మరణాన్ని జయించి, నిత్యం యవ్వనంగా ఉండేందుకు మానవుడు ఎన్నాళ్ల నుంచో ప్రయత్నిస్తునే ఉన్నాడు. దీనిపై రకరకాల ప్రయోగాలు, రకరకాల సిద్ధాంతాలు, ఎన్నో రకాల రాద్దాంతాలు కూడా జరిగాయి. కానీ ఇప్పటికీ సరైన కిటుకు మాత్రం చేతికందలేదు. అయితే కొత్తగా జరిగిన ప్రయోగాల్లో జీనోమ్ రెగ్యులేటరీ సర్క్యూట్లను గుర్తించామని శాస్త్రవేత్తలు అంటున్నారు. మరి అవేమిటి? ఎలా పనిచేస్తాయి?


కాలిఫోర్నియా శాన్ డియాగో యూనివర్సిటి పరిశోధకులు కనుగొన్నారు. కణజాలల్లో సహజంగా కొంత కాలం తర్వాత నిరంతరం క్షీణించి కొత్త కణాలు ఏర్పడుతూ ఉంటాయి. వయసు పెరిగే కొద్ది క్షీణించే పరిమాణం పెరగిపోతుంది. ఈ మొత్తం ప్రోగ్రాంను రీ ప్రోగ్రాం చెయ్యడం ద్వారా పెరిగే వయసును ఆపొచ్చని పరిశోధకులు పేర్కొన్నారు.


ఈ ప్రయోగం ఈస్ట్ కణాల మీద ప్రస్తుతం జరిపారు. దీని ఫలితాల ద్వారా మానవ కణజాలల క్షీణతను రీప్రోగ్రాం చెయ్యడం ఎలాగో తెలుసుకోవడానికి మార్గం కాస్త సుగమం అయ్యిందని ఈ అధ్యయనకారులు భావిస్తున్నారు. కణజాలాల ఏజింగ్ ప్రాసెస్ ను రీప్రోగ్రాం చెయ్యడానికి సింథటిక్ బయాలజీ అప్లైచెయ్యడం ద్వారా సాధ్యపడుతుందని ఈ పరిశోధనలో పాల్గొన్న ప్రొఫెసరస్ నాన్ హావో అన్నారు.


మరింత కాంప్లెక్స్ కణజాలాలు కలిగిన జీవుల్లో దీన్ని సంభావ్యతకు సింథటిక్ జన్యు సర్క్యూట్ లను రూపొందించేందుకు ఈ పరిశోధనను పునాదిగా భావించవచ్చు. జీరియాట్రిక్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో నిపుణులు శాశ్వత జీవితం గురించిన పరిశోధనల మీద ఎక్కువ దృష్టి నిలుపుతున్నారు. 150 సంవత్సరాల పాటు జీవించగలిగే మొదటి వ్యక్తి ఈపాటికే పుట్టాడని కొందరు నమ్ముతున్నారు. 1997లో మరణించిన అత్యంత వృద్ధ వ్యక్తి జీన్ కాల్మెంట్ 122 సంవత్సరాల వయసు వరకు జీవించాడు.


వయసు వెనక్కి తిప్పే మెకానిజం


సైన్స్ జర్నల్‌లో ప్రచురించిన తాజా అధ్యయనంలో సెల్యులార్ స్థాయిలో వృద్ధాప్యాన్ని దరిచేరకుండా ఆపగలగడం గురించి చర్చించింది. ఈ పరిశోధనలో కణాల వయసుకు కారణమయ్యే జీన్ రెగ్యులేటరీ సర్క్యూట్స్ అనే మెకానిజమ్స్ ను గుర్తించారు. మనం ఇప్పుడు ఉపయోగించే ఎలక్ట్రానిక్ అప్లయెన్సెస్, ఆటోమోబైల్స్ ను కంట్రోల్ చేసే ఎలక్ట్రిక్ సర్క్యూట్ల మాదిరిగానే ఈ జీన్ సర్క్యూట్స్ కూడా పనిచేస్తాయట. ఆ సర్క్యూట్ల మాదిరిగానే వాటిని ఆపటానికి, పనిచెయ్యటానికి రీపైర్ చెయ్యవచ్చని ఈ పరిశోధకుల బృందం కనుగొన్నారు.


వారు ఈస్ట్ కణాల్లోని సర్క్యూట్స్ ను రెండు రకాల స్థితుల మధ్య మార్పు తీసుకొచ్చే విధంగా రీప్రోగ్రాం చెయ్యగలిగారు. ఫలితంగా ఈస్ట్ కణాల క్షీణత మందగించడాన్ని గమనించారు. ఇది కణాల జీవిత కాలం పెరగడానికి దోహదం చేసింది. జెనిటిక్ అండ్ కెమికల్ ఇంటర్వెన్షన్ల ద్వారా కొత్త రికార్డ్ ను వీరు నెలకొల్పారని అనవచ్చు. ఇలా రివైర్ చేసిన కణాల జీవిత కాలం రీవైర్ చెయ్యని కణాలతో పోల్చినపుడు దాదాపు 82 శాతం పెంచడం సాధ్యపడింది.


ఇదే మొదటి సారి


దీర్ఘాయుష్షుకు సంబంధించిన ప్రయోగాల్లో గైడెడ్ సింథటిక్ బయాలజి, ఇంజనీరింగ్ సూత్రాలను ఉపయోగించడం ఇదే మొదటి సారి. ఈటీమ్ ఇప్పటి వరకు వచ్చిన ప్రయోగ ఫలితాల ఆధారంగా మానవ కణజాలాలకు ఎలా అన్వయించవచ్చో తదుపరి ప్రయోగాల్లో అధ్యయనం చేస్తుందని ఈ అధ్యయనకారుల బృందానికి నాయకత్వం వహించిన హావో అన్నారు. అదేదో త్వరగా పూర్తిగా కనుగొని మందు కనిపెడితే.. బ్రేక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అనుకుంటున్నారా? అయితే, కొన్నాళ్లు ఆగాల్సిందే.


Also Read: సమంతను కాపాడుతున్న డైట్ ఇదే - ఇలా తింటే అందం, ఆరోగ్యం మీ సొంతం