Teaching Faculties in AP Universities: ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ఖాళీల భర్తీకి సంబంధించిన డిసెంబరు 18 నుంచి 23 వరకు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ (APPSC) ప్రకటించింది. అదేవిధంగా బయోసైన్సెస్ విభాగాలకు వచ్చే ఏడాది జనవరి 5న (05.01.2024) పరీక్ష నిర్వహించనున్నట్లు కమిషన్ తెలిపింది. అయితే కమిషన్ నిర్ణయంపై అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రొవిజనల్‌ జాబితా జారీ ప్రక్రియను చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించినప్పటికీ.. ఏపీపీఎస్సీ మాత్రం అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ పరీక్షల తేదీలను ప్రకటించడంపై అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఆదేశాలను భేఖాతరు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 


రాష్ట్రంలో 18 వర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి ఇచ్చిన ప్రకటనలు, రిజర్వేషన్‌ ఖరారు విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో-90ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు ఇటీవల స్పందించింది. విచారణను డిసెంబరు 4కు వాయిదా వేసిన న్యాయస్థానం.. అప్పటి వరకు దరఖాస్తులను స్వీకరించేందుకు అవకాశం కల్పించింది. ప్రొవిజనల్‌ జాబితా జారీ ప్రక్రియను చేపట్టవద్దని ఆదేశించినప్పటికి.. ఏపీపీఎస్సీ పరీక్షల తేదీలను ప్రకటించింది.



ఏపీలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అక్టోబరు 30న నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. యూనివర్సిటీలవారీగా నోటిఫికేషన్లను విడుదల చేశారు. వీటిద్వారా రాష్ట్రంలోని మొత్తం 18 విశ్వవిద్యాలయాల్లో 3,220 పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాక్‌లాగ్ పోస్టులతోపాటు రెగ్యులర్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. వీటిలో బ్యాక్‌లాగ్ పోస్టులు 278, రెగ్యులర్ పోస్టులు 2942 ఉన్నాయి. వీటిలో ప్రొఫెసర్ 418 పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్ 801  పోస్టులు, ట్రిపుల్ ఐటీల లెక్చరర్ పోస్టులతో కలిపి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 2,001 ఉన్నాయి.


పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా నవంబరు 20న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. నవంబరు 27లోపు దరఖాస్తు హార్డ్‌కాపీలను సమర్పించాల్సి ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా నియామకాలు చేపడతారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం సహాయ ఆచార్యుల స్క్రీనింగ్ పరీక్షకు అర్హత సాధించిన వారి జాబితాను 30న వర్సిటీలు ప్రకటిస్తాయి. వీటిపై డిసెంబరు 7 వరకు అభ్యంతరాలను స్వీకరించి, డిసెంబరు 8న తుది జాబితాను ప్రకటిస్తాయి. స్క్రీనింగ్ పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహించనుంది. 


పోస్టుల భర్తీకి 2017, 2018ల్లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసినందున కొత్త నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వర్సిటీలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున కోర్టు తీర్పునకు లోబడి నియామక ప్రక్రియ ఉంటుందని వెల్లడించాయి. వర్సిటీ యూనిట్‌గా కొత్తగా రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లతో పోస్టులను ప్రకటించాయి. అసోసియేట్ ఆచార్యులు, ప్రొఫెసర్ పోస్టులకు ఉమ్మడి పరీక్ష ఉండదు. విశ్వవిద్యాలయాల స్థాయిలోనే నియామకాలు చేపడతారు. 


పరీక్ష విధానం..
స్క్రీనింగ్ రాత పరీక్షను ఏపీపీఎస్సీ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తుంది. 3 గంటల సమయంలో మొత్తం 150 బహుళైచ్ఛిక ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు, ఒక తప్పునకు ఒక మైనస్ మార్కు ఉంటుంది. ఈ పరీక్షలో వచ్చిన మార్కులు, అకడమిక్ ప్రాధాన్యంగా ఇంటర్వ్యూకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


ముఖ్యమైన తేదీలు..


➥ నోటిఫికేషన్ల వెల్లడి: 30.10.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.10.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.11.2023.


➥ దరఖాస్తు హార్డ్ కాపీల సమర్పణకు చివరితేది: 27.11.2023.


➥ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల ప్రాథమిక జాబితా వెల్లడి: 30.11.2023.


➥ ప్రాథమిక జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు చివరితేది: 07.12.2023.


➥ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల తుది ఎంపిక జాబితా వెల్లడి: 08.12.2023.