Retail Inflation Data For June 2024: ఆహార పదార్థాల ధరల భగభగలు తగ్గని కారణంగా దేశంలో చిల్లర ద్రవ్యోల్బణం మరోసారి 5 శాతం దాటింది. 2024 జూన్‌ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.08 శాతంగా నమోదైంది. దీనికిముందు, మే నెలలో ఇది 4.80 శాతంగా ఉంది. సీపీఐ ఇన్‌ఫ్లేషన్‌ (CPI Inflation) రేటు మరోమారు 5 శాతం దాటడానికి ఆహార ద్రవ్యోల్బణం పెరగడమే కారణం, అది 9 శాతం దాటింది. ఆహార ద్రవ్యోల్బణం జూన్‌లో (Food Inflation Rate in June 2024) 9.36 శాతంగా ఉంది, మే నెలలో 8.83 శాతంగా నమోదైంది.


జూన్ నెలకు సంబంధించిన 'వినియోగదారు ధరల సూచీ (Consumer Price Index‌) ఆధారిత ద్రవ్యోల్బణం' డేటాను కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆ డేటా ప్రకారం... ఆహార వస్తువుల ధరల పెరుగుదల కారణంగా, రిటైల్ ద్రవ్యోల్బణం మేలోని 4.80 శాతం నుంచి జూన్‌లో 5.08 శాతానికి పెరిగింది. సరిగ్గా ఏడాది క్రితం, 2023 జూన్‌ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.87 శాతంగా లెక్కించారు. ఆహార ద్రవ్యోల్బణం 2024 జూన్‌లో 9.36 శాతంగా ఉంటే, నెల క్రితం, మేలో 8.83 శాతంగా ఉంది. ఏడాది క్రితం 2023 జూన్‌లో ఆహార ద్రవ్యోల్బణం 4.31 శాతంగా నమోదైంది.              


పెరిగిన కూరగాయల రేట్లు                
దేశంలోని చాలా ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పంటలు నీట మునిగాయి. దీంతో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. కూరగాయల ద్రవ్యోల్బణం (Vegetable Inflation) ఈ ఏడాది మే నెలలోని 27.33 శాతం నుంచి జూన్‌లో 29.32 శాతానికి చేరింది. అయితే, జూన్‌లో పప్పుల ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. పప్పుధాన్యాల ద్రవ్యోల్బణం (Inflation of pulses) మే నెలలో 17.14 శాతంగా ఉంటే, జూన్‌లో 16.07 శాతానికి తగ్గింది. పండ్ల ద్రవ్యోల్బణం (Fruits inflation) జూన్‌లో 7.1 శాతంగా ఉంటే, మేలో 6.68 శాతంగా ఉంది. ధాన్యాలు & సంబంధిత ఉత్పత్తుల ద్రవ్యోల్బణం మే నెలలో 8.69 శాతంగా ఉంటే, జూన్‌లో 8.75 శాతానికి స్వల్పంగా పెరిగింది. మేలో 5.70 శాతంగా ఉన్న చక్కెర ద్రవ్యోల్బణం జూన్‌లో 5.83 శాతానికి చేరింది. కోడిగుడ్ల ద్రవ్యోల్బణం భారీగా తగ్గింది. ఇది మేలో 7.62 శాతం నుంచి జూన్‌లో 3.99 శాతానికి దిగి వచ్చింది.


నీరుగారిన చౌక రుణాల ఆశలు               
రిటైల్ ద్రవ్యోల్బణం పెరగడం రిజర్వ్‌ బ్యాంక్‌కు (RBI), సాధారణ ప్రజలకు పెద్ద దెబ్బ. దీనిని 4 శాతానికి తగ్గించాలని ఆర్‌బీఐ ప్రయత్నిస్తుండగా, అది యూ టర్న్ తీసుకుంది, మళ్లీ 5 శాతం పైకి చేరింది. ఈ పరిస్థితిలో, పాలసీ రేట్లను RBI తగ్గించే అవకాశం కూడా సన్నగిల్లింది.      


దేశంలో ద్రవ్యోల్బణం ఇప్పటికీ సవాల్‌గానే ఉందని, లక్ష్యం కంటే ఎక్కువగా నమోదవుతోందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం నాడు చెప్పారు. ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గించడం తొందరపాటు అవుతుందని అన్నారు.


మరో ఆసక్తికర కథనం: ఈ 12 బ్యాంక్‌ల్లో ఎఫ్‌డీ వేస్తే ఎక్కువ రాబడి - పోల్చి చూసి నిర్ణయం తీసుకోండి