India Squad For WTC Final 2023: ఈ ఏడాది జూన్ 7 నుంచి 11 వరకు ఇంగ్లాండ్ లోని ‘ది ఓవల్’ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ కోసం ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ ఇటీవలే భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ సారథ్యంలోని ఈ జట్టులో ఇద్దరు తప్ప అందరూ ఇటీవలే ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో ఆడినవాళ్లే. ఆ ఇద్దరిలో ఒకరు పేస్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ మరొకరు వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానే. ఇంగ్లాండ్ లో ఫాస్ట్ ఫిచ్ లకు అనుకూలంగా ఉండేందుకు శార్దూల్‌ను జట్టులోకి తీసుకోవడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. కానీ రహానే ఎంపికే అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. కానీ రహానే ఎంపిక వెనుక ‘మాస్టర్ మైండ్’ హస్తముందట.
అవును..! రహానేను తిరిగి భారత జట్టులోకి తీసుకునేందుకు గాను బీసీసీఐ.. టీమిండియా మాజీ సారథి, ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సూచనలు తీసుకుందట. ఈ విషయాన్ని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఓ కథనంలో పేర్కొంది. ఐపీఎల్ - 16లో రహానే చెన్నై తరఫున మెరుపులు మెరిపిస్తున్నాడు. గత రంజీ సీజన్ (2022-2023)లోరహానే.. ముంబై తరఫున ఏడు మ్యాచ్ లు ఆడాడు. ఈ క్రమంలో11 ఇన్నింగ్స్ లో 634 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలూ ఉన్నాయి. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో 6 ఇన్నింగ్స్ లలో 224 రన్స్ చేశాడు. ఇందులో 2 అర్థ సెంచరీలున్నాయి. స్ట్రైక్ రేట్ కూడా 189.83గా ఉండటం గమనార్హం.
స్వయంగా హెడ్‌కోచ్ నుంచే..
ఐపీఎల్ లో ఆటతో రహానేను టీమిండియాలోకి తీసుకురావాలని ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. అదీగాక జాతీయ జట్టు నుంచి తప్పుకున్నాక రహానే దేశవాళీలో కూడా మెరుగైన ప్రదర్శనలు చేశాడు. ఇక ఐపీఎల్ లో బెన్ స్టోక్స్ కు గాయమవడం రహానేకు కలిసొచ్చింది. రమానే పాత ఫామ్‌ను అందుకున్నట్టేనని బీసీసీఐ కూడా భావించింది. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ టీమ్ సెలక్షన్‌కు ముందు స్వయంగా టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్.. ధోనికి ఫోన్ చేసి రహానే ఎంపిక గురించి ఇన్‌పుట్స్ తీసుకున్నట్టు బీసీసీఐ అధికారి ఒకరు ‘ఇన్‌సైడ్ స్పోర్ట్స్’తో మాట్లాడుతూ చెప్పారు.
‘శ్రేయాస్ అయ్యర్‌కు గాయం కావడంతో మా ప్లాన్స్‌లో రహానే ఉన్నాడు. అతడికి ఇంగ్లాండ్‌లో ఆడిన అనుభవం కూడా ఉంది. అయితే అతడు ఏడాదిన్నరగా టీమ్‌లో లేడన్న విషయం మాకు తెలుసు. కానీ మేం అతడి రంజీ ప్రదర్శనలు కూడా పరిశీలించాం. అంతేగాక రాహుల్ ద్రావిడ్ కూడా ఈ విషయంలో ధోని నుంచి ఇన్‌పుట్స్ తీసుకున్నాడు’అని వివరించాడు.
వాస్తవానికి శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ గనక అందుబాటులో ఉండుంటే రహానేకు చోటు దక్కడం అనుమానంగానే ఉండేది. కానీ గాయాల కారణంగా వాళ్లు మంచం పట్టారు. దేశవాళీలో రహానే కంటే ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, పూణె కుర్రాడు రుతురాజ్ గైక్వాడ్ మెరుగ్గా ఆడినా రహానేకు ఇంగ్లాండ్ లో ఆడిన అనుభవం పుష్కలంగా ఉంది. అంతేగాక పుజారాతో రహానేకు మంచి సమన్వయం ఉంటుంది. ఈ ఇద్దరూ మిడిలార్డర్ లో కీలకం అవుతారని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. మరి రహానే ఐపీఎల్ మెరుపులను ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ లో కొనసాగిస్తాడా...? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న..!
డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఎంపిక చేసిన భారత జట్టు : రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానె, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్