శరీరంలో ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగితే ప్రాణాలతో బయటపడటం చాలా కష్టం. ఇది ఎక్కువగా ప్రమాదాల్లో గాయపడినవారిలో చోటుచేసుకుంటుంది. క్షతగాత్రులను కాపాడాలంటే.. తప్పకుండా ఇంటర్నెల్ బ్లీడింగ్ ఆపాలి. అయితే, అది అంత సులభమైన పని కాదు. ఈ నేపథ్యంలో ఎంఐటీ పరిశోధకులు ఓ అద్భుతాన్నికనుగొన్నారు. అదే ‘సింథటిక్ బ్లడ్ క్లాట్స్’. అంటే రక్త ప్రవాహాన్ని తాత్కాలికంగా అడ్డుకుని రక్తస్రావం కాకుండా ఉండేందుకు సింథటిక్ మెటిరియల్‌తో కృత్రిమంగా రక్తాన్ని గడ్డకట్టించే ప్రక్రియ.
పెద్దపెద్ద ప్రమాదాల్లో హాస్పిటల్ కు వెళ్లే లోపు ఇంటర్నల్ గా జరిగే రక్తస్రావాన్ని ఆపేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. అందువల్ల హాస్పిటల్ కి చేరే లోగా మరణించే ప్రమాదాన్ని అరికట్ట వచ్చు. ఫలింతంగా బాధితుడి ప్రాణాలను కాపాడవచ్చు.
దీన్ని శరీరంలోకి ఇంజెక్ట్ చేసేందుకు అనువుగా రెండు కాంపోనెంట్లుగా రూపొందించారు. ఇది ఇంటర్నల్ గాయాలు ఏర్పడిన చోట బ్లడ్ క్లాట్స్ ఏర్పడేలా చేస్తుంది. దీనిలో ఉపయోగించిన పదార్థాలు సహజంగా శరీరంలో ఏర్పడే బ్లడ్ క్లాట్ల వలెనే ఉంటాయి. తీవ్రమైన అంతర్గత రక్తస్రావం వల్ల హాస్పిటల్ కు చేరేలోపు మరణం జరగకుండా ఇది నివారిస్తుందని ఈ పరిశోధకులు అంటున్నారు.
తీవ్రంగా గాయపడినపుడు రక్తస్రావాన్ని త్వరగా ఆపడం వల్ల కేవలం ప్రాణాలు కాపడడం మాత్రమే కాదు. రక్తస్రావం తక్కువ కావడం వల్ల కోలుకోవడానికి సమయం కూడా తక్కువ పడుతుందని నిపుణులు అబిప్రాయపడుతున్నారు. ఈ కొత్త ఆవిష్కరణ అందుబాటులోకి వస్తే ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని ఈ పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.
ఈ అధ్యయన వివరాలు అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ మెటిరియల్స్ జర్నల్ లో ప్రచురించారు. ఈ బ్లడ్ క్లాట్ మెటిరీయల్ తయారీలో వాడిన నానోపార్టికల్స్, పాలీమర్స్ ఇంతకుముందు డెవలప్ చేసిన హెమోస్టాటికల్ నానో పార్టికల్స్ కంటే మెరుగ్గా పనిచేస్తాయని వివరించారు. ఇదివరకు డెవలప్ చేసిన హెమోస్టాటిక్ వ్యవస్థ మాదిరిగా కాకుండా కొత్త సాంకేతికత రెండు ప్లేట్ లెట్ల చర్యలను అనుకరిస్తుంది. రక్తం గడ్డకట్టించే చర్యలో పాల్టొనే ఫైబ్రినోజెన్ అనే ప్రొటీన్ మాదిరిగానే పనిచేస్తుంది. రెండు కంపోనెంట్లను ఉపయోగించడం వల్ల హెమోస్టాటిక్ సిస్టమ్ లో జిలేషన్ త్వరగా ప్రారంభం అవుతుంది. అందువల్ల గాయం కాన్ సన్ట్రేటెడ్ గా మారుతుంది. ఇది సహజంగా రక్తస్కందనలో జరిగే నాచురల్ కాస్కెడ్ ను అనుకరిస్తుందని చెప్పవచ్చని ఎంఐటీ ప్రొఫెసర్ బ్రాడ్లీ ఒలెన్స్ వివరించారు.
ఇంటర్నల్ ఇంజూరీస్ వల్ల ప్లేట్ లెట్లు అక్కడికి ఆకర్శించబడి అక్కడ రక్తం గడ్డకట్టే ప్రక్రియ మొదలవుతుంది. క్లాటింగ్ క్యాస్కెడ్ ప్రారంభం అవుతుంది. చివరికి ఫైబ్రినోజన్ తో కలిసి ప్లేట్ లెట్లు, రక్తస్కందన ప్రొటీన్ తో కలిసి బంకగా ఉండే ప్లేక్ ఏర్పడుతుంది. అయతే రక్తస్రావం తీవ్రంగా ఉన్నపుడు స్కందన ప్రక్రియకు సరిపడేన్ని ప్లేట్ లెట్లు, ఫైబ్రినోజెన్లు ఉండవని నిపుణులు చెబుతున్నారు. ఎంఐటీ పరిశోధకులు ఇలాంటి సందర్భాల్లో ప్రాణాలు రక్షించేందకు సహాయపడే కృత్రిమ వ్యవస్థను రూపొందించారు. ప్లేట్ లెట్ల మాదిరిగా పనిచేసే నానోపార్టికల్స్, ఫైబ్రినోజన్ ను అనుకరించే పాలిమర్ ఇలా రెండు రకాల పదార్థాలు ఇందులో ఉంటాయి. ఈ కణాలు PEG-PLGA అనే బయోకంపాజిబుల్ పాలిమర్ తో తయారయ్యాయి. ఇవి GRGDS అనే పప్టైడ్ తో కలిసి పనిచేస్తాయి. ఇది ప్లేట్ లెట్లను ఒకదానితో ఒకటి బంధించి ఉంచేందుకు తోడ్పడుతుంది. ప్లేట్ లెట్లు గాయపడిన ప్రదేశానికి లాగాడం వల్ల ఈ కణాలు గాయం ఏర్పడిన భాగంలో పేరుకుపోతాయి. ఫలితంగా త్వరగా రక్తస్కందన జరిగే అవకాశం ఏర్పడుతుంది.
Also Read: నిద్రపోయే ముందు పాలు తాగకూడదా? ఎందుకు?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.