AP Latest News: వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ పెట్టిన ప్రెస్ మీట్‌లో కొంత మంది జర్నలిస్టులను దూషించిన తీరు వివాదాస్పదం అవుతోంది. తనపై ఎవరో ఆరోపణలు చేస్తే కొన్ని మీడియా ఛానెళ్లు అది నిజమే అంటూ ప్రసారం చేశాయని విజయసాయి రెడ్డి అన్నారు. ఆ వార్తలు ప్రసారం చేసిన జర్నలిస్టులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి. ఆ జర్నలిస్టుల పుట్టుకపైనే తనకు అనుమానం ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒరేయ్..’’ లాంటి పదాలను విజయసాయి రెడ్డి వాడారు. ఇవేనా వారి జర్నలిస్టిక్ విలువలు అంటూ విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.


విజయసాయి రెడ్డి జర్నలిస్టులపై ఆగ్రహించిన, దూషించిన తీరుపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. అధికారం పోయినా మీ ప్రవర్తనలో మార్పు రాలేదని లోకేశ్ విమర్శించారు. ‘‘విజయసాయి రెడ్డి గారు! మీపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు పెట్టిన ప్రెస్ మీట్‌లో మీరు వాడిన భాష తీవ్ర అభ్యంతరకరం. మీడియా ప్రతినిధులను అసభ్య పదజాలంతో  మీరు దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. పెద్దల సభ ప్రతినిధిగా ఉన్న మీకు నేను మంచీమర్యాదల గురించి చెప్పాల్సిన పనిలేదు. మీకు అధికారం పోయినా అహంకారం మాత్రం ఇంకా తగ్గలేదు. ఐదేళ్ల వైసిపి పాలనలో మీ భాష, ప్రవర్తన, అవినీతి, అరాచకం చూసి ప్రజలు ఛీ కొట్టినా ఇంకా మీకు బుద్ధి రాలేదు’’ అని లోకేశ్ ఎక్స్‌లో పోస్టు చేశారు.






లోకేశ్ చేసిన ఈ పోస్ట్‌పై విజయసాయి రెడ్డి కూడా ఎక్స్‌లోనే స్పందించారు. ‘‘శ్రీ నారా లోకేశ్‌కు, ఆయన కులానికి చెందిన మీడియా ప్రతినిధులకు వెస్ట్రన్ మీడియా తరహాలో ప్రెస్ ఫ్రీడమ్ కావాలి.. కానీ వారు నార్త్ కొరియన్ మీడియాలాగా పని చేస్తారు. వారు జర్నలిస్టిక్ వ్యాల్యూస్‌ను పట్టించుకోరు. వాటిని తుంగలో తొక్కారు. టీఆర్పీ రేటింగ్స్ వెనక పరిగెడతారు. ప్రజా ప్రతినిధులు, మహిళలు లేదా మన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారిని నష్టపరిచి, వారి రాజకీయ నాయకులకు కట్టుబడి పని చేస్తున్నారు. వారి కుల ప్రయోజనాలను కాపాడుతూ టీఆర్పీల వెనుక మాత్రమే పరిగెత్తుతున్నారు’’ అని విజయ సాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.