‘‘అరే కాస్త, దూరంగా జరగరా.. నీ నోరు కంపు కొడుతోంది. భరించలేకపోతున్నాం’’ అని మీ ఫ్రెండ్స్ ఎవరైనా అంటే.. చాలా బాధగా ఉంటుంది కదూ. మీరు నోరు ఎంత శుభ్రం చేసుకున్నా సరే.. కంపు మాత్రం ఆగదు. అంటే, నోటి నుంచి కంపు రావడానికి కేవలం నోటి శుభ్రత మాత్రమే కారణం కాదు. కొన్ని అనారోగ్య కారణాలు వల్ల కూడా నోరు కంపు కొట్టవచ్చు.
నోటి నుంచి వచ్చే దుర్వాసన మౌత్ వాష్ లేదా చూయింగ్ గమ్‌తో వదిలించుకోవచ్చు. కానీ, తరచుగా అదే సమస్య పదే పదే వస్తుంటే? తప్పకుండా దానికి గల కారణాన్ని తెలుసుకోవాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. నోటి దుర్వాసనకు మనం తీసుకున్న ఆహారమే కారణం కాకపోవచ్చు. నోటిలోకి చెడు బ్యాక్టీరియా చేరినా సరే దుర్వాసన వస్తుంది.
నోటి దుర్వాసనకు కారణాలివే
⦿ నాలుక మీద పాపిల్లే అనే చిన్నచిన్న బొడిపెలతో ఉంటుంది. తీసుకున్న ఆహార కణాలు, బ్యాక్టీరియా ఈ బొడిపెల మధ్య చిక్కుకుని నాలుక మీద తెల్లని పొర మాదిరిగా ఏర్పడుతుంది. ఇది నోటి దుర్వాసనకు కారణం అవుతుంది.
⦿ కొంత మందికి నోటితో శ్వాస పీల్చుకునే అలవాటు ఉంటుంది. వీరిలో నాలుక మీద ఈ తెల్లని పొర ఏర్పడుతుంది. దాని వల్ల కూడా నోరు కంపు కొడుతుంది.
⦿ పొగ తాగేవారిలో క్యాన్సర్ కు చికిత్స తీసుకుంటున్న వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. రోగనిరోధకత తక్కువగా ఉండే వారిలో ఇలా నాలుక తెల్లబడుతుంది.
⦿ తెల్లని నాలుక ఏర్పడకూడదు అంటే.. దంతాలు క్లీన్ చేసుకునే సందర్భంలోనే నాలుకను కూడా బ్రష్ తో శుభ్రం చేసుకోవాలి.
⦿ నోటిలో పేరుకుపోయిన కాలిక్యులస్ నోటి దుర్వాసనకు కారణం కావచ్చు.
⦿ ప్లేక్ (పళ్లకు అంటుకొని ఉండే పాచి) ఉందని కూడా మీకు తెలియకపోవచ్చు. ఈ ప్లేక్ ను కాలిక్యులస్ లేదా టార్టర్ అని కూడా అంటారు.
⦿ దంతాల మీద ఉండే ఈ తేలిక పాటి పొర కళ్లకు కనిపించదు. రోజు వారీ బ్రష్షింగ్‌తో కూడా సాధ్యం కాదు. దాన్నే గార పట్టిన పళ్లని కూడా అంటారు.
⦿ ఇది ఎక్కువగా బ్రష్ చొరబడని చోట ఏర్పడుతుంది. పసుపు పచ్చ నుంచి బ్రౌన్ కలర్‌లోకి మారిపోయి పళ్ల అందాన్ని చెడగొడుతుంది. దాని వల్ల నోరు ఎప్పుడూ కంపు కొడుతూనే ఉంటుంది. అలా జరిగినపుడు తప్పనిసరిగా డెంటిస్ట్‌ను కలవాలి. వారు మాత్రమే దాన్ని తొలగించగలరు.
⦿ ఈ పాచిని శుభ్రం చెయ్యడానికి ఇప్పుడు ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌లు అందుబాటులో ఉన్నాయి. ఫ్లోరైడ్ టూత్ పేస్ట్‌ను అస్సలు ఉపయోగించకూడదు. ఫ్లాసింగ్ తప్పకుండా చేసుకోవాలి. యాంటీ బ్యాక్టీరియల్ మౌత్ వాష్ వాడాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.