Double ISmart: ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'డబుల్ ఇస్మార్ట్'. ఇది 2019లో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ 'ఇస్మార్ట్ శంకర్' చిత్రానికి సీక్వెల్. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ పాన్ ఇండియా సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార పోస్టర్లు, టీజర్, ఫస్ట్ సింగిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమాకి భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. 


'డబుల్ ఇస్మార్ట్' సినిమా థియేట్రికల్ హక్కులు భారీ రేటుకు అమ్ముడుపోయినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు కనిపిస్తున్నాయి. ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ మూవీ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ను దాదాపు ₹60 కోట్లకు తీసుకున్నట్లుగా టాక్ నడుస్తోంది. నార్త్ ఇండియా హిందీ వెర్షన్ మినహా మిగతా అన్ని భాషలకు ₹54 కోట్లు నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ గా, ₹6 కోట్లు రిటర్నబుల్ అడ్వాన్స్‌ గా చెల్లించే విధంగా డీల్ క్లోజ్ చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 


ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ ఏడాది ప్రారంభంలో 'హను-మాన్' సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. రూ. 40 కోట్లతో తీసిన ఈ చిత్రం.. రూ. 350 కోట్ల వరకూ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ప్రియదర్శి, నభా నటేష్ హీరోహీరోయిన్లుగా 'డార్లింగ్' అనే చిత్రాన్ని రూపొందించారు. ఇది జూలై 19న విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఆగస్టులో రిలీజ్ ప్లాన్ చేసిన 'డబుల్ ఇస్మార్ట్' సినిమా థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నారు. పూరీ జగన్నాథ్ గత చిత్రం 'లైగర్' డిజాస్టర్ గా మారినా, 'ఇస్మార్ట్ శంకర్' సీక్వెల్ పై అంచనాలను దృష్టిలో పెట్టుకొని ఫ్యాన్సీ రేటుకి రైట్స్ దక్కించుకున్నట్లుగా అర్థమవుతోంది. 


'డబుల్ ఇస్మార్ట్' మూవీతో ఈసారి డబుల్ ఎంటర్టైన్మెంట్ ను అందించబోతున్నట్లుగా చిత్ర బృందం చెబుతోంది. ఇప్పటి వరకూ వదిలిన ప్రమోషనల్ లో రామ్ ఎప్పటిలాగే ఎనర్జిటిక్ గా కనిపించారు. స్టెప్పా మార్ సాంగ్ లో తన సిగ్నేచర్ స్టెప్పులతో, ఎలక్ట్రిఫైయింగ్ డ్యాన్స్ మూమెంట్స్ తో ఆకట్టుకున్నారు. ఈరోజు మంగళవారం (జులై 16) సాయంత్రం 4:00 గంటలకు 'మార్ ముంతా చోడ్ చింతా' అనే రెండో పాటను విడుదల చేస్తున్నారు. 


'డబుల్ ఇస్మార్ట్' సినిమాలో రామ్ సరసన 'ఏక్ మినీ కథ' ఫేమ్ కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. అలీ, గెటప్ శ్రీను ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ కె నాయుడు, జియాని జియానెలి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. స్టంట్ డైరెక్టర్స్ కేచ, రియల్ సతీష్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌ పై పూరి జగన్నాధ్ & ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి విషు రెడ్డి సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాని ముందుగా 2024 మహా శివరాత్రి కానుకగా మార్చి 8న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఫైనల్ గా ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతోంది.