IPL 2023, Ravichandran Ashwin:
సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravi chandran Ashwin) అరుదైన రికార్డు సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగులో 20 సార్లు బ్యాటర్లను డకౌట్ చేశాడు. సరికొత్త చరిత్ర లిఖించాడు. ఐపీఎల్‌లో ఇలాంటి ఘనత ఇప్పటి వరకు ఇంకెవ్వరికీ లేదు. ఈ రికార్డును బ్రేక్ చేయడమూ అంత సలుభం కాదు!
ఐపీఎల్ 2023లో గురువారం రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. 202 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌ను ఆడమ్ జంపా, రవిచంద్రన్ అశ్విన్ దెబ్బకొట్టారు. కీలకమైన వికెట్లు పడగొట్టారు. యాష్ 4 ఓవర్లలో 35 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.
ఈ సీజన్లో అజింక్య రహానె భీకరంగా ఆడుతున్న సంగతి తెలిసిందే. 150+ స్ట్రైక్‌రేట్‌తో రన్స్ చేస్తున్నాడు. అతడిని 10.2వ బంతికి యాష్ ఔట్ చేశాడు. డ్రిఫ్ట్ అయిన బంతిని ముందుకొచ్చి ఆడిన రహానె లాంగాన్‌లో బట్లర్ చేతికి చిక్కాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అంబటి రాయుడిని అశ్విన్ డకౌట్ చేశాడు. రాయుడు బంతిని స్లాగ్‌స్వీప్ చేయగా.. డీప్ మిడ్‌వికెట్లో దాన్ని హోల్డర్ అందుకున్నాడు.
ఐపీఎల్ 2023లో రవిచంద్రన్ అశ్విన్ దూకుడు మీదున్నాడు. అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. 8 మ్యాచుల్లో 7.28 ఎకానమీ, 21.18 సగటుతో 11 వికెట్లు పడగొట్టాడు. 17.25 బంతులకు ఒక వికెట్ చొప్పున తీశాడు. 32 ఓవర్లు విసిరి 233 పరుగులు ఇచ్చాడు. అతడిలాగే రెచ్చిపోతే పర్పుల్ క్యాప్ అందుకోవడం కష్టమేమీ కాదు.
ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్తాన్ రాయల్స్ 32 పరుగులతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ (RR) 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. దీంతో రాజస్తాన్ రాయల్స్‌కు విజయం దక్కింది. ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఇది వరుసగా రెండో ఓటమి.
రాజస్తాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్‌లో యశస్వి జైస్వాల్ (77: 43 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే రెండు వికెట్లు తీసుకున్నాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లలో శివం దూబే (52: 33 బంతుల్లో, రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) అర్థ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రాజస్తాన్ బౌలర్లలో ఆడం జంపా మూడు వికెట్లు పడగొట్టాడు.