ఆంధ్రప్రదేశ్ లో స్మార్ట్ సిటీ ( AP Smart City ) కార్పొరేషన్ల చైర్మన్లు వరుసగా రాజీనామా చేస్తున్నారు. వైఎస్ఆర్‌సీపీ ( YSRCP ) ద్వితీయ శ్రేణి నేతలకు కార్పొరేషన్ చైర్మన్లుగా ఆ పార్టీ హైకమాండ్ నామిటేటెడ్ పోస్టులు ఇచ్చింది. పదవుల నియామకాల్లో సాంకేతిక సమస్యలు ఏర్పడటంతో రాజీనామా చేయాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు అందరూ వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. వాస్తవానికి స్మార్ట్ సిటీ కార్పొరేషన్లకు కలెక్టర్ లేదా మున్సిపల్ కమిషనర్ మాత్రమే చైర్మన్‌గా ఉండాలి. అవి రాజకీయ పదవులు కాదు. అయినా ప్రభుత్వం రాజకీయ పదవులుగా పంపిణీ చేసింది. వారు విధులు కూడా నిర్వహిస్తున్నారు.  


ఇంటి పన్ను కట్టకపోతే ప్రభుత్వ పథకాలు బంద్, అమలాపురంలో అధికారుల అత్యుత్సాహం!


జాతీయ స్థాయిలో కేంద్రం పలు నగరాలు, పట్టణాలను గుర్తించి వాటిని స్మార్ట్‌ సిటీల పేరిట అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ( Central Governament ) ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించిన నిధులను తానే ఇస్తోంది. అభివృద్ధి ప్రణాళికలకూ కేంద్రమే ఆమోదం తెలుపుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరించే ఈ స్మార్ట్‌ సిటీలపై పురపాలక శాఖ ఉన్నతాధికారులే అధికారికంగా నిర్ణయాలు తీసుకుంటారు. కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం, అమరావతిలను కేం ద్రం స్మార్ట్‌ సిటీలుగా ప్రకటించగా.. రాష్ట్రప్రభుత్వం 33 స్మార్ట్‌ సిటీలను ప్రకటించింది. ఇందులో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో చెరో మూడు, గ్రేటర్‌ విశాఖలో నాలుగు, తూర్పుగోదావరిలో ఐదు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరులలో ఆరేసి చొప్పున ఉన్నాయి. 


'ఆర్ఆర్ఆర్'లో కోడి కత్తి, ఖైదీ సీఎం - నాగబాబు వెటకారం! వైఎస్ వివేకాది సహజ మరణమా?


వీటికి అనధికారిక పోస్టులను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అయినప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చైర్మన్లగా పార్టీ నేతలను నియమించారు. పదవీకాలం రెండేళ్లుగా పేర్కొన్నారు. వీరికి గౌరవ వేతనమూ లేదు. అధికారమూ లేదు. దీంతో ఎలాంటి ఇబ్బంది రాదని ప్రభుత్వం అనుకుంది. అయితే స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ల పేరుతో కొంత మంది అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.  వీరి పనితీరుపై కేద్రానికి సమాచారం వెళ్లడం.. పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా అందడంతో స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులకు చట్టబద్ధత లేదని కేంద్రం నుంచి స్పష్టమైన ఆదే్శాలు పంపింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్లు  అందరూ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్లుగా తెలుస్తోంది. ఈ కారణంగా పదవులను వదులుకోవాల్సిన పరిస్థితి వైఎస్‌ఆర్‌సీపీ నేతలకు ఏర్పడింది.