పిల్లలను కనాలని ప్లానింగ్ ఉన్న వాళ్లు చేపలు తినడం మానేయమని సూచిస్తున్నారు అధ్యయనకర్తలు. ‘చేపలు తినడం మానేస్తే ఎలా? వీళ్లు ఇలాగే చెబుతారు’ అని విసుక్కోకండి. పూర్తిగా చదివితే ఎందుకు చేపలు వద్దంటున్నారో అర్థమవుతుంది. చేపలు మంచివే, కానీ మనమే వాటిని విషపూరితం చేస్తున్నాం. అందుకే పిల్లల్ని కనాలన్న ప్లాన్ ఉంటే ముందునుంచే చేపల్ని దూరం పెట్టమని సూచిస్తున్నారు. అమెరికన్ సొసైటీ ఫర్ రిప్రొడక్టివ్ మెడిసిన్ సంస్థతో పాటూ, అమెరికన్ కాలేజ్ ఆఫ్ అబ్ స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ సంస్థలు కలిసి మరీ ఈ విషయంపై తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి. దానికి ముందు వారు ఎన్నో అధ్యయనాలు కూడా నిర్వహించారు. 


 చేపలు ఎందుకు తినకూడదు?
సముద్ర జలాల్లో, నదుల్లో వ్యర్థ పదార్థాలు అధికంగా కలుస్తున్నాయి. వాటిల్లో ఎన్నో రసాయనాలు కూడా ఉన్నాయి. పరిశ్రమల వ్యర్థాలైన పాలక్లోరినేటెడ్ బైఫైనైల్ పై నిషేధం ఉన్నప్పటికీ ఇప్పటికీ అది జలాల్లో కలుస్తూనే ఉంది. వాటి ప్రభావం చేపలపై అధికంగా ఉంటుంది. ముఖ్యంగా పాదరసాన్ని చేపలు తమలో నింపుకుంటాయి. వాటిని మనం తినడం వల్ల పాదరసం మన శరీరంలో చేరుతుంది. క్యాన్సర్ కారక లోహాల్లో ఇదీ ఒకటి. డయాబెటిస్, గుండె సంబంధ సమస్యలు రావడానికి పాదరసం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. నిజానికి కూరగాయల్లో కూడా కాస్త పాదరం ఉంటుంది, కానీ 78 శాతం పాదరసం చేపల ద్వారానే మన శరీరంలో వస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. చేపల ద్వారా శరీరంలోని చేరిన పాదరసం నేరుగా మనిషి మెదడుపై ప్రభావం చూపిస్తుంది. 


పుట్టబోయే బిడ్డపై ప్రభావం
గర్భిణిలు చేపలు తినడం తగ్గించాలని ఎప్పుడు అమెరికాలోని ఆరోగ్యసంస్థలు చెప్పాయి. దానికి కారణం పాదరసమే. పాదరసం కలిగిన చేపలను తినడం వల్ల పిండంపై చాలా ప్రభావం చూపిస్తుంది. శిశువులు అసాధారణంగా పుట్టడం, న్యూరోటాక్సిసిటీతో కళ్లు లేనివారిగా, మానసిక, శారీరక ఎదుగుదల లోపంతో పుట్టే అవకాశం ఉంది. అధ్యయనంలో భాగంగా గర్భంతో ఉన్నప్పుడు చేపలు తిన్న తల్లులను ఎంపిక చేసుకున్నారు. వారిలో తల్లులను ఒక వర్గంగా, శిశువులను ఒక వర్గంగా విభజించారు. వారిలో జుట్టుని పరిశోధించడం ద్వారా పాదరసం స్థాయిలను నిర్ధారించారు.పాదరసం స్థాయిలు తక్కువగా ఉన్న తల్లులకు పుట్టిన బిడ్డలతో పోలిస్తే, పాదరసం స్థాయిలు అధికంగా ఉన్న తల్లులకు పుట్టిన బిడ్డల్లో చిన్నమెదడు కొలతల్లో తేడాలు వచ్చాయి. చిన్నమెదడు 1.6మి.మీ చిన్నదిగా ఉంది. అంటే మెదడు ఎదుగుదలపై పాదరసం ప్రభావం చూపించింది. అందుకే పిల్లల్ని కనేందుకు ప్లానింగ్ ఉన్న వారు, గర్భిణిలు చేపలను తినకూడదు అని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.


ఎన్నో నెలలు...
ఒకరి శరీరంలో చేరిన పాదరసం బయటికి పోవడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. అందుకే పిల్లలు వచ్చే ఏడాది కనే అవకాశం ఉందనే ఆలోచన ఉంటే ముందుగానే చేపలు తినడం మానేయాలి తల్లి. పరిశోధకులు మాట్లాడుతూ మహిళ రక్తంలో ఉన్న పాదరసం బయటకు త్వరగానే పోవచ్చని, కానీ మెదడు నుంచి బయటకు రావడానికి మాత్రం దశబ్ధాలు పడుతుందని చెప్పారు. కొన్ని అధ్యయనాలు దాదాపు శరీరం నుంచి పూర్తిగా పాదరసం బయటికి పోవడానికి 27 ఏళ్లు పట్టే అవకాశం ఉందని చెప్పాయి. అందుకే పెళ్లి వయసు దగ్గరగా ఉన్న అమ్మాయిలు పిల్లలు పుట్టే వరకు చేపలు తినడం ఆపేయడం మంచిది అని సూచిస్తున్నారు అధ్యయనకర్తలు. 



Also read: ఈ మూడు ఆహారాలు వీర్యకణాల సంఖ్యను తగ్గిస్తాయి, హెచ్చరిస్తున్న అధ్యయనాలు