ప్రాసెస్ చేసిన ఆహారాలు, కొవ్వులు గుండెకి హాని చేసే పదార్థాల జాబితాలో ముందుంటాయి. ఇవి మాత్రమే కాదు చక్కెర, ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వుల అధిక వినియోగం కూడా హృదయ సంబంధ వ్యాధుల పెరుగుదలని ప్రేరేపిస్తాయి. వీటిని మితంగా తీసుకునే ఆరోగ్యమే అమితంగా తీసుకుంటే మాత్రం భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాలి. ఆరోగ్యకరమైన గుండెకి సమతుల్య ఆహారం, విటమిన్లు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు సమపాళ్ళలో అందించాలి. అప్పుడే ఎక్కువ కాలం జీవించగలుగుతారు.


చక్కెర ప్రభావం..


పంచదార ఒకప్పుడు అరుదుగా ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు ఇది ప్రతిరోజూ ఏదో ఒక విధంగా తీసుకుంటూనే ఉంటుంది. అధిక చక్కెర వినియోగం బరువును పెంచుతుంది. ఇన్సులిన్ ని నిరోధిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెంచేస్తాయి. ధమనులను ఒత్తిడిలోకి నెట్టేస్తాయి. రక్తపోటు, అథెరోస్క్లెరోసిస్‌కు ప్రమాదాన్ని పెంచుతాయి. గుండె వైఫల్యానికి దారి తీస్తాయి.


ఉప్పుతో కష్టమే


కూరలో అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అంటుందట ఉప్పు. ఎంత బాగా కూర చేసిన అందులో సరిపడా ఉప్పు ఉంటేనే దానికి అద్భుతమైన రుచి వస్తుంది. అందుకే ఆ మాట అంటారని నానుడి. కానీ ఉప్పు అధిక వినియోగం అన్నీ విధాలుగా చేటు చేస్తుంది. ఇది ముఖ్యమైన పోషకమే అయినప్పటికీ మితంగా మాత్రమే తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన, రెస్టారెంట్ ఆహారాల్లో అధిక ఉప్పు ఉంటుంది. దీని వల్ల రక్తపోటు పెరిగిపోతుంది. అధిక సోడియం శరీరంలో నీటి నిలుపుదలకి కారణమవుతుంది. గుండెపై భారం పడి రక్తనాళాలు ఒత్తిడికి గురవుతాయి. ధమనుల మీద భరించలేని ఒత్తిడి కారణంగా గుండెపోటు, స్ట్రోక్, హృదయ సంబంధిత సమస్యలు ఎదురవుతాయి.


అన్ని కొవ్వులు చెడ్డవేనా?


ఫాస్ట్ ఫుడ్, వేయించిన వస్తువు, అధికంగా ప్రాసెస్ చేసే పదార్థాలతో అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా కనిపిస్తాయి. సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్ కొవ్వులు ధమనుల్లో ఫలకాలు ఏర్పడేలా చేస్తాయి. అథెరోస్క్లెరోసిస్‌కు దారి తీస్తుంది. ధమనుల్లో ఫలకాలు ఏర్పడటం వల్ల రక్తప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. గుండె పోటు సంభవిస్తుంది. ఈ కొవ్వులు శరీరంలో మంటని కలిగిస్తాయి. అన్ని కొవ్వులు గుండెకి హాని చేసేవి కావు. సంతృప్త కొవ్వులు ఆరోగ్యానికి హాని చేస్తాయి. 


గుండె పోటు, కార్డియో వాస్కులర్ డీసీజ్ ప్రమాదాలని తగ్గించుకోవాలంటే పోషకాలు నిండిన ఆహారం తీసుకోవాలి. సీ ఫుడ్, చిక్కుళ్ళు, పండ్లు, కూరగాయలు తినాలి. అధిక నూనెతో ఉండే పదార్థాలు, జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. శుద్ది చేయని తృణధాన్యాలు, ప్రాసెస్ చేయని మాంసాలు తీసుకోవాలి. గుండెకు ప్రోటీన్లు నిండిన ఆహారం అవసరం. చిక్కుళ్ళు, బఠానీలు, చేపలు, బాదం, పిస్తా వంటివి అధికంగా తినేలా చూసుకోవాలి. అధిక బరువు శరీరంలోని మొదట ప్రభావం చూపేది గుండెపైనే. కాబట్టి బరువు పెరగకుండా ముందు నుంచే జాగ్రత్త పడడం చాలా ముఖ్యం.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: ఈ కూరగాయలను ఎప్పుడూ పచ్చిగా తినకండి, చాలా డేంజర్