తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్యలతో కొట్టు మిట్టాడుతోంది. గ్రామ స్థాయిలో బలమైన క్యాడర్ ఉంది.. నాయకత్వం ఉండి కూడా పై స్థాయిలో నాయకత్వంలో ఐక్యత లేక రేసులో ఉన్నారో లేదో తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. ఒకరు ముందుకెళ్తే మరొకరు వెనక్కి లాగుతున్నారు.  వారు అధికారపక్షంతో కుమ్మక్కయ్యారని ఇతరులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు..ప్రత్యారోపణల రాజకీయాలు అలా చేసుకుంటున్నారు కానీ.., పార్టీ తమ తీరుతో తీవ్రంగా నష్టపోతోందని ఎవరూ ఆలోచించడం లేదు. ఫలితంగా కాంగ్రెస్ పరిస్థితి  రాను రాను తీసికట్టుగా మారుతోంది.


హద్దులు దాటిపోయిన కాంగ్రెస్ అంతర్గత ప్రజాస్వామ్యం !


కాంగ్రెస్ పార్టీలో ( Congress ) అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ.. అని ఆ పార్టీ నేతలు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఆ పార్టీలో నేతలు తమలో తాము రాజకీయాలు చేసుకుని పైచేయి సాధించేందుకు సొంత పార్టీకి నష్టం చేయకూడానికి కూడా వెనుకాడరు. దానికి వారు ముద్దుగా అంతర్గత ప్రజాస్వామ్యం అని పేరు పెట్టుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో (Telangana ) ఈ అంతర్గత ప్రజాస్వామ్యం ఆ పార్టీని ఏ దిశగా తీసుకెళ్తుందో చెప్పడం కష్టంగా మారింది. పార్టీ కోసం ఒకరు కష్టపడుతున్నారంటే.. ఆ కష్టం వల్ల పార్టీకి లాభం వస్తుందో లేదో కానీ.. ఆ నేతకు మైలేజీ వస్తుందని.. అలాంటిది రాకూడదని అసంతృప్త వాదులు రెబల్ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. సీనియర్ల మీటింగ్‌లు పేరుతో హడావుడి చేస్తున్నారు. ఫలితంగా ప్రజల్లో కాంగ్రెస్ వేరే విధంగా ప్రజల్లో ఉంటోంది.


కొత్త పీసీసీ కష్టం అంతా సీనియర్ల రాజకీయానికి బలి !


తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి ( Revant Reddy ) బాధ్యతలు చేపట్టిన తర్వాత క్యాడర్‌లో కాస్తంత ఊపు వచ్చింది. వలసలు ఆగిపోయాయి. పైగా చేరికలు కూడా ఉన్నాయి. గ్రామస్థాయిలో నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ క్యాడర్ కాస్త కదిలే ప్రయత్నం చేస్తోంది. ముందస్తు ఎన్నికలు వస్తాయని గట్టిగా నమ్ముతున్న రేవంత్ రెడ్డి కార్యకర్తలు అందర్నీ ఫీల్డ్‌లో ఉంచడానికి అనేక రకాల కార్యక్రమాలు చేపడుతున్నారు.  మన ఊరు - మన పోరు, సర్వోదయ యాత్ర అంటూ ఎప్పుడూ ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇలాంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు సీనియర్ల పేరుతో కొంత మంది తెరపైకి వస్తున్నారు. కొల్లాపూర్‌లో మన ఊరు - మన పోరు బహిరంగసభ పెట్టినప్పుడు ఎమ్మెల్యే జగ్గారెడ్డి ( Jagga reddy ) ..  ఆ కార్యక్రమానికి కవరేజీ రాకుండా మీడియా ముందుచాలా హడావుడి చేశారు. ఎల్లారెడ్డిలో ఆ కార్యక్రమం నిర్వహించినప్పుడూ అంతే. సీనియర్లు ప్రత్యేకంగా సమావేశాలు పెట్టి ...  మీడియాకు కాంగ్రెస్ నెగెటివ్ వార్తలను ఎక్కువగా ఇవ్వడానికి సహకరిస్తున్నారు. ఫలితంగా రేవంత్ రెడ్డి చేసే పోరాటాల కన్నా ఈ సీనియర్ల అసంతృప్తికే ఎక్కువ ప్రచారం లభిస్తోంది.  దీంతో కాంగ్రెస్‌కు వచ్చే మైలేజీ కాస్త ఈ సీనియర్ల రాజకీయానికి బలైపోతోంది. 


చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్న కాంగ్రెస్ హైకమాండ్ !


సీనియర్ల పేరుతో రచ్చ చేస్తున్న వారి వల్ల పార్టీకి నష్టమని స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ వారిపై చర్యలు తీసుకోవడానికి కాంగ్రెస్ హైకమాండ్ ( Congress HighCommend ) వెనుకాడుతోంది. ఈ విషయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏ మాత్రం నోరు జారడం లేదు. అందరి పట్ల బాగానే మాట్లాడుతున్నారు. కానీ ఆయనపై సీనియర్లు మాత్రం తగ్గడం లేదు. ఈ పరిస్థితి రేవంత్ రెడ్డికి హైకమాండ్ వద్ద మార్కులు తెచ్చి పెడుతూండగా.. పార్టీని ఇబ్బంది పెట్టాలనే అజెండాతోనే కొంత మంది అధికార పార్టీతో కుమ్మక్కయి ఇలా చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. హరీష్ రావుతో ( Harish Rao ) వీహెచ్ భేటీ అయిన తర్వాతనే సమావేశాలు, ప్రెస్ మీట్ల పేరుతో హడావుడి చేస్తున్నారని సాక్ష్యాలు కూడా ఉన్నాయని కొంత మంది కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇది సీనియర్లకు ఇబ్బందికరమైన ఆరోపణే. తాము పార్టీకి మేలు చేస్తున్నామని వారు చెప్పుకోవాల్సి ఉంది. 


కేంద్ర హైమాండ్‌కు జీ -23 తరహాలోనే్ టీ- 10 నేతలు !


కాంగ్రెస్ ఢిల్లీ హైకమాండ్‌కు జీ-23 పేరుతో కొంత మంది నేతలు అసమ్మతి కుంపటి పెట్టుకుని చికాకు తెప్పిస్తున్నారు. వారికి పార్టీలో ప్రాధాన్యం తగ్గిస్తున్నారు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అదే తరహాలో తెలంగాణలోనూ పది మంది సీనియర్ల పేర్లు ఈ జాబితాలో కనిపిస్తున్నాయి. అయితే మిగతా అందరూ గుంభనంగా అసంతృప్తి రాజకీయాలు చేసినా జగ్గారెడ్డి, వీహెచ్, కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారు మాత్రమే నోరెత్తుతున్నారు. వీరి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్నది కాంగ్రెస్ క్యాడర్‌ను వేధిస్తున్న ప్రశ్న. ఏ నిర్ణయమైనా త్వరగా తీసుకునేంటే కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుందన్న అభిప్రాయం ఆ పార్టీలో ఎక్కువగా వినిపిస్తోంది. లేకపోతే పంజాబ్‌లో ఏం జరిగిందో.. ఇక్కడా అదే జరుగుతుదని..అది స్వయంకృతమని ఆందోలన వ్యక్తం చేస్తున్నారు.