నలభై ఏళ్లు దాటాయో డయాబెటిస్ వస్తుందనే భయం పెరిగిపోతుంది. మధుమేహం ఎందుకు వస్తుందో చాలా మందికి తెలియదు. కొందరు తెల్లన్నం అధికంగా తినడం వల్ల వస్తుందని, మరికొందరు స్వీట్లు, చక్కెర అధికంగా తింటే వస్తుందని అనుకుంటారు. నిజానికి ఈ రెండూ కూడా నిజాలు కావు. డయాబెటిస్ వచ్చాక తెల్లన్నం, స్వీట్లు తినడం తగ్గించాలి. కానీ వాటివల్లే మధుమేహం వస్తుందని ఎక్కడా ఆధారాల్లేవు. వైద్యులు కూడా ఆ అభిప్రాయం కేవలం అపోహేనని కొట్టిపడేశాయి. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోయినప్పుడు డయాబెటిస్ వస్తుంది. అలా తగ్గిపోవడానికి ఒత్తిడి, ఊబకాయం, చెడు అలవాట్లు, చెడు జీవనశైలి కూడా కారణాలే. అంతేకాదు వంశపారంపర్యంగా కూడా మధుమేహం వచ్చే అవకాశం ఉంది. 


అన్నం మంచిదే కానీ...
నిజానికి  ప్రకృతిలో సహజంగా లభించే ఆహారాలన్నీ మంచివే. కానీ వాటిని శుధ్ధిచేసే ప్రక్రియలోనే వాటి సహజగుణాలను కోల్పోయేలా చేస్తాము. తెల్లన్నం కూడా అంతే. నిజానికి పొట్టుతీయని బియ్యం ఎంతో బలం, ఆరోగ్యం కూడా. కానీ వాటికి పాలిష్  పట్టించి పోషకాలన్నీ పోయేలా చేస్తాము. పోషకాలు లేని ఆ తెల్లనాన్ని తింటాము. పొట్ట తీయని బియ్యంతో వండిన వంటకాలు డయాబెటిస్ రోగులు తినవచ్చు. కానీ పాలిష్ చేసిన బియ్యంతో వండినవి మాత్రం చాలా తక్కువ తినాలి. ఇందులో అధికంగా పిండి పదార్థాలు ఉంటాయి. అంతే కాదు తెల్లన్నం గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా ఎక్కువ. అందుకే డయాబెటిస్ బారిన పడ్డాక మాత్రం అన్నాన్ని తగ్గించమని సూచిస్తారు. కేవలం అన్నం మాత్రమే తగ్గిస్తే సరిపోదు, పిండి పదార్థాలు అధికంగా ఉండే ఆహారాలన్నీ తక్కువగా తీసుకోవాలి. అందుకే న్యూట్రిషనిస్టు సలహాలు తీసుకోవాలి. ఏ ఆహారాలు తగ్గించాలో, ఏవి తినాలో కూడా అవగాహనా పెంచుకోవాలి. చాలా మందికి ఈ విషయంలో అవగాహన లేదు. మనదేశ జనాభాలో 10 శాతం మందికి పైగా డయాబెటిస్ రోగులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 


తినాల్సినవి...
డయాబెటిస్ బారిన పడిన వారి ఎముకలు త్వరగా బలహీనపడతాయి. కాబట్టి ఆహారంలో ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండేలా చూసుకోవాలి. అన్నం తగ్గిస్తే ఆకుకూరలు, పప్పులు, చికెన్, గుడ్లు, చేపలు, పనీర్, పెరుగు వంటివి అధికంగా తినాలి. చక్కెర, బెల్లం పూర్తిగా తినడం మానేసి పళ్లు తినాలి. నీళ్లు అధికంగా తాగాలి. రాత్రి త్వరగా భోజనం ముగించాలి. తిన్నవెంటనే నిద్రపోకూడదు. 


గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.


Also read: కొత్త జంటలకు ఉత్తమ హనీమూన్ డెస్టినేషన్ అండమాన్ నికోబార్ దీవులు, అక్కడికి ఎలా వెళ్లాలి? ఎంత ఖర్చువుతుంది?


Also read: ఈ మూడు ఆహారాలు వీర్యకణాల సంఖ్యను తగ్గిస్తాయి, హెచ్చరిస్తున్న అధ్యయనాలు