కోలీవుడ్ టాప్ హీరో మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో ‘మార్క్ ఆంథోని’ అనే సినిమా చేస్తున్నారు. మినీ స్టూడియో బ్యానర్‌పై ఎస్ వినోద్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. విశాల్‌తో పాటు ఎస్ జె సూర్య ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ విడుదల అయ్యింది.  టైమ్ ట్రావెల్ కథాంశంతో యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను ఓ రేంజిలో పెంచింది.






టైమ్ ట్రావెల్ కథాశంతో తెరకెక్కిన ‘మార్క్ ఆంథోని’


ఇక టీజర్ విషయానికి వస్తే తెలుగు నటుడు సునీల్, తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్, హీరోయిన్ రీతూ వర్మ, అభినయ పాత్రలను చూపిస్తూ టీజర్ షురూ అవుతుంది. ఆ తర్వాత చిరంజీవి ఫోన్ అనే సరికొత్త ఫోన్ ను చూపిస్తారు. ఈ ఫోన్ కాలంతో పాటు టైమ్ ను మార్చే అద్భుత శక్తిని కలిగి ఉంటుందని చూపిస్తారు. ఈ ఫోన్ ద్వారా టైమ్ ట్రావెల్ చేసే అవకాశం ఉంటుందని  విశాల్  సూర్యతో చెప్తాడు. ఎలాగైనా దాన్ని దక్కించుకునేందుకు వీరిద్దరు చేసే ప్రయత్నాలను సినిమాగా రూపొందించారు దర్శకుడు రవి చంద్రన్. ఈ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్ ను రంగరిస్తూ ఈ టీజర్ ను నెట్టింట్లోకి వదిలారు ఫిల్మ్ మేకర్స్.  


రెండు పాత్రల్లో అదరగొట్టిన విశాల్


 సినిమాలో విశాల్ రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. టీజర్, రెండు పాత్రల్లో చక్కటి నటనతో విశాల్ అదరగొట్టాడు. ఎస్ జే సూర్య సూపర్ డూపర్ నటనతో అదుర్స్ అనిపించాడు. స్టైలిష్ విలన్ పాత్రలో ఇట్టే ఒదిగిపోయారు. తన మార్క్ యాక్షన్ సీన్స్ తో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్ కు అదిరిపోయే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా త్వరలో పలు భాషల్లో విడుదల కానుంది.



ఆశలన్నీ‘మార్క్‌ ఆంథోని’ పైనే!


సుమారు రెండు దశాబ్దాల క్రితం ‘పందెంకోడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశాల్. తొలి సినిమాతోనే తెలుగు నాట మంచి ప్రజాదరణ దక్కించుకున్నారు. అప్పటి నుంచి ఆయన తమిళంలో నటించిన ప్రతి సినిమా తెలుగులో విడుదల అవుతుంది. ఆయన చిత్రాలు టాలీవుడ్ ఇక్కడి టైర్‌2 హీరోల రేంజిలో విజయాలను అందుకుంటున్నాయి. అయితే, గత కొంతకాలంగా ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ అందుకోవడం లేదు. సుమారు 5 సంవత్సరాల క్రితం వచ్చిన ‘అభిమన్యుడు’ సినిమా తర్వాత సాలిడ్ హిట్ అందుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో  ‘మార్క్‌ ఆంథోని’ సినిమాపై ఆయన భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.


Read Also: ‘ఏజెంట్‌’ ఆడియన్స్ రివ్యూ: అఖిల్ వైల్డ్ ఆపరేషన్‌ సక్సెస్ అయినట్లేనా? అయ్యగారు ఏంటిది?