Irregular Heartbeat Warning Signs: శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం గుండె. గుండె ఆరోగ్యంగా ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. హైబీపీ, హై కొలెస్ట్రాల్, డయాబెటిస్, ఒబేసిటీ, స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల గుండె సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అయితే, గుండె సంబంధ సమస్యలు వచ్చే సమయంలో కొన్ని లక్షణాలు ముందుగానే తెలుస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ ను సంప్రదిస్తే ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇంతకీ గుండె సమస్యలు ఎదురయ్యే ముందు కనిపించే లక్షణాలు ఏంటో తెలుసుకుందాం..
1. ఆందోళన
కొన్నిసార్లు అనుకోకుండా శరీరంలో ఆందోళన ఏర్పడుతుంది. గుండె సమస్యలలో ఆందోళన కూడా ముఖ్యమైనది. ఆందోళన అనేది గుండె సమస్యను మరింత తీవ్రం చేస్తుంది. హృదయం మీద అధిక భారం పడినప్పుడు ఈ లక్షణం కనిపిస్తుంది.
2. దడ
గుండె సమస్యలు తలెత్తే సమయంలో ప్రధానంగా కనిపించే లక్షణం గుండె వేగంగా కొట్టుకోవడం. అప్పుడప్పుడు దడ అనేది ప్రమాదం కానప్పటికీ, తరచుగా గుండె దడ ఏర్పడితే సీరియస్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. గుండె దడ అనేది గుండె పోటుకు ప్రాథమిక లక్షణంగా చెప్పుకోవచ్చు.
3. అలసట
తీవ్రమైన అలసట కూడా గుండె సమస్యకు కారణం కావచ్చు. చిన్న పనికి కూడా చేతకాకపోవడం, నడవడానికి కూడా ఇబ్బంది పడితే హృదయ సమస్య ఉన్నట్లు గుర్తించాలి. గుండె సమర్థవంతంగా రక్తాన్ని పంపింగ్ చేయనప్పుడు, శరీరానికి అవసరమైన ఆక్సీజన్ అందనప్పుడు ఈ సమస్యల తలెత్తుతుంది.
4. మైకం కమ్మడం
తరచుగా తల తిరిగినట్టైతే గుండె సరిగా కొట్టుకోవడం లేదని అర్థం. మెదడు, ఇతర అవయవాలకు రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. మనిషి మూర్చపోవడంతో పాటు అకస్మాత్తుగా పడిపోయే అవకాశం ఉంటుంది.
5. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
పని చేస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే గుండె సంబంధ సమస్యకు కారణంగా పరిగణించాలి. గుండె రక్తాన్ని సరిగ్గా ప్రసరణ చేయని సందర్భంలో ఈ సమస్య ఏర్పడుతుంది. ఊపిరితిత్తులలో ఫ్లూయిడ్స్ పేరుకుపోయినప్పుడు కూడా ఈ సమస్య ఏర్పడుతుంది.
6. చెమటలు పట్టడం
సాధారణ స్థాయి కన్నా ఎక్కువగా చెమటలు పట్టడం కూడా హృదయ సమస్యకు కారణం కావచ్చు. ప్రత్యేకించి శారీరక శ్రమ, ఎక్కువ వేడి లేని సమయంలో ఈ లక్షణం కనిపిస్తే సీరియస్ గా తీసుకోవాలి. గుండె సరిగా పని చేయని సందర్భంలో ఈ లక్షణం కనిపిస్తుంది.
7. ఛాతీలో నొప్పి
ఛాతీలో నొప్పి లేదంటే ఛాతిలో అసౌకర్యం కలిగినా హృదయ సంబంధ సమస్యకు కారణంగా పరిగణించాలి. ఈ నొప్పి ఒత్తిడిని కలిగించడంతో పాటు గుండెను పిండిన ఫీలింగ్ కలుగుతుంది. తగినంత ఆక్సీజన్ అందని సమయంలో ఈ లక్షణం కనిపిస్తుంది.
Also Read: పెట్రోల్‌ను కూల్‌డ్రింక్‌లా తాగేస్తున్న యువతి - దాని టేస్ట్ అలా ఉంటుందట!