ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2023 ఎడిషన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మిడిలార్డర్ బ్యాటర్ అంబటి రాయుడు ఆటతీరు నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఈ సీజన్‌లో రాయుడు 8 మ్యాచ్ లలో 83 పరుగులే చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగుతున్న రాయుడు.. దారుణ వైఫల్యాలతో విమర్శల పాలవుతున్నాడు. గురువారం రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో రెండు బంతులే ఆడి డకౌట్ అయ్యాడు. దీంతో అతడిపై భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగుతున్న అతడు ఫీల్డింగ్ చేయకున్నా కనీసం బ్యాటింగ్‌లో అయినా రాణించాలి కదా అని ఫైర్ అయ్యాడు.
రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్ లో రాయుడు తాను ఆడిన రెండో బాల్‌కే భారీ షాట్ ఆడి ఔట్ అయిన తర్వత గవాస్కర్ మాట్లాడుతూ.. ‘నువ్వు (రాయుడును ఉద్దేశిస్తూ) ఫీల్డింగ్ చేయాలి. అంతేగాక క్రీజులోకి రాగానే హిట్టింగ్ దిగడం కూడా మంచిది కాదు. అలా చేయకూడదు. ఇదే రకమైన ఆట మనం ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనింగ్ బ్యాటర్ పృథ్వీ షా లో కూడా చూస్తున్నాం. ఇంపాక్ట్ ప్లేయర్లుగా వస్తున్న వీళ్లు ఫీల్డింగ్ చేయరు. పోనీ బ్యాట్ తో రాణిస్తున్నారా..? అంటే అదీ లేదు. రాయుడు రెండో బాల్‌కు డకౌట్ అయ్యాడు..’ అని కామెంట్రీ బాక్స్‌లో వ్యాఖ్యానించాడు. ఈ సీజన్ లో 8 ఇన్నింగ్స్ ఆడిన రాయుడు స్కోర్లు ఇవి.. 0, 0, 9, 14, 1, 20, 27, 12.
ఈ ఏడాది కొత్తగా వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌తో చాలా జట్లు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంటే ఒక బౌలర్‌ను ఆడించి అతడి స్థానంలో బ్యాటర్‌ను తీసుకుంటున్నాయి. అలా కాకుండా మొదలు బ్యాటింగ్ చేస్తే బ్యాటర్ స్థానంలో ఓ బౌలర్ ను తీసుకుంటున్నాయి. ఎటొచ్చీ ఇంపాక్ట్ ప్లేయర్ లు ఆడేది మ్యాచ్ లో ఒక ఇన్నింగ్సే. ఇంకా గట్టిగా చెప్పాలంటే బౌలర్ అయితే బాగా బౌలింగ్ వేస్తే 4 ఓవర్లు. బ్యాటర్ నిలకడగా ఆడితే ఓ ఇన్నింగ్స్. లేకుంటే పృథ్వీ షా, రాయుడులా ఔట్ అయితే రెండు మూడు బంతులే. ఇదే నిబంధనను గవాస్కర్ ప్రశ్నించాడు. ఫీల్డింగ్ ఒత్తడి లేదు. నాలుగు గంటలు ఫీల్డ్ లో ఉండే ఛాన్స్ కూడా లేదు. హాయిగా బ్యాటింగ్ చేసుకోవడం కూడా వీళ్లకు చేతకావడం లేదని సన్నీ ఫైర్ అయ్యాడు.
రాజస్తాన్ పై ప్రశంసలు..
ఇక రాజస్తాన్ - చెన్నై మధ్య జరిగిన మ్యాచ్ లో రాణించిన యశస్వి జైస్వాల్ (73), ధ్రువ్ జురెల్ (34), పడిక్కల్ (27) లపై గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు. ‘ఇది విన్నింగ్ టీమ్. జైస్వాల్, పడిక్కల్, జురెల్ లు ఆడిన తీరు ఆకట్టుకుంది. వాళ్ల మైండ్ సెట్ అటాక్, అటాక్, అటాక్ అన్నట్టుగా ఉంది. డ్రెస్సింగ్ రూమ్ లో కూడా ఇదే ఎనర్జీ ఉంది. ఇందుకు గాను ఆ టీమ్ మేనేజ్మెంట్, సపోర్ట్ స్టాఫ్ ను మెచ్చుకుని తీరాలి. కుర్రాళ్ల విజయం వెనుక వారి కృషి ఎంతో ఉంది’అని చెప్పాడు.