వేసవి కాలం వచ్చిందంటే ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. దానికి తోడు చెమట కారుతూనే ఉంటుంది. చెమట వల్ల శరీరం నుంచి దుర్వాసన వస్తుంది. ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే పదే పదే స్నానం చేయాల్సి వస్తోంది. లేదా పెర్‌ఫ్యూమ్‌తో కంపును దూరం చేసుకొనే ప్రయత్నం చేయాలి. కానీ, ఇది అన్నివేళలా సాధ్యం కాదు. అతిగా స్నానం చేసినా శరీరానికి మంచిది కాదు. అలాగే మితిమీరిన పెర్‌ఫ్యూమ్ అలర్జీలను కలిగించే ప్రమాదం ఉంది. మరి, శరీరం నుంచి దుర్వాసన రావడానికి కారణం ఏమిటీ? చెమట వల్లే చెడు వాసన వస్తుందా? దీనికి పరిష్కారం ఏమిటీ? 


శరీరం నుంచి దుర్వాసన అనేది బ్యాక్టీరియా వల్ల ఏర్పడుతుంది. కొంతమందికి చెమట పట్టినా పట్టకపోయినా శరీరం వాసన వస్తుంది. ముఖ్యంగా శరీరంలో మూలల్లో పెరిగే బ్యాక్టీరియా వల్ల ఈ దుర్వాసన వస్తుంది. చెడు శ్వాసకు కూడా బ్యాక్టీరియా కారణం అవుతుంది. చెమటకు బ్యాక్టీరియా తోడైతే దుర్వాసన మరింత పెరుగుతుంది. అలాగే పాదాల్లో ఏర్పడే ఫంగస్ లేదా బ్యాక్టీరియా కూడా వాసనకు కారణమవుతుంది.


ఏం చేస్తే బెటర్?: 
☀ యాంటీపెర్స్పిరెంట్స్ ఉపయోగించడం వల్ల చెమట పట్టకుండా ఉంటుంది. ఇవి తరచుగా సువాసనతోపాటు దుర్వాసన కూడా దూరం చేస్తాయి. మిమ్మల్ని మరింత తాజాగా, దుర్వాసన లేకుండా ఉంచుతాయి.
☀ నిర్జలీకరణం(డీ-హైడ్రేషన్) కూడా శరీర దుర్వాసనను కలిగిస్తుంది. కాబట్టి రోజంతా తగినంత నీరు తాగండి.
☀ నీరు ఎక్కువ తాగడం వల్ల చెమట కూడా స్వచ్ఛంగా ఉంటుంది. బ్యాక్టీరియా తయారవ్వడానికి సమయం తీసుకుంటుంది. 
☀ మనం తీసుకొనే ఆహారం కూడా శ్వాస, చెమట వాసనకు కారణమవుతాయి. 
☀ రోజుకు ఒక్కసారైనా తలస్నానం చేయడం వల్ల చర్మంపై ఉన్న చెమట, బ్యాక్టీరియా పోతుంది.
☀ చెమటకు వాసన లేనప్పటికీ, చర్మంపై నివసించే బ్యాక్టీరియా దానితో కలిసిపోవడం వల్ల దుర్వాసన వస్తుంది. కాబట్టి, యాంటీ బాక్టీరియల్ సబ్బును ఉపయోగించడం మంచిది.


Also Read: నిద్రలో చెమట పట్టడం ఆ వ్యాధులకు సంకేతం? డాక్టర్‌ను సంప్రదించాల్సిందే!


శరీర దుర్వాసనకు ఈ ఆహారం కూడా కారణం: శరీర దుర్వాసన అధికంగా వచ్చే అవకాశం టీనేజీ నుంచి యుక్తవయసులో ఉన్న వారికి వరకు అధికం. అలాగే మధుమేహం వంటి రోగాలు ఉన్న వారిలోనూ ఎక్కువే. వీరు బయటికి వెళ్లే పనులు ఉన్నప్పుడు సాత్వికాహారం తీసుకోవాలి. కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. 
☀ బిర్యానీలు, పులావులు, చికెన్, మటన్,  చేపల కూరల్లో మసాలా దట్టించి వండుతారు. ఇలాంటివి తినడం వల్ల నోరు కూడా వాసన వస్తుంది. ఆ మసాలా వాసనలు మన శ్వానలో, చర్మం మీద గంటల కొద్దీ ఉంటాయి. శరీరం నుంచి మరింతగా దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. 
☀ ఉల్లిపాయలు, వెల్లుల్లి పాయలు లేని ఆహారాన్ని ఊహించలేం. అయినా ఎర్రటి ఎండల్లో మాత్రం ఆఫీసులకు వెళ్లేప్పుడు ఇది అధికంగా వేసిన ఆహారాన్ని తినకూడదు. తక్కువ మొత్తంలోనే తినాలి. వెజ్ వంటకాలలో ఉల్లి, వెల్లుల్లిన చాలా తక్కువ మోతాదులో వేస్తారు. నాన్ వెజ్ లో మాత్రం వీటిని అధిక మోతాదులో వేస్తారు. కాబట్టి తక్కువగా తినడం మంచిది. ఈ వెల్లుల్లి, ఉల్లి వాసన చర్మం మీద ఉన్న బ్యాక్టిరియాతో కలిసి చెడు వాసన వచ్చేలా చేస్తుంది. శరీర ఉష్ణోగ్రతలను కూడా పెంచేస్తాయి. 
☀ మాంసాహారాన్ని అధికంగా తినేవారిలో కూడా శరీర దుర్వాసన వస్తుంది. మాంసాహార ప్రొటీన్లు శ్వాస ద్వారా బయటికి వచ్చి చర్మం మీద ఉన్న బ్యాక్టిరియాతో కలిపి చెడు వాసన వచ్చేలా చేస్తాయి. 
☀ వెజిటేరియన్ వంటల్లో కాలీ ఫ్లవర్, క్యాబేజీల తినడం వల్ల కూడా శరీర దుర్వాసన పెరుగుతుంది.చెమట, గ్యాస్ సమస్యలు ఎక్కువవుతాయి. వాసన కూడా భరించరానిదిగా ఉంటుంది. 


Also Read: చాక్లెట్లు తింటే చిన్న వయస్సులోనే చనిపోతారా? తాజా అధ్యయనంలో ఏం తేలింది?