సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం 'విరూపాక్ష'. కార్తీక్ దండు అనే డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళుతోంది. తొలి రోజే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మిస్టిక్ థ్రిల్లర్.. రెండో వారంలోనూ అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని ఇతర భాషల్లోకి తీసుకెళ్లడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

 

'విరూపాక్ష' మూవీని మొదట తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో పాన్ ఇండియా వైడ్ గా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కానీ చివరకు కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ చేశారు. ఇక్కడ రెస్పాన్స్ బాగుంటే, ఆ తర్వాత ఇతర భాషల్లో డబ్ చేద్దామని అనుకున్నారు. తెలుగు వర్షన్ కు అద్భుతమైన స్పందన రావడంతో.. ఇప్పుడు ఈ చిత్రాన్ని మల్టీ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు.

 

'విరూపాక్ష' చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర & సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. హిందీలో ఈ మూవీని ప్రముఖ సంస్థ గోల్డ్ మైన్స్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలానే తమిళ్ లో స్టూడియో గ్రీన్.. మలయాళంలో E4 ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా తెలిపారు.

 

ఇటీవల కాలంలో తెలుగు సినిమాలు నార్త్ మార్కెట్ లో మంచి వసూళ్ళు రాబడుతున్నాయి. 'బాహుబలి' నుంచి 'కార్తికేయ 2' వరకూ అనేక చిత్రాలు హిందీలో సత్తా చాటాయి. ఇప్పుడు 'విరూపాక్ష' కూడా ఇంట గెలిచి రచ్చ గెలుస్తుందని ఆశిస్తున్నారు. హిందీలో ఈ సినిమాని మే 5వ తేదీన విడుదల చేయడానికి రెడీ అవుతున్నారని టాక్ నడుస్తోంది. అక్కడ పెద్ద సినిమాలేవీ లేకపోవడం మెగా మేనల్లుడి చిత్రానికి కలిసొస్తుందని భావిస్తున్నారు.

 

ఇదిలా ఉంటే 'విరూపాక్ష' సినిమా ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయిన ఈ చిత్రం.. వారం రోజుల్లో రూ. 62.5 కోట్లు కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ పోస్టర్ వదిలారు. ఓవర్సీస్ లోనూ ఈ మూవీ కాసుల వర్షం కురిపిస్తోంది. యూఎస్ లో మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరింది. ఇది సాయి ధరమ్ తేజ్ కెరీర్ ఫస్ట్ మిలియన్ డాలర్ మూవీగా.. హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. మరి హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.

 

కాగా, క్షుద్రపూజలు, చేతబడులు నేపథ్యంలో "విరూపాక్ష'' సినిమా తెరకెక్కింది. దీనికి స్టార్ డైరక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే సమకూర్చారు. ఇందులో సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ నటనకు ప్రశంసలు దక్కాయి. బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్, రవి కృష్ణ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం సమకూర్చగా.. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ గా 'విరూపాక్ష 2' తీయనున్నట్లు దర్శక హీరోలు క్లారిటీ ఇచ్చారు.