దక్షిణ భారతీయ వంటకాలలో సాంబార్ స్థానం ప్రధానమైనది. ఈ రుచికరమైన వంటకం కోసం దక్షిణ భారతదేశానికి వచ్చేవారు ఎంతోమంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా సాంబార్‌కు అభిమానులు ఎక్కువ. ఈ సాంబార్ వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. సాంబార్ అనే పేరు దానికి ఎలా వచ్చిందో? ఎవరి పేరును దానికి పెట్టారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఛత్రపతి శివాజీ కొడుకు అయినా శంభాజీ పేరునే సాంబార్‌కు పెట్టారని చరిత్రకారులు చెబుతారు.


అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం తంజావూరులో మరాఠా పాలన సాగుతున్న కాలం అది. తంజావూరు మహారాజైన ఏకోజి కుమారుడైన షాహాజీ1 తన వంటగదిలో సాంబార్ను మొదటిగా సృష్టించాడని అంటారు. శివాజీ పెద్ద కొడుకు అయినా శంబాజీ తంజావూరును సందర్శించేందుకు వస్తున్నట్లు కబురు పంపాడు. అతని కోసం ఈ కొత్త వంటకాన్ని షాహాజీ దగ్గరుండి  మరీ వండించాడని చెబుతారు. అతనే స్వయంగా దీన్ని కనిపెట్టినట్లు కూడా కథనాలు ఉన్నాయి. గౌరవనీయమైన అతిధికి గౌరవప్రదంగా ఈ సాంబార్‌ను వడ్డించారని అంటారు. శంభాజీని ముద్దుగా అందరూ సాంబా అని పిలుచుకుంటారు. అతని గౌరవార్థం వండిన ఈ వంటకానికి అతని పేరునే పెట్టినట్టు చెబుతారు. అలా సాంబార్ అనే పదం పుట్టుకొచ్చింది.  


మరొక కథనం ప్రకారం షాహాజీ గొప్ప వంటగాడు. శివాజీ కొడుకు శంభాజీ తంజావూరు వస్తున్నట్టు తెలిసి తానే అతని కోసం వండేందుకు సిద్ధమయ్యాడు. అతను సాంప్రదాయబద్ధమైన పప్పును వండుతున్నప్పుడు అనుకోకుండా చింతపండును అందులో వేశాడు.  అలాగే కొన్ని కూరగాయలను కూడా వేశాడు. అలా చిక్కని ద్రావకాన్ని వండాడు. ఆ ద్రావకాన్ని శివాజీ కుమారుడైన శంభాజీకి వడ్డించాడు. శంభాజీ ఆ వంటకాన్ని తిని ఎంతో పొగడాడని అంటారు. దాంతో షాహాజీ అతని పేరునే ఆ వంటకానికి పెట్టాడని అంటారు. అలా రుచికరమైన వంటకం సాంబార్ మనందరకి కోసం పుట్టుకొచ్చింది. 


మరొక కథనం ప్రకారం సంస్కృతపదమైన సంభారము నుంచి సాంబార్ అనే పదం పుట్టిందని అంటారు. సంభారము అంటే ఉప్పు, చింతపండు వేసి వండిక కూర అని అర్థం. సంభారము అనే పదమే రూపాంతరం చెంది వాడుక భాషలో సాంబార్ గా మారిందని అంటారు. 


సాంబార్లో పోషక విలువలు కూడా ఎక్కువే ఉంటాయి. సాంబారులో చింతపండు, పప్పుతో పాటూ బెండకాయలు, ఆనపకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ, ములక్కాల... ఇలా అనేక కూరగాయల ముక్కలు కలుపుతారు. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వారానికి ఒకసారి కచ్చితంగా సాంబారు తినాల్సిందే. రోజూ తినేవారు కూడా ఉన్నారు. 



Also read: అర నిమిషంలో ఆ బిడ్డ తండ్రి ఎవరో కనిపెట్టండి, అలా చేస్తే మీ మెదడు పనితీరు సూపర్







































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.