Heart: మనదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే ఉత్పాదకత మెరుగుపడాలి. అంటే మరిన్ని ఎక్కువ గంటలు కూర్చుని పని చేయాలి. ఇలా చేయడం వల్ల ఉత్పాదకత పెరుగుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళుతుంది, కానీ ఉద్యోగుల ఆరోగ్యం మాత్రం క్షీణిస్తుంది. ముఖ్యంగా గుండెపైన ప్రభావం పడుతుంది. ఎక్కువ పని గంటలు ఉత్పాదకతను పెంచవచ్చు కానీ ఆరోగ్యాన్ని మాత్రం క్షీణించేలా చేస్తాయి. మానసిక ఆరోగ్యం కూడా తగ్గిపోతుంది. ఆఫీసుల్లో చాలామంది కదలకుండా గంటలు గంటలు కూర్చొని పనిచేస్తూ ఉంటారు. వీరు త్వరగా గుండె జబ్బుల బారిన పడే అవకాశం ఉంది.


శరీరంలో గుండె ముఖ్యమైన అవయవం. శరీరం అంతటా రక్తం, రక్తం ద్వారా ఆక్సిజన్, పోషకాలు అన్ని అవయవాలకు చేరాలి. అంటే గుండె సక్రమంగా పనిచేయాలి. మన శరీరం సజీవంగా ఉండాలంటే గుండె అవిశ్రాంతంగా పనిచేయాల్సిందే. అయితే ఎక్కువ పని గంటలు కదలకుండా కూర్చుని పని చేయడం వల్ల గుండెపై ఒత్తిడి పడుతుంది. రోజుకు 8 నుంచి 9 గంటలు కదలకుండా పనిచేసినా చాలు గుండె జబ్బులు వచ్చే అవకాశం 40 శాతం అధికంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక అంతకంటే ఎక్కువ కాలం కూర్చుని పని చేసే వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మన శరీరంలో కార్టిసాల్, అడ్రినలిన్ వంటి ఒత్తిడి హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతాయి. దీనివల్ల గుండె కొట్టుకునే వేగం మారిపోతుంది. రక్తపోటు పెరిగిపోతుంది. ఇది రక్తనాళాలను దెబ్బతీసి గుండెపోటు లేదా మెదడు స్ట్రోక్ కు వచ్చేలా చేస్తుంది.


కాబట్టి ఆఫీసులో గంటలు గంటలు కూర్చొని పనిచేయడం మానేయాలి. ప్రతి గంటన్నరకు ఒకసారి లేచి ఒక ఐదు నిమిషాలు వాకింగ్ చేసి రావడం చాలా ముఖ్యం. శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా గుండె జబ్బులు వస్తాయి. అలాగే అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు వస్తాయి. బరువు కూడా త్వరగా పెరిగిపోతారు.  ఆఫీసులో ఎక్కువ గంటలు కూర్చుని పని చేయడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఒత్తిడి స్థాయిలు పెరిగిపోతాయి. అందుకే యువకుల్లో ఈ మధ్యకాలంలో గుండెపోటు ఎక్కువగా వస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. రోజుకి 12 గంటల పాటు పనిచేసే వారికి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ.


వారంలో కనీసం ఐదు గంటలు వాకింగ్ చేయడానికి కేటాయించాలి. రిలాక్స్ అయ్యే అలవాట్లను పాటించాలి. నిత్యం పనిలోనే పడితే మీకు తెలియకుండానే శరీరంలో ఒత్తిడి పెరిగిపోతుంది. ఏ క్షణం మీ గుండె ఆరోగ్యం క్షీణించి కొట్టుకోవడం ఆగిపోతుందో కూడా చెప్పలేం. కాబట్టి ఉద్యోగులు అధిక పనికి సెలవు చెప్పి, కూల్ గా పని చేసుకునే పరిస్థితులను సృష్టించుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యానికి మొదటిగా ప్రాధాన్యత ఇవ్వాలి.




గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.