపట్నం రేంజ్ ఫారెస్ట్ లో పశువులపై దాడి మొదలు పెట్టింది. దానితో ఎలెర్ట్ అయిన అధికారులు పులికదలికలను ట్రేస్ చేసే పనిలో పడ్డారు.

 

ఒక పులేనా ? లేక రెండు ఉన్నాయా ?

 

ప్రస్తుతం అధికారులను వేధిస్తున్న ప్రశ్న అనకాపల్లి జిల్లాలో తిరుగుతున్న పులి కాకినాడ నుంచి వచ్చిందేనా లేక ఇది మరొకటా అన్నది అందర్నీ వెంటాడుతోంది. అనకాపల్లిలో పశువులపై దాడి చేసిన పులి పాదముద్రలు లభించినా దాని విజువల్స్ ఇంకా లభ్యంకాలేదు . పాదముద్రలు కూడా వర్షం వల్ల  స్పష్టంగా దొరకలేదు . దానితో ఇక్కడ తిరుగుతున్నది ఒక పులే నా లేక రెండు వేరువేరు పులులా అన్న దానిపై అటవీ అధికారులకే స్పష్టత ఇంకా  రాలేదు. 

 

పాదముద్రలే కీలకం :

 

పెద్దపులుల వివరాలు తెలుసుకోవడానికి వాటి పగ్ మార్క్స్ (పాదముద్రలు కీలకం ). ఒక పెద్దపులి అడుగుజాడలు మరో పులికి ఉండవు . అందుకే అడవుల్లో పెద్దపులుల జనాభాను సైతం ఈ పాద ముద్రల ద్వారానే లెక్కిస్తారు. ఒకసారి పెద్దపులి పాదముద్ర నేలపై పడితే వారం రోజుల వరకూ అలానే ఉంటుంది. అయితే ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో కురుస్తున్న ఎడతెరపిలేని వర్షాల వల్ల అడవిలోని పులి పాదముద్రలు చెరిగిపోతున్నాయి. దానితో అధికారులు ఇక్కడ తిరుగుతున్నది ఒక పులా లేక రెండు పులులా అన్నదానిపై స్పష్టంగా చెప్పలేకపోతున్నారు .

 

మరోవైపు పులికి కూడా హాని కలుగకుండా దానిని దగ్గరలోని రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్లిపోయేలా మార్గం ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలకు ప్రస్తుతం కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షం ఆటంకం కలిగిస్తున్నాయి. కాకినాడ నుంచి తమ జిల్లాకు పులి వచ్చేసిందన్న వార్తలు అనకాపల్లి జిల్లా వాసులను ముఖ్యంగా నర్సీపట్నం, యలమంచిలి సమీప గ్రామ ప్రజలను కలవరపెడుతున్నాయి.