Chandipura Virus: అత్యంత ప్రమాదకరమైన చండీపుర వైరస్‌ గుజరాత్ రాష్ట్రాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ ధాటికి 5 రోజుల్లో ఆరుగురు చిన్నారులు చనిపోయారు. చండీపుర వైరస్‌‌కు సంబంధించి మరో 12 కేసులు నమోదయ్యాయి. అందులో నలుగురు ఒకే జిల్లాకు చెందినవారు ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రిషికేష్ పటేల్ వెల్లడించారు. చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరు రాజస్థాన్ కు చెందిన వాళ్లు ఉండగా, మరొకరు మధ్యప్రదేశ్‌కు చెందినవారని ఆయన వెల్లడించారు.


ఒకే హాస్పిటల్లో ఆరుగురు మృతి


చండీపుర వైరస్‌తో ఇప్పటి వరకు ఆరుగురు చిన్నారులు  చనిపోయారు. వారిలో ఐదుగురు చిన్నారులు  సబరకాంత జిల్లాలోని హిమంతనగర్ సివిల్ ఆసుపత్రిలో మృతి చెందారు. చండీపుర వైరస్‌ నిర్థారణ కోసం మరో 12 మంది శాంపిల్స్ పుణేలోని నేషనల్ వైరాలజీ ఇనిస్టిట్యూట్ కు పంపించారు. హిమంతనగర్ హాస్పిటల్లో చనిపోయిన నలుగురు చిన్నారులకు చండీపురా వైరస్ సోకి ఉంటుందని అక్కడి డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు చండీపుర వైరస్‌ నివారణకు గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి రిషికేష్ వెల్లడించారు. చండీపుర వైరస్‌ అంటువ్యాధి కాదని, వైరస్ కంట్రోల్ చేసేందుకు అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.


ఇంతకీ చండీపుర వైరస్ ప్రత్యేకత ఏంటి?


చండీపుర వైరస్ ను 1965లో తొలిసారి మహారాష్ట్రలోని చండీపురలో గుర్తించారు. అప్పటి నుంచి దాన్ని చండీపుర వైరస్‌గా పిలుస్తున్నారు. నిజానికి ఈ వైరస్‌ను చండీపుర వెసిక్యులో వైరస్‌ అంటారు. ఈ వైరస్ రాబ్డోవిరిడే కుటుంబానికి చెందినది వైద్య అధికారులు గుర్తించారు.  ఈ వైరస్ వెసిక్యులర్ స్టోమాటిటిస్, రేబిస్‌కు కారణమయ్యే వైరస్‌ లతో దగ్గరి సంబంధాన్ని కలిగి ఉంటుంది. 2003-04 సంవత్సరాల్లో ఈ వైరస్ కరాళనృత్యం చేసింది. ఏకంగా 322 మంది పిల్లలను బలి తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో 183, మహారాష్ట్రలో 115, గుజరాత్‌లో 24 మంది చిన్నారులు మృతి చెందారు.  


చండీపురా వైరస్ లక్షణాలు


చండీపురా వైరస్ అనేది దోమలు, పేలు, ఈగల ద్వారా వ్యాపిస్తుంది. 9 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ వైరస్ సోకిన వారిలో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, మూర్ఛ లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్ సోకినవారు కొన్నిసార్లు కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది. తీవ్రత పెరిగితే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. ముందస్తుగా గుర్తిస్తే చికిత్సతో బయటపడే అవకాశం ఉంటుంది.


చండీపురా వైరస్ సోకిన వారికి అందించే చికిత్స


నిజానికి చండీపురా వైరస్ నిర్మూలణకు నిర్దిష్ట యాంటీ వైరల్ చికిత్స లేదు. రోగిలోని లక్షణాలను బట్టి వైద్యులు చికిత్స అందిస్తారు. అందుకే, ఈ వైరస్ సోకిన తర్వాత ఇబ్బంది పడటం కంటే ముందే తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వర్షాకాలంలో ప్రధానంగా ఈగలు, దోమలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. మంచి పోషకాహారం, పరిశుభ్రత, ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం అంటున్నారు.  



Read Also: ఈ లక్షణాలకు కనిపిస్తే గుండె లయ తప్పినట్టే, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోతాయ్ జాగ్రత్త