‘పోకిరి’ టాలీవుడ్ లో ఓ సంచలన చిత్రం. పూరీ జగన్నాథ్ డైరెక్షన్, మహేష్ బాబు యాక్టింగ్, మణిశర్మ మ్యూజిక్ మ్యాజిక్, ఇలియానా అంద చందాలకు బాక్సాఫీస్ దగ్గర రికార్డుల  మోతమోగిపోయింది. పండుగాడి ఫర్ఫార్మెన్స్ కు కలెక్షన్ల వర్షం కురిసింది. 200 సెంట్లర్లో 100 రోజులు ఆడి ఇండస్ట్రీలో సరికొత్త చరిత్ర లిఖించింది. మహేష్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిన ఈ సినిమాకు 17 ఏళ్లు పూర్తయ్యాయి.


ఏప్రిల్ 28, 2006లో ‘పోకిరి’ విడుదల


‘పోకిరి’ విడుదలకు ముందు ఇంత సంచలన విజయం అందుకుంటుందని ఎవరూ ఊహించలేదు. బహుశe మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కూడా అనుకొని ఉండకపోవచ్చు. అప్పటికే దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న పూరీ, ఇంతలా ఇండస్ట్రీ హిట్ అందుకుంటాడని ఎవరూ అనుకోలేదు. రెండో సినిమాతోనే ఇలియానా టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటుందని కలలో కూడా ఊహించలేదు. మణిశర్మ సంగీతానికి  థియేటర్లు ఊగిపోతాయని ఎవరూ కలగనలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే, పండుగాడు కొట్టిన దెబ్బకు టాలీవుడ్ రికార్డులు బద్దలయ్యాయి. తెలుగు సినిమా పరిశ్రమ ఆలోచనలను పూర్తిగా మర్చేసింది. 


అసలు మహేష్ ‘పోకిరి’ ఫస్ట్ ఛాయిస్ కాదు!    


‘పోకిరి’ సినిమా విషయంలో రకరకాల మార్పులు జరిగాయి. ముందుగా ఊహించిన విషయాలకంటే ప్రతిదీ భిన్నంగానే జరిగింది. పూరీ అనుకున్న సినిమా వేరు, ఔట్ ఫుల్ వచ్చింది వేరు. వాస్తవానికి ఈ సినిమాను పవన్ కల్యాణ్ తో చేయాలి అనుకుని కథ రెడీ చేసుకున్నారు. ఈ సినిమాకు ‘ఉత్తమ్ సింగ్- సన్నాఫ్ సూర్యనారాయణ’ అనే పేరు కూడా అనుకున్నారు. ఇదే విషయాన్ని పవన్ కు చెప్పారు. కానీ, ఆయన ఎందుకో ఈ సినిమా చేసేందుకు ఆసక్తి చూపించలేదు. ఆ తర్వాత రవితేజతో చేయాలి అనుకున్నా కుదరలేదు. అదే, సమయంలో సోనూసూద్ తో సినిమా చేసేందుకు ప్లాన్ వేశారు. అదీ వర్కౌట్ కాలేదు. చివరకు మహేష్ బాబు దగ్గరికి వచ్చి కథ ఆగింది. ఆయనకు కథ చెప్పడం, నచ్చడంతో సినిమా పట్టాలెక్కింది. ఈ సినిమాలో కంగనా రనౌత్ ను హీరోయిన్ గా అనుకున్నా, ఆమె బాలీవుడ్ లో మరో ఆఫర్ రావడంతో ఈ సినిమాను వదులుకుంది. అదే సమయంలో ఇలియానాను ఫిక్స్ చేశారు.


బుల్లెట్ మాదిరి దూసుకెళ్లిన డైలాగులు, ఆకట్టుకున్న పాటలు


మహేష్ బాబు సినిమాకు ఓకే చెప్పడంతో, అప్పటి వరకు అనుకున్న కథలో చాలా మార్పులు చేశారు పూరీ. అంతేకాదు, మిల్క్ బాయ్ లాంటి మహేష్ బాబును మాస్ హీరోగా చూపించేందుకు ప్రయత్నించారు. ఆయన క్యారెక్టర్ ను బాగా ఎలివేట్ చేసేలా అదిరిపోయే డైలాగ్స్ రాశారు. “ఒక్కసారి కమిట్ అయితే, నా మాట నేనే వినను” లాంటి డైలాగ్స్ జనాల్లోకి దూసుకెళ్లాయి. "ఎప్పుడు వచ్చాం అన్నది కాదన్నయ్యా,బుల్లెట్ దిగిందా లేదా??" అంటూ మహేష్ పలికే మాటలు ఆడియెన్స్ లోని కరెంటులా ప్రవహించాయి. సినిమా ఎండింగ్ లో కృష్ణమనోహర్ ఐపీఎస్​గా మహేష్ బాబు యూనిఫామ్ లో కనిపించడం చూసి ఆడియెన్స్ ఆశ్చర్యంలో మునిగిపోతారు. ఈ ట్విస్టుకు అభిమానుల్లో ఉత్సాహం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది.  ఇక ఈ సినిమాలోని పాటలు యువతను బాగా ఆకట్టుకున్నాయి. ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే’ అంటూ సాగే ఐటమ్ సాంగ్ అప్పట్లో చార్ట్ బస్టర్ గా నిలిచింది. రెండు, మూడు సంవత్సరాల పాటు ‘పోకిరి’ పాటలే జనాల నోళ్లలో నానాయంటే, మణిశర్మ మ్యూజిక్ మ్యాజిక్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.   


రికార్డుల మోత మోగించిన ‘పోకిరి’


‘పోకిరీ’ సినిమా తెలుగులో అప్పటి వరకు ఏ సినిమా సాధించని రికార్డులను నెలకొల్పింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 200 సెంటర్లలో 100రోజులు ఆడింది. దేశ వ్యాప్తంగా ఇదో సరికొత్త రికార్డు.  63 సెంటర్లలో 175 రోజులు ప్రదర్శించపడింది. ఆరోజుల్లోనే ఏకంగా రూ. 66కోట్ల గ్రాస్ ను, 44కోట్లు షేర్ ను సాధించింది. ఈ సినిమా తమిళంలో ‘పోకిరి’ పేరుతో విజయ్ హీరోగా విడుదలై సంచలన విజయం నమోదు చేసింది. బాలీవుడ్ లో సల్మాన్ ‘వాంటెడ్’ పేరుతో రీమేక్ చేసి అద్భుత విజయాన్ని అందుకున్నారు. అలాంటి ‘పోకిరి’ ఇప్పటికీ టీవీల్లో వస్తే జనాలు బుల్లితెరకు అతుక్కుపోయి చూడటం విశేషం.  


Read Also: టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌‌తో దుమ్మురేపిన విశాల్, అంచనాలు పెంచేస్తోన్న ‘మార్క్‌ ఆంథోని‘ టీజర్