Saree Cancer : చీరలోని గొప్పతనం తెలుసుకో.. ఈ చీరకట్టి ఆడతనం పెంచుకో అనే పాట వినే ఉంటారు. అయితే ఇప్పుడు టాపిక్ పాట గురించి కాదు. చీర గురించి. చీర కట్టుకుంటే ఆ అందమే వేరబ్బా. అయినా మోడ్రన్ డ్రెస్​ల కంటే చీరలే బెస్ట్. ఇలాంటి కామెంట్స్ కూడా రెగ్యులర్​గా వినే ఉంటారు. చీర కట్టుకుంటే వచ్చే అందం, నిండుదనమే వేరు. అయితే ఇలాంటి చీరను కట్టుకుంటే క్యాన్సర్ వస్తుందంటున్నారు నిపుణులు. అలా ఎందుకు అంటున్నారో.. చీరకు, క్యాన్సర్​కు ఉన్న సంబంధం ఏంటో.. చీరను కట్టుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. 


పెట్టికోట్ క్యాన్సర్ 


చీరను కట్టుకునేందుకు లోపల లంగా వేసుకుని దానిని కట్టుకుంటారు. చీర అందంగా రావాలంటే బంద్​ల సహాయంతో లంగాను టైట్​గా కట్టి.. దాని చుటూ చీరను అందంగా కట్టుకుంటారు. ఈ లంగాలను పెట్టీకోట్​లు అంటారు. అలా గట్టిగా కట్టుకున్నప్పుడు అరుదైన క్యాన్సర్ అదే పెట్టీకోట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇది అరుదైన పరిస్థితుల్లోనే వస్తుంది. 


కారణాలివే.. 


పెట్టికోట్ క్యాన్సర్ రావడానికి ప్రధానకారం లంగాను గట్టిగా కట్టుకోవడం. పెట్టీకోట్​ కట్టుకుంటే చీర జారదనే ఉద్దేశంతో చాలామంది టైట్​గా కడతారు. అలా కట్టినప్పుడు నడుము, పొట్టభాగం దగ్గర బ్లడ్​ ఫ్లో తగ్గిపోతుంది. అంతేకాకుండా ఆ ప్రాంతం చికాకు పెట్టి.. రక్తప్రసరణ పరిమితమవుతుంది. కాలక్రమేణా ఇది చర్మవ్యాధికి.. అనంతరం క్యాన్సర్​కు దారి తీస్తుంది. 


ఇది కేవలం ఆడవారికే కాదు.. మగవారికి కూడా వస్తుందట. అయితే ధోతిలు ఎక్కువగా కట్టుకునేవారిలో ఈ క్యాన్సర్ రావొచ్చు. పిట్టీకోట్ లేదా ధోతి బంద్​ను టైట్​ లాగికట్టినప్పుడు స్కిన్ బర్న్ అవ్వడం, కోసుకుపోవడం లాంటివి జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో అక్కడ పుండు ఏర్పడుతుంది. సరైన సమయంలో అలెర్ట్ కాకపోయినా.. పట్టించుకోకపోయినా.. దానిమీదే మళ్లీ కట్టుకున్న ఈ పుండు కాస్త మార్జోలిన్ అల్సర్​గా మారుతుంది. ఇది క్రమేణా పెట్టికోట్ క్యాన్సర్​కు దారి తీస్తుంది. బందు టైట్ అయినప్పుడు ముందు చర్మంపై మంట అనిపిస్తుంది. అది గాయంగా మారి.. అనంతరం క్యాన్సర్​ గాయంగా మారుతుంది. అయితే ఇది నయం కాకపోతే.. మార్జోలిన్స్ పుండును ఏర్పరిచి.. పెట్టీకోట్ క్యాన్సర్​గా మారుతుంది.


రిస్క్ వారికే ఎక్కువ.. 


ఇప్పుడంటే ఎక్కువమంది చీరలు కట్టుకోవట్లేదు కానీ.. వారి అమ్మలు మాత్రం రోజూ చీరకట్టుకునే ఉంటారు. అలాంటి అమ్మలు పెట్టీకోట్ బందును కాస్త వదులుగా కట్టుకోవాలి. అలాగే గట్టిగా ఎక్కువ సేపు కూడా ఉండకూడదట. రోజంతా చీరకట్టుకుని ఉండే బదులు నైటీలు లేదా వదులుగా ఉండే దుస్తులు వేసుకుంటే మంచిది. 


లక్షణాలివే.. 


పెట్టికోట్ క్యాన్సర్ వార్నింగ్ సంకేతాలంటూ పెద్దగా ఏమి ఉండవు. నడుము దగ్గర ర్యాష్ రావడం, చర్మం కందిపోవడం, అల్సర్ పుండ్లు, స్కిన్ ఇరిటేషన్, రంగు మారడం వంటివి పెట్టికోట్ క్యాన్సర్ లక్షణాలుగా చెప్తున్నారు నిపుణులు. 


తీసుకోవాల్సిన జాగ్రత్తలు 


చీరలోపల ధరించే ఫ్యాబ్రిక్స్ స్మూత్​గా, బ్రీతబుల్​గా ఉండాలి. స్కిన్​పై ఎలాంటి మచ్చలు, గాయాలైనా జాగ్రత్తపడాలి. వైద్యుల సహాయం తీసుకుంటే క్యాన్సర్​ రాకుండా కాపాడుకోవచ్చు. 



Also Read : ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకునే ముందు.. ఈ క్యాన్సర్ గురించి ప్రతి అమ్మాయి తెలుసుకోవాల్సిన విషయాలివే





గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.