Case Filed On Rakshit Shetty: గత కొంతకాలంగా శాండిల్‌వుడ్ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒక ఫ్యాన్‌ను హత్య చేయించిన కేసులో స్టార్ హీరో దర్శన్ పేరు బయటికి రావడం సంచలనం సృష్టించింది. ఇంతలోనే మరో కన్నడ యాక్టర్‌పై కేసు నమోదు అయ్యిందనే వార్త తెగ వైరల్ అవుతోంది. తాజాగా శాండిల్‌వుడ్ యంగ్ హీరో రక్షిత్ శెట్టిపై కాపీరైట్ వైలేషన్ కేసు నమోదు అయ్యిందని కన్నడ మీడియా అంటోంది. పలు పాత కన్నడ సినిమాల్లోని పాటలను తాను నిర్మిస్తున్న కొత్త సినిమాలో ఉపయోగిస్తున్నాడని రక్షిత్ శెట్టిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కాపీరైట్ వైలేషన్ ప్రకారం రక్షిత్‌పై కేసు నమోదు అయ్యిందని సమాచారం.


పాత పాటలు..


రక్షిత్ శెట్టి హీరో మాత్రమే కాదు పలు సినిమాలకు తానే రైటర్, డైరెక్టర్, నిర్మాతగా కూడా పనిచేశాడు. అలా శాండిల్‌వుడ్‌లోని మల్టీ టాలెంటెడ్ యాక్టర్లలో రక్షిత్ ఒకడు. ఇక తాజాగా తనపై ఎమ్‌ఆర్‌టీ మ్యూజిక్ కంపెనీలో పార్ట్‌నర్ అయిన నవీన్ కుమార్ కాపీరైట్ వైలేషన్ కేసు నమోదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. 1982లో విడుదలయిన ‘న్యాయ ఎల్లిదే’, 1981లో విడుదలయిన ‘గాలి మాతు’ సినిమాల్లోని పాటలను రక్షిత్ శెట్టి తన అప్‌కమింగ్ మూవీ అయిన ‘బ్యాచిలర్ పార్టీ’లో ఉపయోగించాడని నవీన్ కుమార్ ఆరోపించారు. ఆ సినిమాల్లోని పాటలకు సంబంధించిన కాపీరైట్స్ తమ దగ్గరే ఉన్నాయని ఆయన తెలిపారు.


పర్మిషన్ లేదు..


‘‘బ్యాచిలర్ పార్టీ సినిమాలో పాత సినిమా పాటలు ఉపయోగించడంపై నాకు, రాజేశ్‌కు జనవరిలో చర్చలు జరిగాయి. అయితే ఆ చర్చలు పాజిటివ్‌గా ఎండ్ అవ్వకపోవడంతో ఆ ఐడియాను మేము వదిలేసుకున్నాం. కానీ 2024 మార్చిలో బ్యాచిలర్ పార్టీ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలయ్యింది. కాపీరైట్ ఓనర్స్‌గా మా దగ్గర నుండి ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా పాత పాటలను ఆ సినిమాలో ఉపయోగించుకున్నారు’’ అని నవీన్ కుమార్ వివరించారు. దీంతో యశ్వంతపురం పోలీసులు.. రక్షిత్ శెట్టిపై, తన నిర్మాణ సంస్థ అయిన పరంవాహ్ స్టూడియోస్‌పై కాపీరైట్ యాక్ట్‌లోని సెక్షన్ 63 కింద కేసు నమోదు చేశారు.


మొదటిసారి కాదు..


రక్షిత్ శెట్టికి ఇలాంటి సమస్యలు ఎదురవ్వడం ఇదేమీ మొదటిసారి కాదు. 2016లో విడుదలయిన ‘కిర్రిక్ పార్టీ’ సినిమా రక్షిత్‌ను హీరోగా ప్రేక్షకులకు దగ్గర చేసింది. ఇక ఈ మూవీలో కూడా 1991లో విడుదలయిన ‘శాంతి క్రాంతి’ మూవీలోని పాటలను పర్మిషన్ లేకుండా ఉపయోగించుకున్నారంటూ లహరీ రికార్డింగ్ కంపెనీ ఫిర్యాదు చేసింది. ఇప్పుడు మరోసారి ‘బ్యాచిలర్ పార్టీ’ విషయంలో కూడా అదే జరుగుతోంది. యూత్‌ఫుల్ కథలతో ఆడియన్స్‌కు చాలా దగ్గరయ్యాడు రక్షిత్ శెట్టి. ఇక కన్నడలోనే కాకుండా తెలుగులో కూడా ఈ హీరోకు ఫ్యాన్స్ ఉన్నారు. ఒకప్పుడు కన్నడ బ్యూటీ రష్మిక మందనాను ఎంగేజ్‌మెంట్ చేసుకున్న హీరోగా కూడా రక్షిత్ శెట్టి టాలీవుడ్‌లో చాలా ఫేమస్.



Also Read: రాజ్‌ తరుణ్‌ ఎక్కడ? - విచారణకు హాజరు కావాలని హెచ్చరిస్తూ హీరోకి పోలీసుల నోటీసులు