Jaggareddy on Revanth Reddy: దేశ ప్రజలకు మేలు చేసే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీనే అని, సోనియా, రాహుల్ గాంధీనే జనాలకు మంచి చేస్తారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చాలా తక్కువ సమయంలోనే ఎదిగానని అన్నారు. తనకు కాంగ్రెస్‌లో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారు. తనకు ఉన్న స్వభావాన్ని బట్టి, ఉన్నది ఓపెన్‌గా మాట్లాడతానని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక రాజకీయంగా నష్టం జరుగుతుందని చెప్పానని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తెలంగాణ ద్రోహిగా ముద్ర పడ్డానని అన్నారు. ఇప్పుడు అందరూ ఆ విషయాన్ని అంగీకరిస్తున్నారని అన్నారు. హైదరాబాద్‌లో జగ్గారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.
తనతో పాటు తెలంగాణ కాంగ్రెస్‌లో పలువురు నాయకులు పీసీసీ చీఫ్ ఆశించామని అన్నారు. సోనియా, రాహుల్ మొత్తానికి రేవంత్ రెడ్డికి ఇచ్చారని, అది జరిగిపోయిన కథ అంటూ చెప్పారు. ‘సోనియా, రాహుల్ గాంధీ ఎంతో గొప్ప ఫ్యామిలీ. వారి త్యాగాలు మరువలేనివి. రాజీవ్ గాంధీ హత్య నిందితులు జైలులో ఉంటే వారికి సోనియా గాంధీ క్షమాభిక్ష పెట్టారు. మహాత్మా గాంధీ తరహాలోనే సోనియా గాంధీ కుటుంబం’ అని కొనియాడారు. అలాంటి వారికి చెందిన పార్టీలో తాను ఉండడం తన అద్రుష్టమని అన్నారు.
‘‘కొంత మంది సోషల్ మీడియా ద్వారా నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డితో పని చేయడానికి అభ్యంతరం లేదని చాలా సందర్భాల్లో చెప్పినా. ఆయన కుర్చీలో నేను సోనియా, రాహుల్ నే చూస్తానని చెప్పినా. అయినా నాపైన సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆఖరికి శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్కపైన కూడా వేరే పార్టీల కండువాలు కప్పుతున్నరు.
20 రోజుల్లో 2 ఘటనలు జరిగాయి. దైవసాక్షిగా చెప్తున్నా. 20 రోజుల క్రితం సీఎల్పీ సమావేశానికి ముందు రేవంత్ నాకు ఫోన్ చేసి నేను మెదక్ పోతున్న అని చెప్పిండు. జగ్గన్నా నేను మెదక్ పోతున్నా.. ఆడ మనోళ్లు ఉంటే చెప్పవా అని అడిగిండు. నన్ను రమ్మని చెప్పలే. రెండు గంటల తర్వాత దామోదర నర్సింహ గారు నాకు ఫోన్ చేసిన్రు. తాను కూడా వస్తున్నట్లు చెప్పిన్రు. రేవంత్ నాకు ఒకలా ఆయనకు మరోలా చెప్పిండు. నాకు కోపం స్టార్ట్ అయింది. నేను పార్టీ కోఆర్డినేటర్ మహేశ్ గౌడ్‌కి ఫోన్ చేసి తిట్టిన. రేవంత్ మళ్లీ నాకు ఫోన్ చేసిండు. నేను ఫోన్ లేపలే. తెల్లారి ఫోన్ చేసిండు. జగ్గన్న.. నువ్వు నేను మెదక్ చర్చికిపోదామన్నడు.
చివరికి రేవంత్, కుసుమకుమార్, దామోదర నర్సింహ కలిసి వెళ్లిపోతున్నరు. నాకు బాగా కోపం వచ్చింది. నాకు చీము నెత్తురు ఉంటది కదా. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ని అయిన నన్నే పట్టించుకోలేదు. నువ్వు తెలిసి చేసినవా.. తెలియక చేసినవా? తెల్వక చేస్తే నువ్వు పీసీసీకి అర్హుడివా కదా? తెలిసి చేస్తే నువ్వు కలుపుకుపోయే పీసీసీ కాదా? నువ్వే తేల్చుకో. తెల్లారి సీఎల్పీ మీటింగ్‌కి వచ్చి రేవంత్ రెడ్డిని అడుగుదాం అనుకున్నా. చివరికి బైకాట్ చేసి వెళ్లిపోయినా. రేవంత్ రెడ్డి ప్రవర్తన ఇది కరెక్టేనా? జగ్గారెడ్డికే ఈ లెవెల్‌లో జరిగితే.. ఇక మామూలు లీడర్ల పరిస్థితి ఏంటి?’’
‘‘నాకు కాంగ్రెస్ పార్టీపై ఉన్నది వ్యతిరేకత కాదు. ఒక వ్యక్తికి.. మరో వ్యక్తికి మధ్య ఉన్న గొడవ. సిద్ధం అంటే రేవంత్ రెడ్డితో ఫేస్ టు ఫేస్‌కి రెడీ. నా పరిస్థితి ఎలా ఉందంటే ముత్యాల ముగ్గు సినిమాలో ఓ సీన్ లాగా పరిస్థితి అయింది. నన్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తొలగించి రేవంత్ ఝలక్ ఇచ్చాడు. రేవంత్ రెడ్డికి ఫ్యూచర్‌లో నేను ఝలక్ ఇస్తా. నేను సోనియా రాహుల్‌ని కాదు. రాజకీయంగా ఝలక్‌లు ఎలా ఇస్తానో చూడు. నాకు ఝలక్ ఇవ్వకపోతే ఈ రోజు నాకు ఇంత కోపమే రాదు. ప్రెస్ మీట్ కూడా పెట్టెటోడ్ని కాదు.’’ అని జగ్గారెడ్డి అన్నారు.