DS In dilemma as Congress keeps him waiting while BJP woos: ధర్మపురి శ్రీనివాస్.. నిజామాబాద్‌తో పాటు ఉమ్మడి ఏపీలో పరిచయం అక్కర్లేని నేత. రాజకీయ దీశాలి. నిజామాబాద్ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్). రాష్ట్ర కేబినెట్‌లో మంత్రి పదవులు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు సార్లు పీసీసీ ప్రెసిడెంట్ గా చేసిన అనుభవం ఆయన సొంతం. డీఎస్ పీసీసీగా ఉన్న రెండుసార్లు పార్టీ అధికారంలోకి రావటంలో కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పిన నేతగా పేరుంది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో డీఎస్ 2015 జూలై 8న టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం డీఎస్‌కు 2016లో రాజ్యసభకు పంపించారు సీఎం కేసీఆర్.
కాంగ్రెస్‌లో కీలకనేతగా చక్రం..
కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించిన డీఎస్ తనకు టీఆర్ఎస్ పార్టీలో అంతగా ప్రాధాన్యం దక్కలేదని భావించారు. చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ (BJP MP Dharmapuri Arvind) 2019లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగి కవిత మీద విజయం సాధించారు. దాంతో డీఎస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌కు లేఖ రాయటంతో డీఎస్ మరింత నొచ్చుకున్నారు. నాటి నుంచి టీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు డీఎస్.
త్వరలో ముగియనున్న గడువు..
డీఎస్ రాజ్యసభ పదవీ కాలం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. అయితే డీఎస్ ఏ పార్టీలోకి వెళతారు అన్న చర్చ నిజామాబాద్ జిల్లా పొలిటికల్ సర్కిల్ లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. డీఎస్‌కు రెండు రాష్ట్రాల్లో మంచి పేరుంది. వివాదాలకు దూరంగా ఉండే నేతగా పేరుంది. సీనియర్ లీడర్ బీసీ సామాజికవర్గంలో బడా లీడర్ డీఎస్. అయితే ఆయన పెద్ద కుమారుడు మాజీ మేయర్ సంజయ్ కాంగ్రెస్ లో చేరనున్నారనే ప్రచారం జోరుగా నడిచింది. సంజయ్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలవటంతో కాంగ్రెస్ లోకి చేరటం పక్కా అని భావించారు.
సోనియాతో చర్చలు జరిపారు, కానీ !
డీఎస్ ఢిల్లీలో సోనియా గాంధీని కూడా కలిశారు. ఇక కాంగ్రెస్‌లో ఎంట్రీకి ముహూర్తమే తరువాయి అనుకున్నారంత. కానీ డీఎస్ మదిలో ఏముందన్నది పాలోఅర్స్‌కు అంతుచిక్కడం లేదు. డీఎస్ ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు చిన్న కుమారుడు ఎంపీ అరవింద్ బీజేపీలో తక్కువ సమయంలోనే టాప్ లీడర్‌గా ఎదిగారు. పార్టీలో కీ రోల్ పోషిస్తున్నారు. బీజేపీ లో రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అరవింద్. కేంద్రం పెద్దలతో కూడా సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. డీఎస్ బీజేపీలోకి చేరుతారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే అరవింద్ మాత్రం తండ్రి నిర్ణయాన్ని గౌరవిస్తారు.
డీఎస్ రాజ్యసభ పదవి కాలం కొన్ని రోజుల్లో ముగియనుండటంతో ప్రస్తుతం ఆయన పొలిటికల్ ఫ్యూచర్ ప్లాన్ పై జిల్లాలో చర్చ జరుగుతోంది. డీఎస్ మాత్రం ఏ పార్టీ లోకి వెళతారు అన్నదానిపై క్లారిటీ ఇవ్వటం లేదు. అటు డీఎస్ పెద్ద కొడుకు సంజయ్ కూడా తండ్రి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. తండ్రి డీఎస్ ఏ పార్టీలో ఉంటే ఆయన వెంటే నడుస్తారు సంజయ్. అయితే డీఎస్ పొలిటికల్ అనుభవం పార్టీలకు ఎంతో కలిసొస్తుందని ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ భావిస్తున్నాయి. కానీ డీఎస్ ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతారో అన్న దానిపై క్లారిటీ మాత్రం లేదు. డీఎస్ టీఆర్ఎస్ లో కొనసాగటం కష్టమే అంటున్నారు ఆయన అనుచరులు. డీఎస్ తన రాజకీయ అనుభవం దృష్ట్యా ఆయనకు తగిన బాధ్యతలు అప్పగించే పార్టీ వైపు మొగ్గుచూపే అవకాశాలు లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. డీఎస్ పొలిటికల్ ప్యూచర్ ప్లాన్ ఎలా ఉండనుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.
Also Read: Sircilla: జనశక్తి మళ్లీ జీవం పోసుకుంటోందా? ఆ వార్తల లీక్‌తో కలకలం - తెరవెనుక ఏం జరుగుతోందంటే