Diabetes Friendly Lunch Recipe : మధుమేహంతో ఇబ్బంది పడేవారికి ఏది తినాలన్నా కష్టమే. అది తినకూడదు.. ఇది తినకూడదంటూ.. ఇబ్బంది పడుతూ ఉంటారు. టేస్టీగా ఏదైనా తినాలన్నా కూడా ఆలోచిస్తూ ఉంటారు. అయితే మీరు టేస్టీగా, హెల్తీగా లంచ్ (Tasty And Healthy Recipe)కి ఏదైనా తినాలనుకుంటే మీరు ఓట్స్‌తో ఈ రెసిపీ ట్రై చేయవచ్చు. సాధారణంగా ఓట్స్, మిల్క్ కాంబినేషన్లో తీసుకుంటారు. అయితే ఈ రెసిపీని కూరగాయలతో తయారు చేసుకోవచ్చు. కాబట్టి దీనిని మీరు బ్రంచ్గా, లంచ్‌గా కూడా తీసుకోవచ్చు. ఇది షుగర్‌ని కంట్రోల్(Sugar Control) చేయడమే కాకుండా.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. మరి ఈ టేస్టీ, హెల్తీ రెసిపీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
ఓట్స్ - 1 కప్పు
ఉల్లిపాయ - 1 మీడియం
అల్లం - 1 చిన్న ముక్క
పచ్చిమిర్చి - 3
శనగపప్పు - 1 స్పూన్
ఆవాలు - 1 స్పూన్
జీలకర్ర - 1 స్పూన్
ఆలివ్ నూనె - 1టేబుల్ స్పూన్
ఉప్పు - తగినంత
క్యారెట్, గ్రీన్ బీన్స్, బఠాణీలు - మూడు కలిపి 2 కప్పులు
తయారీ విధానం
ముందుగా స్టవ్ వెలిగించి దానిపై పాన్ లేదా కడాయి పెట్టండి. దానిలో ఆలివ్ నూనె వేసి వేడి చేయండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి వేయించాలి. అది చిటపటలాడిన తర్వాత తరిగిన ఉల్లిపాయ వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. అనంతరం మిరపకాయలు, అల్లం వేసి వేయించాలి. ఇప్పుడు దానిలో నీరు పోసి మరిగించండి. నీరు మరుగుతున్నప్పుడు దానిలో ఉప్పు వేసి.. ఓట్స్ వేసి బాగా కలపాలి. ఉడికే వరకు దానిని మూత పెట్టి ఉడికించాలి. అంతే వేడి వేడి ఓట్స్ రెసిపీ రెడీ.
ఈ రెసిపీలో ఉపయోగించే ఓట్స్, కూరగాయలు మధుమేహం ఉన్నవారికి చాలా మంచిది. బరువు తగ్గేందుకు డైట్ (Weight Loss Diet) ఫాలో అయ్యేవారు కూడా దీనిని హాయిగా తీసుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారికి రక్తంలో హెచ్చు తగ్గులు నివారించడానికి ఆహారంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండాలి. ఈ కూరగాయలు శరీరంలో గ్లైసెమిక్ ఇండెక్స్‌ను తక్కువగా ఉంచుతాయి. ఓట్స్ మీరు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చూస్తుంది. ఇది మీరు చిరుతిళ్లకు దూరంగా ఉండేలా చేస్తుంది. తద్వారా మీరు బరువు తగ్గుతారు. అంతేకాకుండా రక్తంలో చక్కెర నిల్వలను సమతుల్యం చేస్తుంది. మనం తీసుకునే ఆహారంలో కూరగాయాలు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదని గుర్తించుకోండి. మధుమేహం ఉన్నవారు కచ్చితంగా వారి డైట్లో కూరగాయలు ఉండేలా చూసుకోవాలి.
Also Read : పరగడుపునే ఈ జ్యూస్ తాగితే చాలు.. అందానికి, ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.