సిగరెట్ తాగడం, మందు కొట్టడం ఒక వ్యసనం. అయితే, ఆ యువతికి మాత్రం పెట్రోల్‌ తాగడం వ్యసనం. వినడానికి చిత్రంగానే ఉన్నా.. ఇది నిజం. డైలీ పెట్రోల్ తాగితేగానీ.. ఆమెకు ఎనర్జీ రాదట. అందుకే, టిన్నుల కొద్ది పెట్రోల్ ఖాళీ చేసేస్తోంది. ఇంత ఖరీదైన అలవాటున్నా ఆ అమ్మాయి ఎవరు? పెట్రోల్ తాగుతున్నా.. ఆమె ఇంకా ఎలా బతికి ఉంది?


ఆమె పేరు షానన్. కెనాడాలోని అంటారియాలో గల వెల్లండ్‌లో నివసిస్తోంది. ఆమె వయస్సు 20 ఏళ్లు మాత్రమే. కొంతమందికి పెట్రోల్ స్మెల్ చాలా నచ్చుతుంది. ఘాటైన ఆ వాసనే ఆమెకు అలవాటుగా మారింది. వాసనే అంత బాగుంటే.. తాగితే ఎలా ఉంటుందనే ఆలోచన కలిగిసింది. ఇటీవల ప్రసారమైన TLC కార్యక్రమంలో షానన్ పాల్గొంది. అందులో ఆమె.. తనకు ఉన్న వింత అలవాటు గురించి వివరించింది. 


ఈ కార్యక్రమంలో పదర్శించిన వీడియోలో.. ఆమె ఉదయాన్నే నిద్రలేచి సింక్ దగ్గరకు చేరుకుంది. దాని కింద ఉన్న ఎర్ర రంగు పెట్రోల్ డబ్బా తీసుకుంది. అందులోని పెట్రోల్‌ను తాగడం మొదలుపెట్టింది. ఆమె పెట్రోల్‌ను అలా గడగడా తాగేస్తుంటే.. ఆ కార్యక్రమం చూసిన ప్రేక్షకులు అలా చూస్తుండిపోయారు. పెట్రోల్ తాగితే ప్రాణాలు పోతాయ్. మరి, అలాంటిది ఆమె ఇంకా ఎలా బతికి ఉందనే సందేహం ప్రేక్షకుల్లో కలిగింది. 


పెట్రోల్ తాగడం చాలా ప్రమాదకరం


పెట్రోల్ తాగితే ప్రమాదకరమైన సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. వికారం, వాంతులతోపాటు తీవ్రమైన కడుపునొప్పి వేధిస్తుంది. పెట్రోల్ జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. గుండె, ఊపిరితీత్తులకు కూడా ప్రమాదమే. పెట్రోల్‌లో 150 వరకు విషపూరిత రసాయనాలు ఉంటాయి. షానన్ ఏమీ సూపర్ ఉమెన్ కాదు. ఆమెకు కూడా ఈ సమస్యలు ఎదురయ్యాయి. కానీ, ఆ అలవాటును మానుకోలేక డైలీ కొద్ది కొద్దిగా తాగుతూ కోరిక తీర్చుకుంటోంది. పెట్రోల్ తాగినప్పుడు ఛాతిలో నొప్పి వస్తోందని, మైకం వస్తుందని ఆమె తెలిపింది. 


‘పుల్లగా, సాస్‌లా ఉంటుంది’


తనకు ఉన్న ఈ వింత అలవాటుపై ఆమె ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘పెట్రోల్ తాగడం మంచిది కాదని నాకు తెలుసు. అది తాగితే ప్రాణాలు పోతాయని కూడా తెలుసు. కానీ, నేను ఆ అలవాటును ఆపలేకపోతున్నాను. పెట్రోల్ చిక్కని సాస్ లా ఉంటుంది. తియ్యగా, పుల్లగా ఉంటుంది. తాగేప్పుడు ఒళ్లంతా జలదరిస్తుంది. గొంతు కాలుతున్న ఫీలింగ్ కలుగుతుంది. దాన్ని తాగకుండా ఒక్క రోజు కూడా ఉండలేను. నిద్రలేవగానే నేను వాష్‌రూమ్‌కు వెళ్లి పెట్రోల్ తాగుతాను. బయటకు వెళ్లినప్పుడు ఒక బాటిల్‌లో తీసుకెళ్తాను. డైలీ సుమారు 12 టీస్పూన్ల వరకు పెట్రోల్ తాగుతాను’’ అని తెలిపింది. 


ఆ అలవాటు ఎలా వచ్చింది?


షానన్ బాల్యం నుంచి పెట్రోల్‌ వాసనకు అలవాటు పడింది. మొదట్లో ఆమె పెట్రోల్ వాసన చూస్తూ ఆనందపడేది. బాధ లేదా ఒంటరితనంగా ఫీలైనప్పుడు ఆమె పెట్రోల్‌ను లైట్‌గా సిప్ చేయడం మొదలుపెట్టింది. అలా ఆమె పెట్రోల్ తాగడానికి అలవాటు పడింది. అది వ్యసనంగా మారడంతో దాని నుంచి బయటపడేందుకు ఆమె ఎంతో శ్రమిస్తోంది. ఆమె కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి ఈ కార్యక్రమం 2012లో ప్రసారమైంది. ఆమె ఇప్పటికే బతికే ఉంది. త్వరలో ప్రసారం కానున్న TLC సీజన్ 3లో షానన్ పాల్గొంటుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమె వార్త మరోసారి వైరల్ అవుతోంది. 


Also Read: ఆ ఫాస్టింగ్​‌తో 21 రోజులలో 13 కిలోలు తగ్గాడట.. నిజంగానే బరువు తగ్గుతారా? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?