Kodali Nani : టీడీపీ అధినేత చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి అమాయకులు బలి అవుతున్నారని గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. గుంటూరు సభలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు చనిపోవడానికి కారణం చంద్రబాబేనని ఆరోపించారు. ఏడాది చివర్లో ఎనిమిది మంది, కొత్త ఏడాది ప్రారంభంలో ముగ్గురి ప్రాణాలు బలితీసుకున్నారని చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు శనిగ్రహాన్ని మించిన దశమ గ్రహమంటూ ధ్వజమెత్తారు. బాబు సభలకు అనుమతి ఇవ్వకూడదని కొడాలి నాని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు తమ నేరాన్ని పోలీసులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ప్రభావం శూన్యమని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. 


యమ రథంతో చంద్రబాబు


 యమ రథంతో చంద్రబాబు ప్రజలను చంపుతున్నారని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానుకలిస్తామని చెప్పి ముగ్గురు మహిళల ప్రాణాలను బలితీసుకున్నారన్నారు.  ఏడాది చివర్లో 8 మందిని, ప్రారంభంలో ముగ్గురిని బలితీసుకున్న వ్యక్తి చంద్రబాబు అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.  చంద్రబాబు బహిరంగ సభలకు ఇకపై అనుమతి ఇవ్వకూడదని కొడాలి నాని డిమాండ్ చేశారు. మొదలు, చివర తెలియని ఎన్నారైలు నిర్వహించిన ఇలాంటి సభలకు బుద్ధున్న వాళ్లు ఎవరు వెళ్లరని విమర్శించారు. తమనేరాన్ని పోలీసులపై నెట్టేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ సభలకు సూచనలు చేస్తే, పోలీసులు తమపై ఆంక్షలు విధిస్తున్నారని రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. గుంటూరు తొక్కిసలాట నూటికి నూరు శాతం చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితోనే జరిగిందని స్పష్టం చేశారు.  


ఇలాంటి కార్యక్రమాలకు ఎవరైనా వెళ్తారా? 


"వైసీపీ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత ఉంది. జనం నాకు బ్రహ్మరథం పెడుతున్నారని చంద్రబాబు చూపించుకోవడానికి ప్రయత్ని్స్తున్నారు. కందుకూరులో ఇరుకు సంధులో సభ పెట్టి తొక్కిసలాటకు కారణం అయ్యారు. నిన్న గుంటూరులో చంద్రన్న కానుకల పేరుతో పేద మహిళలకు స్లిప్పు పంచారు. మధ్యాహ్నమే సభ మొత్తం నిండిపోతే చంద్రబాబు సాయంత్రం వరకూ రాలేదు. కానుకల కోసం పేదలందరూ వచ్చారు. ఈ సభను చంద్రబాబు రాజకీయవేదికగా వాడుకున్నారు. వైసీపీ ప్రభుత్వ తిట్టడానికి ఈ సభను వాడుకున్నారు. ఓ నలుగురికి కానుకలు ఇచ్చి చంద్రబాబు వెళ్లిపోయారు. ఓ ఫౌండేషన్ పరంగా ఇచ్చే కార్యక్రమాలకు ఎవరైనా వెళ్తారా?. పబ్లిసిటీ పిచ్చితో చంద్రబాబు ఈ కార్యక్రమాలు వెళ్తున్నారు. వచ్చేది మన ప్రభుత్వమే అని మభ్యపెట్టి టీడీపీ కార్యకర్తలు, నేతలు, ఎన్నారైలు ఇలాంటి కార్యక్రమాలు పెడుతున్నారు." - కొడాలి నాని  


పబ్లిసిటీ పిచ్చి - మంత్రి రోజా


టీడీపీ అధినేత చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో అమాయకుల ప్రాణాలు తీస్తున్నారని మంత్రి రోజా విమర్శించారు. చంద్రబాబు సభలకు జనం రావడంలేదని చీరలిస్తాం, నిత్యావసర సరుకులు ఇస్తామని మభ్యపెట్టి ప్రజలను సభలకు తరలిస్తున్నారని ఆరోపించారు. గుంటూరు తొక్కిసలాటకు చంద్రబాబే కారణమని మండిపడ్డారు. చందన్న కానుక పేరుతో ప్రజలను మభ్యపెట్టి సభకు తరలించారన్నారు. ముందు 30 వేల మందికి నిత్యావసరాలు ఇస్తామని చెప్పి, కొంతమందికి ఇచ్చి మిగిలిన వాళ్లను ఇంటికి పంపిస్తామని చెప్పడంతో ఆందోళన చెందారన్నారు. లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చామని ఎక్కడా ఒక్క దుర్ఘటన జరగలేదన్నారు. జగన్ మోహన్ రెడ్డి లక్షల కిలోమీటర్లు పాదయాత్ర చేశారని, ఎక్కడా ఒక్క చిన్న తొక్కిసలాట జరగలేదన్నారు. ఒక మీటింగ్ పెడుతున్నప్పుడు పార్టీ బాధ్యత కూడా ఉంటుందని, ఎక్కడ మీటింగ్ పెడితే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందో చూసుకోవాలన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే కనీస జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కానీ గుంటూరు సభలో ఇలాంటి జాగ్రత్తలు లేవని ఆరోపించారు.