AR Rahman About Michael Jackson: ఇండియాకు ఆస్కార్ తీసుకొచ్చిన తర్వాత ఏఆర్ రెహమాన్ పేరు ప్రపంచం మొత్తం తెలిసింది. ఇప్పటికీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆయన తీసుకొచ్చిన ఆస్కార్ గురించి ప్రేక్షకులు గొప్పగా చెప్పుకుంటారు. ఆ తర్వాత మ్యూజిక్ ఇండస్ట్రీలో ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. హాలీవుడ్‌కు మ్యూజిక్ కంపోజ్ చేసే రేంజ్‌కు రెహమాన్ ఎదిగారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రెహమాన్.. ప్రపంచవ్యాప్తంగా పాప్ సింగర్‌గా గుర్తింపు తెచ్చుకొని, పాప్ కల్చర్‌కు ప్రాణం పోసిన మైఖేల్ జాక్సన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకసారి మైఖేల్ జాక్సన్ తనను కలుస్తానన్నా తానే కలవడానికి నిరాకరించానని బయటపెట్టారు.


ఆస్కార్ నామినేషన్స్..


‘‘2009లో నేను నా ఏజెంట్‌తో కలిసి లాస్ ఏంజెల్స్‌లో ఉన్నాను. అతడు నాకు వేరే వ్యక్తిని పరిచయం చేశాడు. ఆ వ్యక్తి మైఖేల్ జాక్సన్ దగ్గర మ్యానేజర్‌గా పనిచేస్తుంటాడు. నేను నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకున్నాను. మైఖేల్ జాక్సన్‌ను కలవచ్చా అని అతడిని అడిగాను. అతడు ఒక ఈమెయిల్ పంపిస్తానని అన్నాడు. కానీ వారం రోజుల వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. నేను సైలెంట్‌గా ఉండి పర్వాలేదులే అనుకున్నాను. అప్పుడే ఆస్కార్ నామినేషన్స్ జరిగాయి. నేను అందులో నామినేట్ అయ్యాను. అప్పుడు నాకు ఈమెయిల్ వచ్చింది. మైఖేల్ మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు అని అందులో ఉంది. కానీ నేను ఆయనను ఇప్పుడు కలవాలని అనుకోవడం లేదని చెప్పేశాను’’ అని ఏఆర్ రెహమాన్ బయటపెట్టారు.


గెలిస్తేనే కలుస్తా..


‘‘నేను ఇప్పుడు మైఖేల్ జాక్సన్‌ను కలవను. నేను ఆస్కార్ గెలిస్తే కలుస్తాను అన్నాను. నేను గెలుస్తానని నాకు కచ్చితమైన నమ్మకం ఉంది. అనుకున్నట్టే నేను గెలిచాను. తరువాత రోజే తనను కలవడానికి వెళ్లాను. సమయం దాదాపు సాయంత్రం 6.30 అయ్యింది. చీకటి పడుతోంది. అప్పుడే ఒకరు గ్లవ్స్ వేసుకొని డోర్ ఓపెన్ చేశారు. నేను తనతో తన డ్యాన్స్ గురించి, మ్యూజిక్ గురించి, ప్రపంచ రాజకీయాల గురించి మాట్లాడాను. తను స్లమ్‌డాగ్ మిలీనియర్‌లో నా సంగీతాన్ని ప్రశంసించాడు. తన పిల్లలకు పరిచయం చేశాడు. అప్పుడు నేను రాత్రి, పగలు పనిచేయడం వల్ల చాలా అలసిపోయాను. ఇండియాకు ఎప్పుడెప్పుడు తిరిగి వచ్చేయాలా అనుకుంటూ ఉన్నాను’’ అని గుర్తుచేసుకున్నారు రెహమాన్.


అప్పుడే మరణించారు..


అదే సమయంలో ఇండియాకు తిరిగొచ్చిన తర్వాత రజినీకాంత్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఎంతిరన్’ అలియాస్ ‘రోబో’కు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశారు ఏఆర్ రెహమాన్. అదే సమయంలో మైఖేల్ జాక్సన్‌తో కలిసి పనిచేస్తే బాగుంటుంది అనే ఆలోచన డైరెక్టర్ శంకర్‌కు కలిగిందట. అయితే మైఖేల్ తమిళ పాట పాడతాడా లేదా అనే సందేహం రెహమాన్‌తో ఉందట. అయినా కూడా తనకు ఫోన్ చేసి మాట్లాడానని, నువ్వేం చెప్పినా మనం కలిసి చేద్దామని మైఖేల్ జాక్సన్ మాటిచ్చాడని గుర్తుచేసుకున్నారు రెహమాన్. ‘‘మేము మళ్లీ కలిశాము. కానీ దురదృష్టవశాత్తు ఆయన 2009లో చనిపోయారు. ఆయన అప్పటికే అనారోగ్యంతో ఉన్నారు’’ అని తెలిపారు ఏఆర్ రెహమాన్.



Also Read: ‘భారతీయుడు 2’ - యావరేజ్ టాక్‌తోనే అంత కలెక్ట్ చేసిందా?