Bandi Sanjay Bail : పదో తరగతి పేపర్ల లీకేజీ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ఊరట లభించింది. బండి సంజయ్ బెయిల్ ను రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను హన్మకొండ కోర్టు కొట్టివేసింది.  టెన్త్ హిందీ పేపర్ లీకేజీ స్కాంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ  బండి సంజయ్ కుమార్ బెయిల్ ను రద్దు చేయాలంటూ పోలీసుల దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసిన హన్మకొండ కోర్టు. అంతకు ముందు ఈ కేసులో తీవ్రవాదోపవాదనలు జరిగాయి. టెన్త్ పేపర్ లీక్ కేసులో రాజకీయ కక్షతోనే బండి సంజయ్ ను నేరస్థుడిగా చూపించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని బండి సంజయ్ తరపు న్యాయవాదులు వాదించారు. టెన్త్ పేపర్ లీకేజీతో బండి సంజయ్ కు సంబంధం ఉన్నట్లు నిరూపించడంలో పోలీసులు విఫలమయ్యారని సీనియర్ న్యాయవాదులు ఎల్.రవించందర్, కరుణాసాగర్ వాదించారు. 


బండి సంజయ్ న్యాయవాదుల వాదనలు


విచారణకు సహకరించాలంటూ పోలీసులు జారీ చేసిన నోటీసులో మొబైల్ ను స్వాధీనం చేయాలని కోరడంపట్ల బండి సంజయ్ తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు.  అప్పటికే మొబైల్ మిస్ అయ్యిందని పోలీసులకు బండి సంజయ్ ఫిర్యాదు చేశారు. ఆ మేరకు ఫిర్యాదు నమోదైందని చెప్పినప్పటికీ ఈ విషయాన్ని కప్పిపుచ్చుతూ కోర్టును తప్పుదోవపట్టించేందుకు పోలీసులు ప్రయత్నించారని న్యాయవాదులు వాదించారు.  ఆర్టికల్ 23 ప్రకారం... ఎవరైనా నేరస్థునిపై మోపిన అభియోగాన్ని నిరూపించేందుకు సాక్ష్యాలు చూపాలే తప్ప బెదిరింపులకు పాల్పడటమంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాయడమేనన్న బండి సంజయ్ తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. సుదీర్ఘ విచారణ అనంతరం బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్ ను హన్మకొండ న్యాయస్థానం కొట్టివేసింది. 


బెయిల్ రద్దు పిటిషన్ 
 
పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం బయటకు వచ్చిన కేసులో బండి సంజయ్ కు మంజూరైన బెయిల్ పిటిషన్ ను రద్దు చేయాలని గతంలో పోలీసులు హన్మకొండ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  ఎస్ఎస్సీ హిందీ పేపర్ వాట్సాప్ ద్వారా బయటకు వచ్చిన కేసులో ఆయన పోలీసులకు ఏమాత్రం సహకరించడం లేదని, ఫోన్ ఇవ్వడం లేదని ఆ పిటిషన్ లో పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా బెయిల్ నిబంధనలు ఉల్లంఘించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని అందులో ఆరోపించారు. అందుకే ఆయన బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని కోరుతూ పోలీసులు తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పిటిషన్ దాఖలు చేశారు. బండి బెయిల్ రద్దు చేయాలని గతంలోనూ పిటిషన్ దాఖలు చేయగా, దానిని కోర్టు తిరస్కరించింది.  


పదో తరగతి పేపర్ లీకేజీ 


పదో తరగతి హిందీ ప్రశ్నా పత్రం లీకేజీ కేసులో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై పోలీసులు నమోదు చేశారు. 120 బి, 420, 447, 505 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.  వాట్సాప్ ద్వారా మీడియాకు రావడం... అక్కడి నుండి ఓ మాజీ మీడియా ప్రతినిధి బండి సంజయ్ సహా పలువురు రాజకీయ నాయకులకు దానిని పంపించారని పోలీసులు అభియోగించారు. పరీక్ష పూర్తి కావడానికి మరో అరగంట ఉందనగా బండి సంజయ్ వాట్సాప్ కు పేపర్ వచ్చిందని తెలిపారు.  దీంతో పోలీసులు బండి సంజయ్ సహా పలువురిని అరెస్ట్ చేసి, జైలుకు పంపించారు. ఈ కేసులో బండి సంజయ్‌కు హనుమకొండ కోర్టు  బెయిల్‌ మంజూరు చేసింది. రూ. 20వేలతో పాటు ఇద్దరి పూచీకత్తుపై షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తర్వాత బండి సంజయ్‌ను ఫోన్ అప్పగించాలని విచారణకు రావాలని హన్మకొండ పోలీసులు నోటీసులు ఇచ్చారు.