కడుపునొప్పి రావడం అనేది సర్వసాధారణ విషయం. కానీ దాన్ని భరించడం మాత్రం చాలా కష్టం. కడుపునొప్పి రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అతిగా తినడం వల్ల కూడా కడుపునొప్పి వస్తుంది. అలాగే కొన్ని రకాల ఇన్ఫెక్షన్,లు బ్యాక్టీరియా వల్ల, కలుషితమైన నీటిని తాగడం వల్ల, ఫుడ్ పాయిజన్ వల్ల, అజీర్తి వల్ల కూడా పొట్టనొప్పి వచ్చే అవకాశం ఉంది. అలాంటి సమయంలో వైద్యుల వద్దకు పరిగెట్టడం కన్నా ముందు ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించండి.


కడుపునొప్పి వేధిస్తున్నప్పుడు లెమన్ టీ చేసుకుని తాగితే ఉపశమనం కలుగుతుంది. దీనికోసం స్టవ్ మీద గిన్నె పెట్టి, గిన్నెలో మూడు కప్పుల నీటిని వేడి చేయాలి. అందులో నాలుగు తులసి ఆకులు, మూడు నిమ్మకాయ ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ వాము వేసి మరిగించాలి. బాగా మరిగాక వడకట్టి గ్లాసులో అన్నింటిని వేయాలి. అది గోరువెచ్చగా అయ్యాక తాగితే కడుపునొప్పి తగ్గే అవకాశం ఉంది. అలాగే అల్లం టీ తాగడం వల్ల కూడా పొట్టనొప్పి తగ్గే అవకాశం ఉంది. అల్లం తరుగును రెండు కప్పుల నీటిలో వేసి బాగా మరిగించాలి. అది గోరువెచ్చగా అయ్యాక కొంచెం తేనెను కలిపి తాగాలి. ఇలా చేస్తే ఉబ్బరం, అజీర్తి, తల తిరగడం వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. 


పెరుగు కూడా పొట్ట ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో ముందుంటుంది. కాబట్టి కప్పు పెరుగును తిని చూడండి. పెరుగులో ఒక స్పూన్ జీలకర్ర పొడి, చిటికెడు నల్ల ఉప్పు వేసి కలిపి తీసుకున్నా కూడా పొట్టనొప్పిని తగ్గిస్తుంది. సోంపు గింజలతో టీ చేసుకుని తాగినా మంచి ఫలితం ఉంటుంది. ఈ గింజల్లో యాంటీ ఫంగల్ లక్షణాలు, యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడి నొప్పిని తగ్గిస్తాయి. మలబద్ధకం వల్ల కూడా పొట్ట నొప్పి వచ్చే అవకాశం ఉంది. సోంపు గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి దీన్ని తినడం వల్ల మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది.


ఒక కప్పు నీటిలో ఐదు తులసి ఆకులు, ఒక స్పూను సోంపు గింజలు వేసి బాగా మరిగించి నీటిని వడకట్టాలి. ఇవి గోరువెచ్చగా అయ్యాక తాగితే పొట్టనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇన్ని పాటించిన కూడా ఆ పొట్టనొప్పి తగ్గకపోతే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.



Also read: 2050 నాటికి ప్రపంచంలో 80 కోట్ల మందికి నడుమునొప్పి వచ్చే అవకాశం - చెబుతున్న లాన్సెట్ నివేదిక




Also read: ఆ వీరుడి కొడుకు పేరునే సాంబార్‌కు పెట్టారు, ఈ వంటకం వెనుక ఆసక్తికరమైన కథ ఇది









































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.