Kakinada News: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ నుంచి తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని ప్రత్తిపాడు జడ్పీటీసీ సభ్యురాలు బెహరా రాజరాజేశ్వరి ఆరోపించడం స్థానికంగా సంచలనం రేకెత్తించింది. తననే కాదు, తన భర్త, తన కుమార్తె, తమ అనుచరులపై కక్షకట్టి అనేక కేసులు పెట్టించారని చెప్పారు. ఎమ్మెల్యే ఆగడాలపై ఇప్పటికే పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశామని జడ్పీటీసీ తెలిపారు.


గత ఏడాది కాలంగా ఎమ్మెల్యే తనపై వేధింపులకు పాల్పడుతున్నాడని వివరించారు రాజేశ్వరి. ఇటీవలే వాలంటీర్లు, అధికారులు, అనుచరులతో సమావేశాలు నిర్వహించి తాను, తన భర్త (వైసీపీ మండల కన్వీనర్‌ అయిన బెహరా దొరబాబు), తన మామ, కూతురు (జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షురాలు బెహరా లక్ష్మీప్రసన్న) ప్రజల్లోకి వెళ్తే తరిమి కొట్టాలని తన అనుచరులకు ఇతర నాయకులకు పిలుపునిచ్చారని ఆరోపించారు. ఇందులో భాగంగానే ఇటీవల జరిగిప పంచాయతీ రాజ్‌ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తమపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారని, ఆపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. ఎమ్మెల్యే వల్ల తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని తెలిపారు.


అధిష్ఠానానికి ఫిర్యాదు చేశాం


ఆడవారికి పెద్దపీట వేసి.. సీఎం జగన్ ఎంతో విలువ ఇస్తుంటే.. తమ ఎమ్మెల్యే మహిళా జడ్పీటీసీనైన తనపై వేధింపులకు పాల్పడడం దారుణం అంటూ చెప్పారు. దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని.. వారు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.