Sleep Personality: ఈ బిజీ లైఫ్‌లో ‘నిద్ర’ అనేది ఒక కల. కంటి నిండా నిద్రపోవడమనేది నెరవేరని ఆశ. ఒక వేళ ఆ ఛాన్సు దొరికినా సోషల్ మీడియా.. ఓటీటీలు నిద్రపోనివ్వవు. లేదా ఒత్తిడి, టెన్షన్స్.. బుర్రను తొలిచేస్తూ నిద్రకు భంగం కలిగిస్తుంటాయి. ఇలా ఒకటేమిటీ ఎన్నో కారణాలు నిద్రను దూరం చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో పరిశోధకులు.. ‘నిద్ర’ను నాలుగు స్లీప్ పర్శనాలిటీలుగా విభజించారు. 1. గుడ్ స్లీపర్స్ (బాగా నిద్రపోయేవారు), 2. వీకెండ్ క్యాచప్ స్లీపర్స్ (వారాంతంలో బాగా నిద్రపోయేవారు), 3. ఇన్సోమియా స్లీపర్స్ (నిద్రలేమితో బాధపడేవారు), 4. నాపర్స్ (పగటి వేళ్లలో అతిగా కునుకు తీసేవారు). 


మీది ఏ కేటగిరి?


మనలో చాలామంది 3, 4 కేటగిరిల్లోకి వస్తాం. అయితే, ఇవి రెండు ఆరోగ్యకరమైనవి కాదని పరిశోధకులు చెబుతున్నారు. ఇన్సోమియా స్లీపర్స్ కేటగిరిలో ఉండే వ్యక్తులు పదేళ్ల తర్వాత గుండె సంబంధిత సమస్యలకు గురవ్వుతారని హెచ్చరిస్తున్నారు. డయాబెటిస్, డిప్రెషన్, బలహీనత వంటి దీర్ఘకాలిక వ్యాధులకు గురవ్వుతారని తెలుపుతున్నారు. నాపర్స్ కేటగిరికి చెందినవారు కూడా ప్రమాదంలో ఉన్నట్లు పేర్కొన్నారు. నిద్రకు తగిన ప్రాధాన్యమిచ్చే 1, 2 కేటగిరి వ్యక్తులు దీర్ఘకాలిక వ్యాధులకు గురయ్యే అవకాశాలు చాలా తక్కువని వివరించారు. 


ఈ అధ్యయనాన్ని రచించిన ది పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీలో హ్యూమన్ డెవలప్‌మెంట్ అండ్ ఫ్యామిలీ స్టడీస్ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ సూమి లీ మాట్లాడుతూ.. ‘‘మా పరిశోధనల్లో విభజించిన నాలుగు కేటగిరిల్లో.. ఇన్సోమియా స్లీపర్ కేటగిరికి చెందిన వ్యక్తులు దీర్ఘకాలిక వ్యాధులకు గురయ్యే ప్రమాదాలు ఉన్నట్లు తెలిసింది’’ అని తెలిపారు. 


గుడ్ స్లీపర్స్ అంటే?


రోజుకు ఏడు నుంచి తొమ్మిది గంటలు నిద్రపోయేవారిని గుడ్ స్లీపర్స్ అంటారు. ఇలా నిద్రపోయేవారు రోజువారి పనుల్లో సరిగ్గా దృష్టి పెట్టగలుగుతారు. ఇక వీకెండ్ క్యాప్ అప్ స్లీపర్ కేటగిరికి చెందినవారు.. తక్కువ వ్యధిలో నిద్రపోతారు. అయితే, ఆ నిద్రను వారాంతపు సెలవుల్లో భర్తీ చేస్తారు. ఎక్కువ సమయం నిద్రపోతారు. అయితే, మిగతా రోజుల్లో ఎక్కువ నిద్రలేకపోయినా సమస్యే. అయితే, వారాంతంలో నిద్రపోవడం వల్ల కాస్త వారికి రిలీఫ్ దొరుకుతుంది. వెంటనే వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉండదు.  


వీళ్లకు నరయాతనే: 


ఇన్సోమియా స్లీపర్స్ కేటగిరికి చెందిన వ్యక్తులు భవిష్యత్తులో ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నిద్రలేమి వల్ల వీరు రాత్రంతా నిద్రపోలేరు. ఫలితంగా పగటిపూట అలసటకు గురవ్వుతారు. ఏ పని చేయలేకపోతారు. ఇక నాపర్స్ కేటగిరికి చెందినవారు చాలా భిన్నంగా నిద్రపోతారు. పగటి వేళ్లల్లో అతిగా కునుకు తీస్తూ.. మత్తు మత్తుగా ఉంటారు. పగటి నిద్రవల్ల వీరికి రాత్రి నిద్ర రాదు. దీంతో పాపం.. నిద్రపోవడానికి చాలా శ్రమిస్తారు.


మంచి నిద్ర కోసం ఇలా చెయ్యండి


⦿ సుఖమైన నిద్ర కోసం స్లీప్ హైజీన్ పాటించటం తప్పనిసరి. అంటే, నిద్రకు రెండు గంటల ముందు, ఫోన్లు పక్కన పెట్టేయటం, టీవీలు ఎలాంటి గాడ్జెట్లు వాడకుండా ఉండటం తప్పనిసరి.
⦿ ఇలాంటివి చిన్న చిన్న పనులే కానీ ఇవి నిద్ర మీద ప్రభావం చూపుతాయి. మీరు నిద్రపోయే గది పూర్తిగా డార్క్ గా ఉండేలా చూసుకోవాలి. కళ్లకు మాస్క్ ధరిస్తే మంచిది. 
⦿ రాత్రి తొందరగా భోజనం ముగించాలి. కడుపు నిండుగా ఉన్నపుడు నిద్ర రాదు.
⦿ రోజూ ఒకే సమయానికి నిద్రపోవాలి. దీని వల్ల మీ శరీరం ఒక స్లీప్ సైకిల్ కు అలవాటు పడుతుంది.
⦿ రాత్రిళ్లు ఫోన్ చూడద్దు. దానికి బదులు పుస్తకం చదవండి. చక్కగా నిద్రపడుతుంది.
⦿ ప్రాణాయామం కూడా మంచి నిద్రకు సహాయపడుతుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.