మోదీ నగర్, నితీష్ నగర్..


బిహార్‌లోని ప్రధాని నరేంద్ర మోదీ పేరిట టౌన్‌షిప్స్ అందుబాటులోకి రానున్నాయి. మోదీ నగర్‌గా వాటికి పేరు పెట్టనున్నారు. పీఎం పేరిటే కాదు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరిట కూడా నితీష్ నగర్ అనే టౌన్‌షిప్‌లు రానున్నాయి. పేదల కోసం కట్టే టౌన్‌షిప్‌లకు ఈ పేర్టు పెట్టనున్నట్టు భాజపా మంత్రి రామ్ సూరత్ రాయ్ వెల్లడించారు. రెవెన్యూ, ల్యాండ్ రిఫార్మ్స్‌ మంత్రిగా ఉన్న సూరత్ రాయ్ ఇటీవలే ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు. వర్షాకాలం ముగియగానే "మోదీ నగర్, నితీష్ నగర్" టౌన్‌షిప్‌ల నిర్మాణం మొదలవుతుందని స్పష్టం చేశారు. పలు జిల్లాల్లో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. మొదట బంకా జిల్లాలోని రాజౌన్‌లో ఈ టౌన్‌షిప్‌ను నిర్మించనున్నారు. ఇప్పటికే భూసేకరణ కూడా పూర్తైంది. లబ్ధిదారులకు ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకంలో భాగంగా నిధులు అందుతాయని వెల్లడించారు.





 


పాత పథకాలకే కొత్త పేర్లు: ఆర్‌జేడీ విమర్శలు


మిగతా జిల్లాల్లోనూ క్రమంగా మోదీ నగర్, నితీష్ నగర్ టౌన్‌షిప్‌లు నిర్మించనున్నారు. ఇద్దరి నేతలపైనా తనకెంతో గౌరవం ఉందని, ఈ టౌన్‌షిప్‌ల ఆలోచన తనదేనని చెప్పారు రామ్ సూరత్ రాయ్. వాళ్ల పేర్లు పెట్టినందుకు ఎవరూ అభ్యంతరం చెప్పరని, అందుకు అనుమతి కూడా అవసరం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ఈ స్కీమ్‌పై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఎప్పటి నుంచో ఉన్న పథకాల పేర్లు మార్చి భాజపా తన ఖాతాలోకి వేసుకుంటోందని మండి పడుతున్నాయి. ఆర్‌జేడీ జాతీయ కార్యదర్శి అలోక్‌ మెహతా ఇదే విషయమై భాజపాపై మండిపడ్డారు. "కేంద్రంలోనైనా, రాష్ట్రాల్లోనైనా భాజపా పేర్లు మార్చటమే పనిగా పెట్టుకుంది. పాత పథకాలకు కొత్త పేర్లు పెడుతోంది" అని అన్నారు అలోక్ మెహతా. ఈ తరహా టౌన్‌షిప్‌ల నిర్మాణం గతంలోనూ ఉందని, ఇదేదో కొత్త స్కీమ్‌ అని భాజపా ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. ఎన్‌డీఏ ప్రభుత్వం కొత్త ఆలోచనలతో ముందుకొస్తోందని ప్రజల్ని నమ్మిస్తున్నారని సెటైర్లు వేశారు.


Also Read: Movie Tickets Issue: ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయంపై ఏపీ సర్కారుకు చుక్కెదురు!


Also Read: BJP vs TRS Flexi Fight: తెలంగాణలో ‘కౌంట్‌ డౌన్‌’ ఎవరికి ? అటు కారు జోరు - ఇటు కమలనాథుల హుషారు