Beetroot Juice Recipe : బీట్రూట్ ఆరోగ్యానికి మంచిదని చాలా మంది తమ డైట్లో తీసుకుంటారు. కొందరైతే దాని జోలికి కూడా వెళ్లరు. మీరు కూడా వారిలో ఒకరు అయితే మీరు కచ్చితంగా బీట్రూట్ జ్యూస్ ట్రై చేయండి. ఎందుకంటే మీరో ఓ కూరగాయనే తినట్లేదు అనుకుంటున్నారేమో.. కానీ దానివల్ల కలిగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల (Health Benefits)ను మీరు దూరం చేసుకుంటున్నారు. కేవలం ఆరోగ్యానికే కాదు.. అందంగా ఉండడంలో కూడా ఈ జ్యూస్ అద్భుతాలు చేస్తుంది. అయితే బీట్రూట్ రుచి కొందరికి నచ్చకపోవచ్చు. అలాంటి వారు జ్యూస్‌ను ఈ విధంగా టేస్టీగా చేసుకోవచ్చు. దీనివల్ల మీరు కూడా బీట్ రూట్ జ్యూస్ ప్రయోజనాలు పొందవచ్చు.
కావాల్సిన పదార్థాలు
బీట్రూట్ - 2 (తొక్కను తీసి.. ముక్కలుగా కట్ చేసుకోండి)
కొత్తిమీర - కొంచెం
నారింజ - 1
నిమ్మకాయ -1 స్పూన్
నీరు తగినంత
తయారీ విధానం
బీట్ రూట్, నారింజ రసం, నిమ్మరసం, కొత్తిమీర వేసి.. జ్యూసర్ లేదా గ్రైండర్లో కలపండి. ఇది పలుచగా ఉండాలనుకుంటే మీరు దానిలో నీటిని వేయొచ్చు. దీనిని ఫిల్టర్ చేసి తాగినా.. చేయకుండా తాగిన కూడా ఆరోగ్యానికి మంచిదే. అయితే బీట్రూట్ తీసుకోవడం ఇష్టం లేనివారికి.. నారింజ ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. అంతేకాకుండా దీనిలోని విటమిన్ సి.. మీ అందానికి, ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు ఇస్తుంది. ఉదయాన్నే నిమ్మరసం తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. దీనిలో వినియోగించే ప్రతీ పదార్థం కూడా మీకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది.
ముఖ్యంగా బీట్రూట్లో నైట్రేటు, విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమాల్లు దండిగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి. దీనిలోని నైట్రేట్లు.. నైట్రేట్ ఆక్సైడ్లుగా మారి రక్తప్రసరణ వేగాన్ని మెరుగుపరుస్తాయి. తద్వారా రక్తపోటు(Blood pressure)లో అదుపులోకి వస్తుంది. దీనిలోని విటమిన్ సి మధుమేహాన్ని(Diabetes) కూడా అదుపులో ఉంచుతుంది. బీట్ రూట్ జ్యూస్ తాగేవారిలో వృద్ధాప్యంలో కూడా మెదుడలో రక్తప్రసరణ వేగంగా ఉండి.. ఆలోచనల్లో వారు చురుకుగా ఉన్నట్లు పలు అధ్యయనాలు నిరూపించాయి.
బీట్రూట్ చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పెదువులు పొడిబారకుండా చేస్తుంది. కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. గర్భిణీలలో కణజాలం పెరుగుతుంది. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్ సమ్మేళనాలు క్యాన్సర్ ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని కాపాడుతాయి. బీట్రూట్లోని ఫైబర్ ఆకలిని తగ్గించి.. టాక్సిన్లను బయటకు పంపుతుంది. తద్వార బరువు తగ్గవచ్చు. ఇన్ని ప్రయోజనాలున్న జ్యూస్‌ను ప్రతిరోజూ.. పరగడుపునే తాగితే మంచి ఫలితాలు పొందవచ్చు.
Also Read : బరువు తగ్గాలనుకుంటే కొత్తిమీర రైస్ ట్రై చేయండి.. రెసిపీ ఇదే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.