Tasty Bhindi Gravy Curry Recipe : మీకు బెండకాయలు తినడం నచ్చదా? అయితే మీరు ఈ కర్రీ కచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఎందుకంటే ఈ బెండకాయ గ్రేవీ కర్రీ తిన్నాక.. దానిని టేస్ట్​ని అస్సలు మరిచిపోలేరు. పైగా బెండకాయతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజాలు కూడా ఉన్నాయి. అందుకే దీనిని డైట్​లో చేర్చుకోవాలి అంటూ ఉంటారు నిపుణులు. ఈ గ్రేవీ కర్రీని కేవలం రైస్​లోకే కాకుండా.. రోటీలు తినేవారికి కూడా ఇది మంచి కాంబినేషన్ అవుతుంది. మరి ఈ టేస్టీ కర్రీని ఏ విధంగా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి? ఎలాంటి టిప్స్​తో కర్రీ టేస్ట్ పెంచవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు


బెండకాయలు - అరకిలో


ఉల్లిపాయలు - 2


అల్లం - అంగుళం


వెల్లుల్లి - 10 రెబ్బలు


ఇంగువ - చిటికెడు 


జీలకర్ర - 1 టీస్పూన్


నూనె - 4 టేబుల్ స్పూన్లు


ఉప్పు - రుచికి తగినంత 


పసుపు - 1 టీస్పూన్


పచ్చిమిర్చి - 3


పెరుగు - అర కప్పు


కారం - 1 టీస్పూన్


కొత్తిమీర - 1 చిన్న కట్ట


ధనియాల పొడి - 1 టీస్పూన్ 


తయారీ విధానం


ముందుగా బెండకాయలను బాగా కడిగి చిటికిన వేలంత పొడుగులో కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కోసి పక్కపెట్టుకోవాలి. పచ్చిమిర్చిని చిన్నగా.. గుండ్రంగా కోసుకోవాలి. అల్లం, వెల్లుల్లిని పేస్ట్​గా చేయకుండా చిన్నగా తురుముకోవాలి. పేస్ట్ చేస్తే వచ్చే గ్రేవీ టేస్ట్ కన్నా.. ముక్కలుగా మధ్యలో తగిలితేనే రుచి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అల్లం, వెల్లుల్లిని పైన పొట్టు తీసి.. చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీరను కూడా సన్నగా తురుముకోవాలి. 


ఇప్పుడు స్టౌవ్ పెట్టి.. దానిపై మందపాటి కడాయిని పెట్టుకోండి. దానిలో కాస్త నూనె వేసి.. బెండకాయలు వేసి ఫ్రై చేయాలి. కాస్త పసుపు, కాస్త ఉప్పు వేసి.. వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్​లో నూనె వేసి.. జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి. అనంతరం దానిలో ముందుగా తురిమి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చిని వేసి వేయించాలి. అవి వేగుతున్న సమయంలో అల్లం, వెల్లుల్లి తురుమును కూడా వేసి బాగా వేయించుకోవాలి. 


ఓ బౌల్​ తీసుకుని దానిలో పెరుగు లేదా యోగర్ట్ వేసి.. పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని.. కడాయిలో వేసి బాగా కలపాలి. ఉల్లిపాయల మిశ్రమం పెరుగులో ఉడికి.. నూనె పైకి తేలుతూ ఉంటుంది. ఆ సమయంలో వేయించుకున్న బెండకాయలు వేసి.. మరో రెండు నిమిషాలు మగ్గించాలి. చివరిగా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ బెండకాయ గ్రేవీ కర్రీ రెడీ. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. 



ఈ గ్రేవీ కర్రీని మీరు రోటీలు లేదా రైస్​లోకి కూడా తీసుకోవచ్చు. బెండకాయ తిననివారు కూడా ఇలా చేసి పెడితే హాయిగా లాగించేస్తారు. ఎందుకంటే జిగురు లేకుండా.. టేస్టీగా ఉండే బెండకాయను ఎవరు కాదంటారు చెప్పండి. పిల్లలకు కూడా ఈ తరహా కర్రీలు బాగా నచ్చుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం. మీరు కూడా టేస్టీ బెండకాయ కర్రీని ట్రై చేసేయండి.


Also Read : టేస్టీ, హెల్తీ గార్లిక్ రైస్.. లంచ్ బాక్స్​కోసం ఈ సింపుల్ రెసిపీని ఫాలో అయిపోండి