బాలీవుడ్ హీరోయిన్ జియా ఖాన్‌ ఆత్మహత్య కేసులో ముంబై సీబీఐ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ హీరో సూరజ్‌ పంచోలీకి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవంటూ, సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అతన్ని నిర్దోషిగా ప్రకటించింది. 

 

జియా ఖాన్ 2013 జూన్ 3న ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. మరణానికి ముందు ఆమె ఆరు పేజీల సూసైడ్ నోట్‌ ను రాసింది. సూరజ్‌ తో సహజీవనంలో తలెత్తిన సమస్యలు వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే, తన కూతురు సూసైడ్ చేసుకునేలా సూరజ్‌ ప్రేరేపించాడంటూ జియాఖాన్‌ తల్లి రబియా పోలీసులను ఆశ్రయించింది. 

 

సూరజ్ చేతిలో జియా ఖాన్ శారీరక వేధింపులు. మానసిక హింసకు గురైందనే ఆరోపణలతో IPC సెక్షన్ 306 కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడిని కస్టడీలోకి తీసుకుని దర్యాప్తు చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు అతను బెయిల్ పై విడుదల అయ్యాడు. అయితే ఈ కేసుపై తమకు అధికార పరిధి లేదని సెషన్స్ కోర్టు చెప్పడంతో 2021లో ప్రత్యేక సీబీఐ కోర్టుకు కేసును బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో కేసును దర్యాప్తు చేయాలంటూ రబియా బాంబే హైకోర్టుకు వెళ్ళింది. అయితే ఈ పిటిషన్‌ ను న్యాయస్థానం కొట్టివేసింది. 

 

ఈ కేసులో ప్రాసిక్యూషన్ జియా తల్లి రబియాతో సహా 22 మంది సాక్షులను విచారించగా, సూరజ్ తరపున న్యాయవాది ప్రశాంత్ పాటిల్ వాదించారు. తన కూతురికి ఆత్మహత్య కాదని, హత్యేనని నమ్ముతున్నట్లు రబియా కోర్టుకు తెలిపారు. సూరజ్ జియాను శారీరకంగా హింసించేవాడని, మాటలతో దూషించేవాడని సిబిఐ కోర్టుకు తెలిపింది. 

 

ఇరు వర్గాల వాదనల అనంతరం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఎఎస్ సయ్యద్ శుక్రవారం తీర్పును వెలువరించారు. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా సూరజ్ పంచోలీని దోషిగా నిర్ధారించలేమని వ్యాఖ్యానించారు. అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తున్నట్లు తీర్పు చెప్పారు. ఈ తీర్పుతో జియాఖాన్‌ కు న్యాయం జరగాలంటూ సుమారు పదేళ్ల నుంచి న్యాయ పోరాటం చేస్తున్న ఆమె తల్లి రబియా తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

 

కాగా, న్యూయార్క్‌ కు చెందిన జియా ఖాన్‌.. సినిమాల్లో నటించాలనే ఆసక్తితో ఇండియాకు వచ్చింది. రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'నిశ్శబ్ద్' సినిమాతో జియా నటిగా పరిచయమైంది. ఆ తర్వాత 'గజినీ' హిందీ రీమేక్ లో సెకండ్‌ హీరోయిన్‌ గా కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

 

హీరోయిన్ గా రాణిస్తోన్న సమయంలోనే సీనియర్ నటులైన ఆదిత్య పంచోలి - జరీనా వహాబ్‌ ల కుమారుడు సూరాజ్‌ పంచోలీతో జియా ఖాన్ ప్రేమలో పడింది. అయితే 2013న ఆమె ఇంటిలో శవమై కనిపించడం అప్పట్లో సంచలనం రేపింది. ఇన్నాళ్ళకు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సూరజ్ ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.